అలారం కీచెయిన్
అపరిచితులు మనల్ని వెంబడిస్తూ మనపై దాడి చేసే క్రమంలో ముందుగా నోటి పైనే అటాక్ చేస్తుంటారు. మనం అరిచినా ఇతరులకు తెలియకుండా ఉండేందుకు నోరు మూయడం లేదంటే నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేస్తుంటారు. సో.. ఇలా మనం అరవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామన్న విషయం అక్కడ సంచరించే వారికి తెలియాలంటే మన చేతిలో ‘అలారం కీచెయిన్’ ఉండాల్సిందే!
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం కీచెయిన్‌ను పోలి ఉంటుందిది. దీన్ని మన చేతి వేళ్లకు తొడగడం లేదంటే బ్యాగ్, మెడలో ట్యాగ్‌కు తగిలించుకోవడం వల్ల సులభంగా ఆపరేట్ చేయచ్చు. దీనికి పైభాగంలో ఉండే కీని లాగేసి.. ముందున్న బటన్‌ని రెండుసార్లు నొక్కితే భీకర శబ్దంతో అలారం మోగుతుంది. అలాగే దీనికి పక్క భాగంలో ఉండే బటన్ నొక్కితే ముందు భాగంలో ఉండే ఎల్‌ఈడీ లైట్ వెలుగుతుంది. దాన్ని ఎదుటివారి కళ్లలోకి ఫోకస్ చేసి వారి దాడిని అడ్డుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే ఈ గ్యాడ్జెట్‌తో మనం ఆపదలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వారి సహాయం తీసుకోవచ్చు. ఇక ఆపద నుంచి బయటపడ్డాక ముందున్న బటన్‌ని అలాగే నొక్కి పట్టుకుంటే అలారం ఆగిపోతుంది. ఆపై ముందుగా లాగిన కీని తిరిగి తొడిగితే సరిపోతుంది. అయితే మీరు బయటికి వెళ్లే ముందే మొబైల్‌లాగే దీని బ్యాటరీని కూడా పూర్తిగా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వివిధ రంగుల్లో, వేర్వేరు ఆకృతుల్లో రూపొందించిన ఈ అలారం కీచెయిన్స్ ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని లభిస్తున్నాయి. వాటి ఆకృతి, డిజైన్‌ను బట్టి ధర రూ. 780 నుంచి రూ. 1,299 వరకు ఉంటుంది.
సేఫ్టీ రాడ్
అపరిచితులు మనపై దాడి చేయకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడే మరో పరికరం సేఫ్టీ రాడ్.
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం కర్ర మాదిరిగా ఉండి.. దానికి పట్టుకోవడానికి కాస్త లావుగా ఉండే హ్యాండిల్ ఉంటుంది. దీంతో మనపై దాడి చేసే వ్యక్తిని కొట్టడం వల్ల వారికి కరెంట్ షాక్ తగిలి.. భరించలేనంత నొప్పి వస్తుంది. సో.. ఈ సేఫ్టీ రాడ్‌తో అపరిచిత వ్యక్తిపై దాడి చేసి మనం అక్కడ్నుంచి వెంటనే తప్పించుకోవచ్చు. పని పూర్తయ్యాక ఈ రాడ్‌ని ఫోల్డ్ చేసుకోవచ్చు కూడా! మళ్లీ కావాలనుకున్నప్పుడు హ్యాండిల్‌కి ఉన్న బటన్‌ని నొక్కితే స్టిక్ మాదిరిగా వస్తుంది. ఇలా హ్యాండ్-ఫ్రెండ్లీగా ఉండే ఈ గ్యాడ్జెట్ నాణ్యతను బట్టి ధర రూ. 358 నుంచి రూ. 625 వరకు ఉంటుంది.
పెప్పర్ స్ప్రే గన్
ఆత్మ రక్షణలో భాగంగా ఇప్పుడు చాలామంది మహిళలు బ్యాగుల్లో పెప్పర్ స్ప్రేను తమ వెంట తీసుకెళ్తున్నారు. అయితే దీనికి కాస్త అడ్వాన్స్‌డ్ వెర్షనే ‘పెప్పర్ స్ప్రే గన్’. పేరుకు తగ్గట్లే అచ్చం గన్ మాదిరిగా ఉంటుందిది. గన్ వెనకవైపు బుల్లెట్స్ ఉండే ప్రదేశంలో పెప్పర్ స్ప్రే బాటిల్ ఉంటుంది. ఇందులోని ద్రావణాన్ని కళ్లలోనే స్ప్రే చేయాలన్న నియమమేమీ లేదు.
శరీరంలో ఎక్కడ స్ప్రే చేసినా దాని ప్రభావం కళ్లు, ఇతర శరీర భాగాలపై విపరీతంగా ఉంటుంది. ఇందులోని ద్రావణం శరీరంపై దురద, మంట పుట్టేలా చేస్తుంది. దీన్ని స్ప్రే చేయాలంటే గన్కు ఉన్న ట్రిగ్గర్‌ని రెండుసార్లు నొక్కితే సరి.. ఇంకా ఆపద పొంచి ఉందనిపిస్తే ఇంకో రెండుసార్లు స్ప్రే చేస్తే ఎదుటి వ్యక్తిని కోలుకోకుండా చేయచ్చు. ఆ లోపు పోలీసులకు ఫోన్ చేయడం లేదంటే మనమూ అక్కడ్నుంచి తప్పించుకోవడం వంటివి చేయచ్చు. ఈ గన్ నాణ్యతను బట్టి ధర రూ. 4,990గా ఉంది.
లిప్‌స్టిక్ సెక్యూరిటీ ఫ్లాష్ లైట్
ఆపద ఎదురైనా లేదంటే మన వస్తువులు దొంగిలించినా సదరు వ్యక్తి నుంచి మనం తప్పించుకోవాలంటే, మన వస్తువుల్ని తిరిగి స్వాధీన పరచుకోవాలంటే వారిపై దాడి చేసి కాసేపు వారిని కదలనివ్వకుండా చేస్తే మనం సులభంగా అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఆ పని ‘లిప్‌స్టిక్ సెక్యూరిటీ ఫ్లాష్ లైట్’ చేస్తుంది.
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం లిప్‌స్టిక్ మాదిరిగా ఉంటుంది. దీనికి ముందు భాగంలో రెండు బటన్స్ ఉంటాయి. వాటిని ఏకకాలంలో నొక్కడం వల్ల దాన్నుంచి ఎల్‌ఈడీ లైట్, విద్యుత్ సదరు వ్యక్తిపై ఫోకస్ చేయచ్చు. తద్వారా ఆ లైట్ పడిన భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి కొన్ని నిమిషాల పాటు వారిని అక్కడి నుంచి కదలనివ్వదు. ఆ సమయంలో మనం ఈజీగా తప్పించుకోవచ్చు. ఇలా మహిళల రక్షణ కోసం రూపొందించిన ఈ చిన్న పరికరాన్ని కీచెయిన్ సహాయంతో చేతికి ఎప్పుడూ అందుబాటులో తగిలించుకోవచ్చు. దీన్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీని నాణ్యత, రంగు, డిజైన్‌ను బట్టి ధర రూ. 899 నుంచి రూ. 1,099 వరకు ఉంటుంది.
ఫింగర్ టిప్ రింగ్స్
ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆపద ఎదురైనప్పుడు ఏం చేయాలో చాలామందికి తోచదు. ఆ సమయంలో మనకు అందుబాటులో ఉన్న గ్యాడ్జెట్స్ ఆపరేట్ చేసే వీలు కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పదునైన ‘ఫింగర్ టిప్ రింగ్స్’ మనకు సహాయపడతాయి.
ఫొటోలో చూపించినట్లుగా పదునుగా మొనదేలి ఉంటాయి ఈ ఉంగరాలు. ఒకవేళ మీరు రాత్రి పూట ఒంటరిగా బయటికి వెళ్లాల్సి వస్తే.. వెళ్లే ముందే ఈ రింగ్స్‌ని గోళ్లకు అమర్చుకోవడం వల్ల ఆపద సమయాల్లో సత్వరమే స్పందించచ్చు. ఈ రింగ్స్‌తో అపరిచిత వ్యక్తిపై ప్రతి దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి రింగ్స్ వివిధ రకాల డిజైన్లలో లభ్యమవుతున్నాయి. మీరు తీసుకునే రింగ్స్ సంఖ్య, వాటి డిజైన్‌ను బట్టి ధర రూ. 380 నుంచి రూ. 2,799 వరకు ఉంటుంది.
చూశారుగా.. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న కొన్ని గ్యాడ్జెట్లు. సింపుల్‌గా ఉపయోగించడానికి వీలుగా ఉండే వీటిని మన వెంటే ఉంచుకొని వెంటనే అలర్ట్ అవడం వల్ల ఆపద సమయాల్లో అక్కడ్నుంచి తప్పించుకోవచ్చు.. ఆ వీలు లేకపోతే ఎమర్జెన్సీ నంబర్స్‌కి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆపద గురించి వారికి తెలియజేయచ్చు. ఇలా ఇవి కొంత వరకు మనకు రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయి.
ఇదీ చూడండి: 'ఉద్యోగాల్లో పెరిగిన లింగ వివక్ష'