భాను ప్రతాప్, ఫరీద్, అంకుష్... ముగ్గురిదీ ఉత్తర్‌ప్రదేశ్. భానుది గోరఖ్‌పుర్, ఫరీద్‌ది లఖ్‌నవూ కాగా అంకుష్‌ది ఘజియాబాద్. 2011-2015 మధ్య ఐఐటీ కాన్పూర్‌లో కలిసి చదువుకున్నారు. 2012లో వీరి క్యాంపస్‌లో యాహూ సంస్థ ‘హ్యాక్ యు’ పేరిట హ్యాకథాన్‌ను నిర్వహించింది. 24 గంటల్లో ఒక ప్రొడక్ట్‌ని తీసుకొచ్చే పోటీ అది. అందులో వేర్వేరుగా పోటీపడి అవార్డులు గెలుచుకున్నారు. ఆరోజే ఒకరికొకరు పరిచయమయ్యారు. కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులపైన ఉన్న ఆసక్తి వీళ్లని కలిపింది. తర్వాత తమ ఐఐటీ టెక్‌ఫెస్ట్‌లలో బృందంగా పోటీకి వెళ్లి ఎన్నో బహుమతులు గెలిచారు. నిర్భయ సంఘటన తర్వాత దిల్లీలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఎఫ్.ఐ.ఆర్. డేటాని క్రోడీకరించి ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో తెలిపే డేటాను అందించారు. బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉండగానే అద్దెకూ, అమ్మకానికీ అందుబాటులో ఉండే ఇళ్ల వివరాలతో ‘మొహల్లా డాట్‌కామ్’ను ప్రారంభించారు. కానీ దాంతో వారికి విజయం దక్కలేదు. తర్వాత క్యాంపస్‌లోనే దాదాపు 13 ఉత్పత్తుల్ని తెచ్చినా అవేవీ విజయవంతం కాలేదు. అయినా నిరుత్సాహపడలేదు. 2015లో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగాలు సాధించారు కానీ, చేరలేదు. ఎందుకంటే అప్పటికే వాళ్లు తెచ్చిన ఓ ప్రొడక్ట్‌మీద నమ్మకం ఏర్పడింది. అదే షేర్‌చాట్. క్యాంపస్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకుని షేర్‌చాట్ కార్యాలయాన్ని తెరిచారు.
ప్రాంతీయ భాషలకు ప్రత్యేకం...
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలనుంచి రావడంవల్లనేమో వీరి గురి ప్రధానంగా చిన్న నగరాలూ, పట్టణాలకు చెందిన ప్రజలపైనే ఉండేది. ఇండియాలో ఇంగ్లిష్ వచ్చినవాళ్లతో పోల్చితే ప్రాంతీయ భాషలు వచ్చినవాళ్లు అంతకు పదింతలు ఉన్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని క్యాంపస్‌లో ఉండగానే ఒపీనియో వెబ్‌సైట్‌ని తెచ్చారు. చదువులూ, క్రీడలూ, సాహిత్యం, రాజకీయాలూ, వ్యాపారం... ఇలా ఏ అంశంపైనైనా ఈ వేదికద్వారా ప్రాంతీయ భాషల్లో అభిప్రాయాల్ని పంచుకోవచ్చని చెప్పారు. అయితే, ప్రాంతీయ భాషల్లో సోషల్ నెట్‌వర్క్ అనేసరికి పెట్టుబడిదారులు ముందుకు రాలేదు. దాంతో దాన్నీ ఆపేయాల్సి వచ్చింది. అప్పుడే ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఉండే ఫీచర్లను ఒకే ఆప్‌లో తేవాలన్న ఆలోచన వచ్చింది వారికి. ఇది కూడా ప్రాంతీయ భాషల్లో ఉండాలనుకున్నారు. అదే షేర్‌చాట్. 15 భారతీయ భాషల్లో సమాచారాన్ని సృష్టించే, పంచుకునే అవకాశం ఇచ్చారు. షేర్‌చాట్‌కు మొదట్నుంచీ పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్లు వస్తున్నా, ‘భారతీయుల సోషల్ నెట్‌వర్క్’ అన్న కారణంగా ప్రారంభంలో పెట్టుబడిదారులు ఆసక్తి చూపేవారు కాదు. కానీ వినియోగదారుల స్పందనను చూసి షేర్‌చాట్‌ను కొనసాగించారా మిత్రులు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెసేజ్‌లను ప్రాంతం, కేటగిరీల వారీగా పంపించడంద్వారా షేర్‌చాట్‌కు ఆదరణ బాగా పెరిగింది. తర్వాత జియామీ, ట్విటర్‌లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీకి అంకుష్ సీఈఓ, భాను సీటీఓ కాగా... ఫరీద్ సీఓఓ. కంపెనీలో ముగ్గురికీ సమాన వాటా ఉంది.
ఇప్పుడు మాజ్...
ఈ మిత్రులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రోజు 2020 జూన్‌లో వచ్చింది. టిక్‌టాక్‌ని భారత్‌లో నిషేధించడంతో ఖాళీ అయిన స్వల్ప నిడివి వీడియో ఆప్‌ల మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకున్నారు. అందుకోసం కేవలం 30 గంటల్లో ఓ ఆప్‌ని రూపొందించారు. అదే మాజ్. 15 ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ అందుబాటులో ఉంది. వచ్చిన ఏడాదిలోపే 13 కోట్ల డౌన్‌లోడ్లు సంపాదించింది. ఇక్కడ షేర్‌చాట్ అనుభవమూ వీళ్లకి కలిసొచ్చింది. ప్రస్తుతం వీరి రెండు ఆప్‌లకూ దాదాపు 30 కోట్ల వినియోగదారులున్నారు. ఈ ఏప్రిల్‌లో రూ.15వేల కోట్ల వేల్యుయేషన్‌తో మొహల్లా టెక్ రూ.3500కోట్లు పెట్టుబడి పొందింది. వచ్చే అయిదేళ్లలో 100 కోట్లమందికి చేరాలని లక్ష్యం పెట్టుకున్నారు. ‘మా ప్రయాణం మొదట్లోనే చాలా వైఫల్యాల్ని చూశాం. ఆ సమయంలో మా సామర్థ్యంపైనే అనుమానాలు వచ్చాయి. అయినా మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ ముందడుగు వేశాం. పదేళ్లనుంచీ ఒకే చోట ఉంటున్నారు. అప్పుడు ఒకే క్యాంపస్‌లో, ఇప్పుడు ఒకే ఇంట్లో. ప్రతిరోజూ డిన్నర్ కలిసే చేస్తాం. ఆ సమయంలో వర్క్ విషయాలతోపాటు మా కష్టసుఖాల్ని చర్చించుకుంటాం. కొవిడ్‌కు ముందు ఏటా ముగ్గురం కలిసే ఏదైనా టూర్‌కి వెళ్లేవాళ్లం. మాది స్నేహబంధమే కాదు, సోదరబంధం కూడా’ అని చెబుతారు ఈ ముగ్గురూ. అందుకే భారతీయ అంకుర సంస్థల్లో వీరి స్థానం ఎంతో ప్రత్యేకం!