Safari Browser: యాపిల్ సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించే యూజర్లకు సైబర్ నిపుణులు కీలక సూచనలు చేశారు. సఫారీ బ్రౌజర్‌లోని బగ్ కారణంగా యూజర్ బ్రౌజింగ్, వ్యక్తిగత డేటాతో పాటు వారి గూగుల్ ఖాతా వివరాలు బహిర్గతం అవుతున్నట్లు గుర్తించామని అమెరికాకు చెందిన ఫింగర్‌ప్రింట్‌జేఎస్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. సఫారీ బ్రౌజర్లలో బ్రౌజింగ్ డేటా స్టోర్ చేసేందుకు ఉపయోగించే ఇండెక్సెడ్‌డీబీ అనే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)లో బగ్ ఉన్నట్లు తెలిపారు. ఇది బ్రౌజర్‌లో యూజర్ ఒక వెబ్ పేజ్ నుంచి మరో వెబ్ పేజ్‌కు మారుతున్నప్పుడు వివరాలను నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఒకే రకమైన డొమైన్ నేమ్‌లతో యూజర్లను మోసగించే నకిలీ వెబ్ పేజీలను ఒరిజినల్ వెబ్ పేజీలతో కలవనీయకుండా చేస్తుంది. దీనివల్ల యూజర్లు నకిలీ వెబ్‌సైట్లలో తమ వివరాలు నమోదు చేయకుండా ఉంటారు.
ప్రస్తుతం ఇందులోని బగ్ కారణంగా యూజర్ల సమాచారం బహిర్గతం అవుతున్నట్లు ఫింగర్‌ప్రింట్‌జేఎస్ తెలిపింది. ఇప్పటివరకు గూగుల్ సర్వీసులతో పాటు, ఇన్‌స్టాగ్రామ్, నెట్‌ఫ్లిక్స్, ట్విటర్, ఎక్స్‌బాక్స్ వంటి 30కిపైగా పాపులర్ వెబ్‌సైట్లకు సంబంధించిన యూజర్ డేటా బహిర్గతం అయినట్లు పేర్కొంది. సఫారీ 15లో ఈ బగ్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. అయితే ఈ బగ్‌ను యూజర్లు ఏమీ చేయలేరని, దీన్ని సరిచేసేందుకు యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ బగ్‌కు యాపిల్ అప్‌డేట్ విడుదల చేసేవరకు యూజర్లు ఎదురుచూడక తప్పదంటున్నారు సైబర్ నిపుణులు. అప్పటివరకు సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించకపోవడం మేలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : ఈ-సిమ్ అంటే ఏమిటి? అసలు అదెలా పనిచేస్తుంది?