కరోనా టీకాపై అపోహలను తొలగించేలా మరో అధ్యయన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ) నిర్వహించిన పరిశోధనలో భారతీయ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. తీవ్రమైన వ్యాధుల విషయంలోనూ ఈ టీకాలు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నట్లు వెల్లడైంది.
10,600 మంది సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రిలో 8,991(84.8 శాతం) మందికి జనవరి 21- ఏప్రిల్ 30 మధ్య టీకా ఇచ్చారు. 93 శాతం మంది కొవిషీల్డ్, మిగతా వారికి కొవాగ్జిన్ టీకా అందించారు. ఇందులో 1350 మంది సిబ్బందికి టీకా తీసుకున్న అనంతరం కొవిడ్ సోకినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 21 నుంచి మే 19 మధ్య వీరికి కరోనా వచ్చింది. సగటున.. తొలి డోసు తీసుకున్న 77 రోజుల తర్వాత వీరికి ఇన్ఫెక్షన్ తలెత్తగా... 33 మంది వైద్య సిబ్బంది రెండో డోసు తీసుకున్న రెండు వారాల్లోపు కొవిడ్ బారిన పడ్డారు. 679 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు రెండో డోసు తీసుకున్న 47 రోజుల తర్వాత కొవిడ్ సోకింది. టీకా తీసుకోని వారితో పోలిస్తే వ్యాక్సినేషన్ పూర్తైన వారిలో కరోనా వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంది.
"రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో చేరడం గణనీయంగా తగ్గుతుంది. ఐసీయూలు, ఆక్సిజన్ సైతం పెద్దగా అవసరం ఉండదు. టీకా వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 65 శాతం, ఆస్పత్రిలో చేరడం 77 శాతం, ఆక్సిజన్ అవసరం 92 శాతం, ఐసీయూ అవసరం 94 శాతం తగ్గింది."
-అధ్యయనం
ఈ ఆస్పత్రి సిబ్బందిలో కరోనా సోకి ఒకే ఒక్కరు మరణించారు. అయితే, వారు టీకా తీసుకోలేదని, ఇతర ఆరోగ్య సమస్యలు సైతం ఉన్నాయని అధికారులు తెలిపారు.
టీకాలు వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని వెల్లూర్ కళాశాల అధ్యయనంలో తేలిన నేపథ్యంలో.. పరిశోధకులు మరో ముందడుగు వేస్తున్నారు. వైరస్ వేరియంట్లపై టీకాల ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Corona Vaccine: టీకాతో రక్షణ ఎంత కాలం?
బ్రిటన్ అధ్యయనంలోనూ..
బ్రిటన్‌లోనూ ఇదే తరహా అధ్యయనం జరిగింది. టీకాల పనితీరుపై 23,324 మంది హెల్త్‌కేర్ వర్కర్లపై పరిశోధన నిర్వహించారు. వీరిలో 89 శాతం మంది టీకా తీసుకున్నవారు ఉన్నారు. రెండు నెలల వ్యవధిలో టీకా పొందిన వారిలో 80 మంది, వ్యాక్సిన్ తీసుకోని వారిలో 977 మంది కరోనా బారినపడ్డారు.
జెరూసలెంలో జరిగిన పరిశోధనలో ఇదే విధమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు నెలల కాలంలో టీకా తీసుకున్న 5297 మంది హెల్త్‌కేర్ వర్కర్లలో 366(6.9 శాతం) మందికి కరోనా సోకింది. మరోవైపు టీకా తీసుకోని 754 మంది హెల్త్‌కేర్ వర్కర్లలో.. ఏకంగా 213 మంది కొవిడ్ బారిన పడ్డారు.
ఇవీ చదవండి: