‘ఏదో ఒక కొత్త ఐడియా కావాలి. అలాంటి ఐడియా లేకపోతే పాతదాన్నే కొత్తగా చేసి చూపాలి!’ - నేటి స్టార్టప్‌ల నినాదం ఇది. బైకుల్ని అద్దెకిచ్చే సంస్థలు ఈ రెండో అంశాన్ని చక్కగా ఒంటపట్టించుకున్నాయి. మనదేశంలో బైకుల్ని రోజుల తరబడి అద్దెకివ్వడం మరీ కొత్తపద్ధతేమీ కాదు. ప్రసిద్ధ పర్యటక ప్రాంతాల్లో ఈ పద్ధతి ఉండేది. కాకపోతే, ఈ వ్యాపారం పూర్తి అసంఘటితంగా, అనధికారికంగా జరిగేది. ఒక్క గోవాలో తప్ప మిగతా అన్నిచోట్లా మెకానిక్ షెడ్డులవాళ్లు వీటిని అద్దెకిస్తుండేవారు. ఆ బండిని మనం నడుపుతుంటే... వాటి డాక్యుమెంట్లవీ సరిగ్గా లేక పోలీసులు ఇబ్బంది పెడుతుండేవారు! బెంగళూరుకి చెందిన అభిషేక్ చంద్రశేఖర్, ఆకాశ్‌లు ఓసారి పుదుచ్చేరి వెళ్లినప్పుడు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అప్పుడే బైకుల్ని అద్దెకివ్వడాన్ని అధికారికంగా, పారదర్శకంగా చేయాలనుకున్నారు. ఆ ఆలోచన అంకురించే నాటికి ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులు. మరో రెండేళ్ల తర్వాత చదువు పూర్తికాగానే ఈ ఆలోచన ఆధారంగా 2016లో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. మామూలు బైకుల్ని అద్దెకిస్తే పెద్ద ఆకర్షణగా ఉండదని తొలిసారి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ బైకుల్ని పరిచయం చేశారు. అందుకు తగ్గట్టే తమ సంస్థకి ‘రాయల్ బ్రదర్స్’ అని పేరుపెట్టారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 40 నగరాల్లో విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు నగరాల్లో బైకుల్ని అద్దెకిస్తోంది. మొత్తం రెండున్నరవేల పైచిలుకు వాహనాలని ఈ సంస్థ ఇలా అరువిస్తోంది.
![onnbikes startup gives bikes on rent in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10360862_-3.jpg)
రాయల్ బ్రదర్స్‌కి పోటీగా మరో వెయ్యి వాహనాలు అదనంగా నడుపుతోంది ‘ఓఎన్‌ఎన్ బైక్స్’ సంస్థ. దీని వ్యవస్థాపకులదీ దాదాపు రాయల్ బ్రదర్స్‌లాంటి కథే. ఓసారి గోవా వెళ్లిన వీళ్లు అక్కడ బైకుల్ని ఎంతో పారదర్శక పద్ధతిలో పకడ్బందీగా అద్దెకివ్వడం చూశారు. అలాంటి సేవల్ని అన్ని నగరాలకీ విస్తరించాలన్న ఆలోచనకి టెక్నాలజీని జోడించి ‘ఓఎన్‌ఎన్ బైక్స్’ని ప్రారంభించారు. ఈ సంస్థ మామూలు వినియోగదారులతోపాటూ బైకుల అవసరం ఎక్కువగా ఉన్న స్విగ్గీ, జొమాటాలాంటి సంస్థలకీ గంపగుత్తగా అద్దెకిచ్చి లాభాల బాట పట్టింది. రాయల్‌పాండా, డ్రైవ్ కెఫే వంటి సంస్థలూ విలాసవంతమైన బైకుల్ని అద్దెకిస్తూ తమదైన ముద్రవేస్తున్నాయి. వీటిమధ్య పోటీ పెరిగేకొద్దీ వినియోగదారులకి మరింత మంచి సేవలు అందివస్తున్నాయి.
![onnbikes startup gives bikes on rent in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10360862_-4.jpg)
ఎన్నెన్ని ఆఫర్లో..!
![onnbikes startup gives bikes on rent in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10360862_-1.jpg)
ముందుగా ఈ సంస్థలన్నీ విలాసవంతమైన బైకుల్నే తమ ప్రధాన ఆకర్షణగా చూపిస్తున్నాయి. హార్లీ డేవిడ్‌సన్‌తో ఓ సంస్థ ఊరిస్తే... ఇంకొకటి ‘కవాసాకి నింజా’తో కవ్విస్తోంది. ఒకరు ట్యాంకు నిండుగా పెట్రోల్ నింపి ఇస్తామంటే ఇంకొకరు... ఒకటికి రెండు హెల్మెట్‌లని ఇచ్చేస్తామంటున్నారు. ఈ సంస్థలు మొదట్లో బైకుల ధరల్ని బట్టి పాతికవేల దాకా డిపాజిట్టు తీసుకునేవి! కానీ పోటీపెరిగాక అలాంటి నిబంధనల్ని మానుకుని జీరో డిపాజిట్ నినాదాన్ని తెచ్చాయి. జీపీఎస్ టెక్నాలజీ సాయంతో అద్దెకు తీసుకున్నవాళ్లపైన ఓ కన్నేసి ఉంచుతున్నాయంతే. ప్రారంభంలో రోజుకీ, వారానికీ మాత్రమే బైకుల్ని అద్దెకిచ్చేవి. పోటీ కారణంగా వాటిని నెలకీ, మూడునెలలకీ పెంచేశాయి.
హార్లీ డేవిడ్‌సన్, కవాసాకి నింజా, యమహా ఎంటీ 15, టీవీఎస్ అపాచీ 160 4వి వంటి ‘మ్యాచో’ బళ్లతోపాటూ హోండా సీబీఆర్, పల్సర్, హోండా 160, యాక్టివా వంటివాటినీ అద్దెకిస్తున్నారు. ఇక రోజువారీ అద్దె విషయానికొస్తే బైకుల్ని బట్టి ఎక్కువలో ఎక్కువగా రూ.600 వరకూ తీసుకుంటున్నారు. రోజంతా వద్దనుకుంటే కనీసం నాలుగు గంటల వరకు మాత్రమే కొన్ని సంస్థలు అద్దెకిస్తున్నాయి. ఇందుకు గంటకి రూ.50 వంతున వసూలు చేస్తున్నాయి. ఈ సంస్థల వాళ్లు ఒక్క ఫోన్ చేస్తే ఇంటి వద్దకే తెచ్చిస్తారు. మనకు లైసెన్స్ ఉంటే డాక్యుమెంట్లతోపాటూ వాహనాన్నీ మన చేతిలో పెట్టి వెళతారు. మధ్యలో సర్వీసింగ్ అవసరమైనా వాళ్లే వచ్చి చేస్తారు.