వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ప్రతి ఉద్యోగి ఎలాగో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతూనే ఉంటారు. దానికే కొన్ని ఎక్స్‌టెన్సన్లను జోడిస్తే సరి. మీ పని ఉత్పాదకతను పెంచడమే కాదు, నిబద్ధతతోనూ పూర్తి చేసేయొచ్చు.
ప్రకటనలు నిలిపేద్దామంటే..
ఆఫీసు పనిలో ఉండగా చీటికి మాటికి వచ్చే అనవసరపు ప్రకటనలు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. ఇలాంటి ప్రకటనలు రాకుండా చేయాలంటే? సింపుల్‌గా ఈ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి. పేరు యాడ్‌బ్లాక్ ప్లస్. వెబ్‌సైట్‌లు, యూట్యూబ్, ఫేస్‌బుక్.. తదితర విభిన్న వేదికల్లో వచ్చే అనవసరపు ప్రకటనలు తొలగించి మీ సమయాన్ని ఆదా చేస్తుంది. మీ ఏకాగ్రత దెబ్బతినకుండా చూస్తుంది.
ప్రశాంతంగా కానిచ్చేయండి!
ముఖ్యమైన పనిలో ఉంటారు. ఏదో యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది. లేదా ఫేస్‌బుక్ కామెంట్. వెంటనే మనసు ఆ వైపు మళ్లుతుంది. ఏంటో చూసొద్దామని ఓ సారి ఓపెన్ చేసిన పాపప్, కొన్నిసార్లు ఓ గంట సమయం వృథా చేయొచ్చు. మీ పనికి ఆటంకం కలిగించొచ్చు. మరి అలాంటి సమయాన్ని వృథా చేసే వినోద, ఇతర వెబ్‌సైట్‌ల నుంచి నోటిఫికేషన్లు రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి. పేరు 'స్టే ఫోకస్డ్'. దీంతో అనవసరపు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయొచ్చు.
అన్నింటికీ ఒక్కటే..
ఎన్నో ఎకౌంట్‌లు, వెబ్‌సైట్‌లలో లాగిన్ అవుతుంటాం. అవసరాన్ని బట్టి కొత్త ఎకౌంట్‌లు తెరుస్తుంటాం. మరి అన్ని పాస్‌వర్డ్‌లు గుర్తుంటున్నాయా! ముఖ్యమైన పని ఉండగా ఒక్కోసారి పాస్‌వర్డ్ మర్చిపోయి తెగ హైరానా పడిపోతాం. మరి మీరు లాగిన అయిన సైట్‌ల పాస్‌వర్డ్‌లు నిర్వహించే ఓ ఎక్స్‌టెన్షన్ ఉంటే? అదే ‘లాస్ట్‌పాస్’. ఇది మీ పాస్‌వర్డ్‌లు, అడ్రస్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లు, పాస్‌పోర్ట్, ఇన్సురెన్స్ కార్డ్ తదితర ముఖ్య సమాచారాన్ని భద్రపరుస్తుంది. ఒక్క మాస్టర్ పాస్‌వర్డ్‌ని మీరు భద్రంగా ఉంచుకుంటే చాలు.
తప్పులు గుర్తించాలంటే
మీ బాస్‌కి మెయిల్ పంపాలా? మీ కొలీగ్‌కి ప్రాజెక్ట్ కంటెంట్ పంపించాలా! లేదా ట్వీట్ చేయాలా.. బ్లాగ్ రాయాలా.. కొత్త కంటెంట్ తయారు చేయాలా.. ? ఇలా కంటెంట్ రాసేప్పుడు, ఎవరికైనా షేర్ చేసేప్పుడు వచ్చే తప్పులు మీరు గుర్తిస్తున్నారా! ఒకటికి రెండుసార్లు రాసిన ఆ కాపీని తిరిగి చదువుకుంటున్నారా! అయితే ఆ పని ఈ ఎక్స్‌టెన్షన్‌కి అప్పజెప్పండి. పేరు గ్రామర్లీ. ఇది మీ రాతలోని అక్షర దోషాలు, ఇతర వ్యాకరణ దోషాలను పసిగడుతుంది. దానికదే సరిదిద్దుతుంది. దీంతో మీ పనిని మరింత త్వరగా పూర్తి చేసేయొచ్చు.
భద్రంగా దాచుకోండి
అర్జంటు పనిలో ఉండగా ఏదైనా ఐడియా వస్తే! నచ్చిన ఫొటో కనిపిస్తే.. తర్వాత చేయాల్సిన పని గుర్తుకువస్తే.. కాసేపయ్యాక చూద్దాం అనుకుంటాం. తీరా ఆ సమయానికి మర్చిపోతాం. అలా జరగకుండా చూస్తుంది ‘గూగుల్ కీప్’. దీంతో మీ ఫొటోలు, యూఆర్‌ఎల్ లింక్‌లు, టెక్స్ట్, కోట్, వెబ్‌పేజీ.. తదితర సమాచారాన్నంతటినీ ఒక్క క్లిక్‌తో పదిలపరచొచ్చు. అవసరమైనపుడు తిరిగి ఉపయోగించుకోవచ్చు. మీ రోజు వారీ ముఖ్యమైన పనులనూ నోట్స్ రూపంలో రాసుకోవచ్చు.
అన్నింటినీ భద్రపరుచుకోచ్చు
ఏదో నచ్చిన పోస్ట్, మెచ్చిన కథనం, కనువిందైన ఫొటో.. ట్విటర్ లింక్, యూట్యూబ్ వీడియో, వెబ్‌పేజీ ఇవన్నింటినీ సంగ్రహించే ఏదైనా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఉందంటే.. అది సేవ్ టు పాకెట్. ఈ ఎక్స్‌టెన్షన్ని క్రోమ్‌కి కలిపితే చాలు... మీకు నచ్చిన కథనాలు, వీడియోలు.. తదితర విశేషాలన్నింటినీ ఒక్క క్లిక్‌తో భద్రపరుచుకోవచ్చు. ఖాళీ సమయాల్లో తిరిగి తెరవొచ్చు. ఆఫ్‌లైన్లోనూ చదివేయొచ్చు.
ఇదీ చదవండిః ఇంటి నుంచి పని చేసే వారి కోసం ఈ చిట్కాలు...