Apple Security: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ తమ ఉత్పత్తుల్లోని సాఫ్ట్‌వేర్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని గుర్తించింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు వినియోగిస్తున్న వారంతా తమ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేదంటే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ భద్రతా లోపం వల్ల హ్యాకర్లు పూర్తిగా డివైజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉందని యాపిల్ తెలిపింది. ఈ మేరకు యూజర్లను హెచ్చరిస్తూ బుధవారం, గురువారం రెండు విడతల్లో భద్రతా లోపాలపై నివేదికను వెలువరించింది. కానీ, టెక్ పబ్లికేషన్స్ నుంచి మినహా దీనిపై పెద్దగా స్పందన రాకపోవడంతో అప్రమత్తమైన కంపెనీ యూజర్లను తాజాగా మరోసారి హెచ్చరించింది.
ఐఫోన్ 6ఎస్‌తో పాటు దాని తర్వాత మోడళ్లు, ఐప్యాడ్ 5వ జనరేషన్ సహా దాని తర్వాత వచ్చిన మోడళ్లు, ఐప్యాడ్ ఎయిర్2.. దాని తర్వాత మోడళ్లు, ఐప్యాడ్ మినీ 4 దాని తర్వాత వచ్చినవి, ఐప్యాడ్ ప్రో అన్ని మోడళ్లు, 7వ జనరేషన్ ఐపాడ్ టచ్.. పరికరాలన్నింటినీ వెంటనే అప్డేట్ చేసుకోవాలని యాపిల్ తెలిపింది. కొన్ని మ్యాక్ కంప్యూటర్లలోనూ ఈ లోపం ఉన్నట్లు తెలిపింది. వాటిని కూడా వెంటనే అప్డేట్ చేసుకోవాలని హెచ్చరించింది.
ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ఈ లోపాన్ని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు హానిచేసే కోడ్‌ను డివైజ్‌లలో ప్రవేశపెట్టి అనైతిక చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని యాపిల్ వివరించింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సెక్యూరిటీ అప్‌డేట్‌లను డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. అయితే, ఈ లోపాన్ని ఎప్పుడు, ఎవరు గుర్తించారన్నది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఇప్పటి వరకు ఈ లోపాన్ని ఎవరైనా దుర్వినియోగపరచారా? అనే విషయంపై కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఈ మేరకు ఐఓఎస్ 15 యూజర్ల కోసం యాపిల్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఫోన్ యూజర్ల కోసం ఐఓఎస్ 15.6.1, ఐపాడ్ యూజర్ల కోసం ఐపాడ్ ఓఎస్ 15.6.1 వెర్షన్‌లను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లతో రెండు ముఖ్యమైన లోపాలను సరిచేసినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది. ఐఓఎస్ 15, ఐపాడ్ ఓఎస్ 15లోని బగ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ కంప్యూటర్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, యూజర్లు వెంటనే తమ డివైజ్‌లలో ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
"ఐఓఎస్ 15 వెర్షన్‌లో సీవీఈ-2022-32894 అనే జీరో-డే బగ్ కారణంగా ఓఎస్‌లో ముఖ్యమైన కెర్నెల్ కోడ్‌ను ట్రాక్ చేస్తున్నారు. దీంతో హ్యాకర్లు యూజర్ డివైజ్‌ను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తూ.. మాల్‌వేర్‌ను పంపవచ్చు. సీవీఈ-2022-32893 అనే మరో జీరో-డే బగ్ కారణంగా యాపిల్ సఫారీ బ్రౌజర్‌కు అనుసంధానమైన వెబ్‌కిట్‌ను ట్రాక్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్ బ్రౌజింగ్ సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. ఈ రెండు బగ్‌లను ఐఓఎస్ 15.6.1 వెర్షన్‌లో సరిచేశాం" అని యాపిల్ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది.
అప్‌డేట్ చేయడం కోసం డివైజ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ సెక్షన్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓఎస్ అప్‌డేట్ అవుతుంది.
ఇవీ చదవండి: మీ ఫోన్లో ఈ 35 యాప్స్‌లో ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి