అసలే కరోనా కాలం. జీవనమే కష్టంగా ఉండటం వల్ల షాపింగ్లపైనా జనాలకు ఆసక్తి తగ్గిపోయింది. వీలైతే అప్పుడప్పుడు ఆన్లైన్నే నమ్ముకుంటున్నారు. అసలే డిమాండ్ తగ్గి ఇబ్బందుల్లో ఉన్న టెక్స్టైల్ రంగం పరిస్థితులను అర్థం చేసుకుంది. వెంటనే నెలల్లోనే యాంటీ కరోనా దుస్తులను మార్కెట్లోకి తెచ్చింది. గత కొన్ని నెలల్లోనే నాలుగు టెక్స్టైల్ బ్రాండ్లు కరోనాను సంహరించే దుస్తులను తీసుకొచ్చాయంటే అవి ఎంతగా పోటీపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
చాలా కీలకం...
"కరోనా రక్షణలో భాగంగా చాలా మంది శానిటైజర్లు రాసుకోవడం, మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లను ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇవి కొంతమేర మాత్రమే రక్షణ కల్పించగలవు. అదే వేసుకునే దుస్తులతోనే రక్షణ కల్పించగలిగితే.. అవే శరీరాన్ని బాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడతాయి" అని చెప్పారు డోనియర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అగర్వాల్. ఈయన నేతృత్వంలోని కంపెనీ యాంటీ కరోనా ఫ్యాబ్రిక్‌ను ఏప్రిల్‌లో విడుదల చేసింది.
నియో టెక్నాలజీ ద్వారా యాంటీ వైరల్ నూతన దుస్తులను రూపొందించినట్లు అగర్వాల్ చెప్పారు. వైరస్, క్రిములు దుస్తులపై పడగానే కేవలం 30 నిమిషాల్లోనే అవి చనిపోతాయని తెలిపారు. నిర్దిష్ట రసాయనాన్ని ఫ్యాబ్రిక్ నిర్మాణంలోనే పొందుపరచడం వల్ల తరచూ ఉపయోగించినా, ఉతికినా దాని ప్రభావం తగ్గదని స్పష్టం చేశారు. దీన్ని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో టెస్టు చేసి ధ్రువీకరించినట్లు తెలిపారు సంస్థ ప్రతినిధులు. సార్స్ కోవ్-2పై సమర్థంగా పనిచేస్తోందని తమ ల్యాబ్‌లో నిరూపితమైందని అన్నారు అగర్వాల్.
రెండు దశల్లో...
"ఫ్యాబ్రిక్‌ను చిన్నపాటి వెండి పరమాణువులతో నింపుతారు. ఇవే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకమైన రసాయనాన్ని కలుపుతారు. ఇలా చేయడం వల్ల ఆ వెండి పరమాణువులు వైరస్ కణాలను ఆకర్షించే గుణాన్ని సంపాదిస్తాయి. అలా దుస్తులపై పడిన వైరస్‌ను కదలనీయకుండా చేస్తాయి" అని వివరించారు అగర్వాల్.
"రెండో దశలో ఫ్యాటీ వెసిల్ టెక్నాలజీ తన పని ప్రారంభిస్తుంది. అలా ఆకర్షించిన వైరస్‌లను క్షీణింపజేసి పూర్తిగా నాశనం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది" అని చెప్పారు రాజేంద్ర అగర్వాల్. ఈ నియో సాంకేతికతతో సూట్లు, షర్ట్లు, స్కర్ట్లు, బ్లౌజ్‌లు కూడా చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాటన్, పాలీబ్లెండ్స్, వరస్టెడ్స్, నాన్ వోవెన్స్ వంటి ఫ్యాబ్రిక్లతోనూ ఈ తరహా ఉత్పత్తులు చేస్తున్నట్లు తెలిపారు అగర్వాల్.
హెచ్ ప్లస్ టెక్నాలజీ...
జూన్‌లో ఆస్ట్రేలియా బ్రాండ్ లెన్జింగ్, భారత్‌లోని రూబీ మిల్స్ 'హెచ్ ప్లస్' టెక్నాలజీతో ఇదే తరహా దుస్తులను తయారు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో హై పెర్ఫార్మెన్స్ యాక్టివ్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పాయి. ఆర్ఎన్ఏ, లిపిడ్ మెంబరేన్ కలిగిన వైరస్ ఫ్యాబ్రిక్ మీద పడగానే.. హెచ్‌ప్లస్ సాంకేతికలో వాడే ఏజెంట్లు వైరస్ పొరను విడగొట్టేస్తాయి. ఫలితంగా ఆర్ఎన్ఏ నిర్జీవంగా మారిపోతుందని రూబీ మిల్స్ అధికార ప్రతినిధి రిషభ్ షా తెలిపారు. వైరస్ ఆర్ఎన్ఏతోనే తయారైంది కాబట్టి తమ సాంకేతికత విరుగుడు అంటూ ప్రకటించారు. ఇది పూత కాదు కాబట్టి ఎక్కువసార్లు ఉతికినా ఈ దుస్తులకున్న యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పోవని స్పష్టం చేశారు.
అయితే సాధారణ దుస్తులతో పోలిస్తే వీటి ధరలు 10 శాతం వరకు అధికంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో పాటు సియారామ్, అరవింద్ లిమిటెడ్ వంటి సంస్థలు యాంటీ వైరల్ దుస్తులపై పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నాయి.
తమ ఉత్పత్తులను మరింత క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని రూబీ మిల్స్, లెన్జింగ్ సంస్థలు యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆసుపత్రి యూనిఫామ్‌లు, బెడ్షీట్లు, పీపీఈలు, మాస్క్‌లు మాత్రమే కాకుండా రోజూవారి వేసుకునే దుస్తులు, ఫార్మల్ సహా భారతీయ సంప్రదాయ వస్త్రాలను తయారుచేస్తున్నట్లు ప్రకటించాయి. హెచ్‌ప్లస్ సాంకేతికతను వాడి పాలిస్టర్, లినెన్, కాటన్‌తోనూ దుస్తులు రూపొందిస్తున్నట్లు తెలిపాయి.
"శానిటైజర్లు, మాస్క్‌లు, సబ్బులులాగే యాంటీ వైరల్ దుస్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనాకు రక్షణగా భారత కస్టమర్లు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు" అని వెల్లడించారు అశోకా యూనివర్సిటీలోని ఫ్రొఫెసర్ గౌతమ్ మేనన్.
నిపుణుల మాటలివే..
ప్రస్తుతం ఉన్న ఇన్నోవేటివ్ బిజినెస్ మోడళ్లు బాగానే ఉన్నా.. డబ్బులు సంపాదించుకొని, ఉనికి కాపాడుకునేందుకు ఇదొక మార్గమే అయినా.. అసలు దుస్తులపై వైరస్ ఎంత సమయం ఉంటుంది? అనేది అసలు ప్రశ్న. పరిశుభ్రంగా ఉండటం, బట్టలను డిటర్జెంట్‌తో ఉతుక్కోవడం మంచిదని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు తెలిపారు.
దుస్తులు కరోనా వాహకాలుగా పనిచేస్తాయని ఎక్కడా ఆధారాలు లభించలేదని జెనిస్ట్రింగ్స్ డయగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకురాలు అల్పానా రజ్దాన్ గుర్తుచేస్తున్నారు. వైరస్ బతకడానికి కొంత తేమ అవసరం. కాబట్టి బట్టలను ఉతికి ఎండలో శుభ్రంగా ఆరబెడితే తేమ ఉండదు కాబట్టి వైరస్ చచ్చిపోతుందని ఆమె తెలిపారు. దీనికి నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రి టీబీ నిపుణులు, మ్రినాల్ సిర్కార్ సైతం సమర్థించారు. దుస్తులకు వైరస్ అంటుకున్నా.. ఎవరైనా వ్యక్తి వాటిని ముట్టుకొని ముఖాన్ని తాకకపోతే కచ్చితంగా వైరస్ బారిన పడరని స్పష్టం చేశారు. డిటర్జెంట్ వైరస్‌ను చంపేస్తుందని మ్రినాల్ వెల్లడించారు. వైరస్ దుస్తుల ద్వారా కాకుండా నోరు, ముక్కు ద్వారా వచ్చే తుంపర్లతోనే వ్యాప్తి చెందుతోంది కాబట్టి యాంటీ బాక్టీరియల్ దుస్తులతో పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.
"ఎక్కువ వైరస్ లోడ్ ఉన్న వైద్యశాలల్లోనే పీపీఈ గౌన్లు వాడుతున్నారు. ఇవి పాలీప్రపైలిన్తో తయరైన దుస్తులు. ఇవి ప్రస్తుతం బాగానే రక్షణ కల్పిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ ధర ఉండే యాంటీ వైరల్ దుస్తులు అవసరం లేదు" అని ఘజియాబాద్‌లోని కొలంబియా ఆసియా ఆసుపత్రి మైక్రోబయాలజిస్ట్ అషుతోష్ రావత్ వివరించారు.
అధ్యయనాలు ఏమంటున్నాయి..?
ఈ ఏడాది మార్చిలో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఓ ఆర్టికల్ ప్రచురించారు. దానిలో గాలిలోని తుంపర్లు, ఎవరైనా బాధితుడికి దగ్గరగా వెళ్లినప్పుడు, అతడు ఉన్న ప్రాంతంలో తిరిగినప్పుడు మాత్రమే కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టం చేశారు. గాలిలో వైరస్ మూడు గంటలు ఉంటందని, రాగి, కార్డ్‌బోర్డు, ప్లాస్టిక్ మీద 24 గంటలు నుంచి గరిష్ఠంగా 3 రోజులు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ అధ్యయనంలో దుస్తుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని సీనియర్ డైరెక్టర్ అయిన లిసా తన బ్లాగ్‌లోనూ దీని గురించి రాసుకొచ్చారు. దృఢంగా ఉండే ఎలివేటర్ బటన్లు, డోర్ హ్యాండిల్స్ మీద ఉన్నట్లు మెత్తటి ఉపరితలం కలిగిన దుస్తులపై కరోనా ఎక్కువ సమయం నిలవదని అభిప్రాయం వ్యక్తం చేశారు.