Android Phone Slowing Down : స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నకొద్దీ స్లో అవుతూ ఉంటుంది. కొత్తగా ఉన్నప్పటితో పోలిస్తే కొద్ది నెలలు ఉపయోగించిన తర్వాత.. లోడింగ్ సమయం, యాప్‌లు ఓపెన్ అయ్యే సమయంలో తేడాలు వస్తుంటాయి. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మరి వాటిని అధిగమించి.. ఫోన్ వేగం పెంచాలంటే ఏం చేయాలో చూద్దాం.
ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే..
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. యాప్స్.. స్టోరేజీని ఉపయోగించుకుంటాయి. వాటిని రన్ చేయాలంటే కూడా ఫోన్లో తగినంత స్టోరేజీ ఉండటం అవసరం. చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోతుంది. చివరకు ఫోన్ హార్డ్వేర్పై ప్రభావం పడుతుంది. ఇది ఫోన్ నెమ్మదించడానికి ఒకర కారణం కావచ్చు.
- మరేం చేయాలి?
- ఎప్పుడో ఓసారి ఉపయోగపడే యాప్స్‌ను ఫోన్లో నుంచి డిలీట్ చేయండి.
- బ్రౌజర్లో వాడగలిగే సేవలకు సంబంధించిన యాప్స్‌ను తొలగించండి. ఉదాహరణకు.. ఉబర్, ఓలా వంటి సేవలు బ్రౌజర్‌లోనూ అందుబాటులో ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా యాప్స్ అవసరం లేదు.
భారీ యాప్స్ వల్ల..
స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని యాప్స్ ఒకే విధంగా ఉండవు. కొన్ని యాప్స్ లైట్‌వెయిట్‌తో.. తక్కువ బడ్జెట్ ఫోన్లోనూ ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తాయి. కానీ కొన్ని మాత్రం.. ఫోన్లోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను చాలా వరకు వాడుకుంటాయి. పెద్ద గేమ్స్, ఫేస్బుక్ వంటి యాప్స్ ఇందుకు ఉదాహరణ. ఫేస్బుక్, స్నాప్‌చాట్ యాప్‌లు ఫోన్‌ను చాలా వరకు నెమ్మదించేలా చేస్తాయి.
- మరేం చేయాలి?
- ఫేస్బుక్ వాడాలనుకుంటే.. దాని లైట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ఉత్తమం. ప్రధాన యాప్ సైజు 63ఎంబీ ఉంటే.. ఫేస్బుక్ లైట్ 1.6 ఎంబీ మాత్రమే ఉంటుంది.
- ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లకు సైతం లైట్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- యాప్స్‌కు లైట్ వెర్షన్ అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో చెక్ చేసుకోవచ్చు.
- ప్రధాన యాప్ ఇన్స్టాల్ బటన్ కింద 'సిమిలర్ యాప్' అనే బ్యానర్ ఓపెన్ చేస్తే అందుబాటులో ఉన్న లైట్ వెర్షన్ కనిపిస్తుంది.
సిస్టమ్ అప్డేట్స్ చేయకపోవడం..
స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా లోపాలు ఉంటే అప్డేట్ల ద్వారా డెవలపర్లు సరిచేస్తుంటారు. కొన్నిసార్లు ఆ లోపాలు ఫోన్‌ను స్లో అయ్యేలా చేస్తాయి. ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్ చేసుకుంటే.. ఫోన్ స్లో కాకుండా చూసుకోవచ్చు. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలోనూ సిస్టమ్ అప్డేట్స్ చాలా ముఖ్యం. ఇదే విషయం ఫోన్లోని యాప్‌లకూ వర్తిస్తుంది. ఇన్స్టాల్ అయిన యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. కొత్త వెర్షన్ వచ్చిన వెంటనే అప్డేట్ అయిపోయేలా.. గూగుల్ ప్లే స్టోర్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలి.
ఫ్రీ స్టోరేజీ ఉండేలా..
డివైజ్‌లో ఎప్పుడూ స్టోరేజీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫీగా నడవాలంటే తగినంత స్టోరేజీ ఉండాలి. స్టోరేజీ స్పేస్ లేకపోతే.. సిస్టమ్ లేట్‌గా రన్ అవుతుంది. ఇది ఫోన్ పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపుతుంది.
ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం..
మీరు చివరిసారి ఫోన్‌ను ఎప్పుడు స్విచ్ఆఫ్ చేశారో గుర్తుందా? లేకపోతే మాత్రం వెంటనే మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏర్పడ్డ చిన్నచిన్న బగ్స్‌ను తొలగించుకోవచ్చు.
టాస్క్ కిల్లర్స్ వాడితే..
ఫోన్లో మెమొరీని క్లీన్ చేయడానికి ఉపయోగించుకునే యాప్స్‌నే టాస్క్ కిల్లర్స్ అంటారు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే యాప్స్‌ను క్లోజ్ చేసి.. ర్యామ్‌పై భారం పడకుండా చూస్తాయని భావిస్తుంటారు. అయితే, ఇదంతా వాస్తవం కాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువసేపు నడిచే యాప్స్‌ను ఆండ్రాయిడ్ ఆటోమెటిక్‌గా తొలగిస్తుంటుంది. ఈ టాస్క్ కిల్లర్స్ ఫోన్ స్పీడ్‌ను పెంచే బదులు.. అందుకు విరుద్ధంగా పనిచేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను ప్రతిసారి క్లోజ్ చేస్తే.. వాటిని రీఓపెన్ చేసినప్పుడు ఎక్కువ సేపు లోడ్ అవుతాయి. ఇది పరోక్షంగా ర్యామ్ పనితీరును ప్రభావితం చేస్తుంది.
హోమ్ స్క్రీన్..
ఫోన్ నెమ్మదించడానికి హోమ్ స్క్రీన్ మీద ఉండే విడ్జెట్స్, యాప్స్ కూడా ఓ కారణం. హోమ్ స్క్రీన్‌పై ఎక్కువ విడ్జెట్స్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ పెర్ఫార్మెన్స్పై ప్రభావం పడుతుంది. సింపుల్ విడ్జెట్స్ ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అయితే, విడ్జెట్ తగ్గించడం వల్ల ఫోన్ మరీ వేగంగా పనిచేస్తుందని అనుకూడదు. దీని ప్రభావం చాలా స్వల్పమే.