Android 13 update : ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నాయిస్ డిస్ట్రబెన్స్ వస్తే ఎంతో చిరాగ్గా ఉంటుంది. అంతేకాదు, అవతలి వ్యక్తి ఏం చెప్తున్నాడనేది కూడా సరిగా వినపడదు. గూగుల్ త్వరలో విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ 13లో ఈ సమస్యకు చెక్ పెట్టనుంది. ఇందుకోసం కొత్త ఓఎస్‌లో క్లియర్ కాలింగ్ పేరుతో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. యూజర్ ఫోన్ కాల్స్ మాట్లాడేప్పుడు ఈ ఫీచర్ నాయిస్ డిస్ట్రబెన్స్‌ను తగ్గిస్తుంది. క్లియర్ కాలింగ్ ఫీచర్ అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు పనిచేస్తుంది. వైఫై ద్వారా చేసే ఫోన్స్ కాల్స్‌లో ఈ ఫీచర్ పనిచేయదని సమాచారం.
వ్యక్తిగత గోప్యత, లాంగ్వేజ్, భద్రత ప్రాధ్యాన్యంగా ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను అభివృద్ధి చేసినట్లు గూగుల్ తెలిపింది. యూజర్ ఇంటర్‌ఫేస్ పరంగా ముఖ్యమైన మార్పులు చేసినట్లు చెబుతోంది. ఈ ఓఎస్ దశలవారీగా శాంసంగ్ గెలాక్సీ, అసుస్, నోకియా, ఐకూ, మోటోరోలా, వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మీ, టెక్నో, వివో, షావోమితోపాటు ఇతర ఫోన్లలో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 బీటా వెర్షన్‌ను 2023 ఏప్రిల్ నుంచి పిక్సెల్ ఫోన్లలో అప్‌డేట్ చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇందులో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు ఆండ్రాయిడ్ 13 బీటా క్యూపీఆర్1ను సెప్టెంబరు నెల నుంచి యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 13 బీటా విడుదల చేయగా, క్యూపీఆర్1 వెర్షన్‌ను మార్చి 2023 వరకు యూజర్లకు అందుబాటులో ఉంచనుంది. తర్వాత రెండు క్యూపీఆర్ వెర్షన్లను విడుదల చేసి పూర్తి స్థాయి ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను డిసెంబర్‌లో విడుదల చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.