‘‘అయ్యో.. కూరలో ఉప్పు వేశానో.. లేదో, గుర్తుకు రావడం లేదే? ఇప్పుడెలా అనుకోకండి! మీరు అప్పటికే కూరలో ఉప్పు వేశారో లేదో మీతోనే ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్(Artificial Intelligence Assistant) సమాచారం ఇచ్చి సాయపడుతుంది. అంతేనా.. మీ కారు లేదా ఇంటి తాళాలు ఎక్కడైనా పారేసుకున్నారనుకోండి! అవి ఎక్కడ పోగొట్టుకున్నారో కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి చూపిస్తుంది!
ఇదంతా ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇగో4డీ ప్రాజెక్టు సాయంతో ఇలాంటి పనులన్నీ అతి త్వరలోనే సుసాధ్యం కానున్నాయి. ఫేస్‌బుక్ రియాలిటీ ల్యాబ్స్ (ఎఫ్‌ఆర్‌ఎల్(Facebook Reality Labs)) రీసెర్చ్ భాగస్వామ్యంతో ఫేస్‌బుక్ ఏఐ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. బ్రిటన్, అమెరికా, ఇటలీ, భారత్, జపాన్, సౌదీ అరేబియా, సింగపుర్‌నకు చెందిన 13 ప్రముఖ సంస్థలు, ల్యాబ్‌లు ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి. వచ్చే నెలలో ప్రాజెక్టు వివరాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఫేస్‌బుక్ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 700 మంది దైనందిన కార్యకలాపాలతో రూపొందించిన 2,200 గంటల డాటాను పొందుపరిచింది. ఈ ప్రాజెక్టులో భారతదేశం నుంచి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) ఒక్కటే భాగస్వామ్యమైంది.
25 ప్రాంతాల నుంచి సమాచార సేకరణ
ట్రిపుల్ ఐటీలోని విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంలోని ఆచార్యుడు ప్రొ.సీవీ జవహర్ ఆధ్వర్యంలో డాటా సేకరణ చేపట్టారు. దేశంలో 25 ప్రాంతాల నుంచి 130 మంది సాయంతో డాటా సేకరించారు. ఇంట్లో వంట చేసేవారు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, రైతులు.. ఇలా తమ వృత్తుల్లో నిమగ్నమైన వ్యక్తుల సాయంతో ప్రత్యేకంగా అమర్చిన కెమెరాల నుంచి వారు చేసే పనుల వీడియోలు, ఆయా శబ్దాల డాటా సేకరించారు. దైనందిన జీవితంలోనే కాకుండా చదువు, పని ప్రదేశాలు, క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఏఐ అసిస్టెంట్ ఉపయోగపడుతుందని సీవీ జవహర్ వివరించారు. ఈ నెల 11 నుంచి 17 మధ్య వర్చువల్ విధానంలో కంప్యూటర్ విజన్‌పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని డాటా సేకరణ వివరాలు వెల్లడించారు.
కంప్యూటర్ విజన్ సాయంతో..
కంప్యూటర్ విజన్ సాంకేతికత సాయంతో మనిషి చేసే దైనందిన కార్యకలాపాలను కెమెరా సాయంతో సేకరించి కృత్రిమ మేధను జోడించామని ఫేస్‌బుక్(Facebook) ఏఐ లీడ్ రీసెర్చ్ సైంటిస్ట్ క్రిస్టెన్ గ్రామన్ వివరించారు.
- ఇదీ చదవండి : 'కృత్రిమ మేధ పోరులో అమెరికాపై చైనాదే పైచేయి'