చింతకాయల రుచికి నాలుక జివ్వుమంటుంది. వీటిని మాంసం, పచ్చిరొయ్యల్లో వేసి వండితే వాటి రుచి రెట్టింపు కావడం ఖాయం. వీటితో చేసిన పులిహోర తింటే.. మరోసారి వడ్డించుకోకుండా ఉండలేరు. ఇంకెందుకాలస్యం మీరూ ప్రయత్నించండి మరి.
చింతకాయ పులిహోర
కావాల్సినవి: అన్నం- అరకేజీ, చింతకాయలు- పావుకేజీ, వేరుసెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు - రెండు టీస్పూన్లు, మినప్పప్పు- టీస్పూన్, ఆవాలు, జీలకర్ర- టీస్పూన్ చొప్పున, పసుపు, ఇంగువ- పావు టీస్పూన్ చొప్పున, ముక్కలు చేసిన ఎండుమిర్చి- మూడు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు, ఉప్పు- తగినంత, కరివేపాకు రెబ్బలు- మూడు, అల్లం ముక్కలు- టీస్పూన్.

తయారీ: చింతకాయలను ఉడికించి గుజ్జును వడకట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగపప్పు వేయాలి. వీటిని రెండు నిమిషాలపాటు వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఆ తర్వాత పసుపు, ఇంగువ చింతకాయ గుజ్జు వేసి బాగా కలపాలి. ఉప్పు వేసి మిశ్రమాన్ని పది నిమిషాలపాటు ఉడకనివ్వాలి. చింతకాయ గుజ్జు దగ్గరకు వచ్చిన తర్వాత అన్నంలో వేసి బాగా కలపాలి.
చింతకాయ మటన్
కావాల్సినవి: మటన్- అరకేజీ, చింతకాయలు- 100 గ్రా., సన్నగా తరిగిన ఉల్లిపాయలు- మూడు, పసుపు- అర టీస్పూన్, ఉప్పు- తగినంత, అల్లంవెల్లులి పేస్టు- టేబుల్‌స్పూన్, కరివేపాకు- రెబ్బ, పచ్చిమిర్చి- నాలుగు, పుదీనా, కొత్తిమీర- కట్ట చొప్పున, ధనియాలు, జీలకర్ర, గరంమసాల పొడి- టీస్పూన్ చొప్పున, కారం- టేబుల్‌స్పూన్.

తయారీ: చింతకాయలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. మటన్‌ను శుభ్రంగా కడిగి.. కడాయిలో నూనె వేడి చేసి అందులో వేయాలి. తర్వాత ఉల్లిపాయముక్కలు, పసుపు, అల్లంవెలుల్లి పేస్టు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి చిన్న మంటమీద పావుగంటపాటు ఉడికించాలి. ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి వేయాలి. కొత్తిమీర, పుదీనాలో పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్టులా చేసి కూరలో వేయాలి. ఇప్పుడు కారం వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి పావుగంటపాటు ఉడికించాలి. ఉడికి సిద్ధంగా ఉన్న చింతకాయలను పప్పుగుత్తితో బాగా మెదిపి నీటిని జాలీతో వడకాట్టాలి. మటన్ ముక్కలు మెత్తబడిన తర్వాత ఈ నీటిని కూరలో పోసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి.
చింతకాయ పచ్చి రొయ్యలు
కావాల్సినవి: పచ్చిరొయ్యలు- అరకేజీ, చింతకాయలు- 100 గ్రా., ఉల్లిపాయలు- మూడు, పచ్చిమిర్చి- రెండు, కారం- రెండు టేబుల్ స్పూన్లు, పసుపు- పావు టీస్పూన్, ఉప్పు- తగినంత.

తయారీ: పచ్చిరొయ్యలను బాగా కడిగి కాస్త పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచాలి. దీంట్లోనే ఉడికించిన చింతకాయలను కూడా వేసి దంచాలి. కడాయిలో నూనె వేడిచేసి పచ్చిరొయ్యలు వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయ, చింతకాయ తొక్కు, కారం, ఉప్పు వేయాలి. బాగా వేగిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి తక్కువ మంట మీద దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి.
చింతకాయ చారు
కావాల్సినవి: చింతకాయలు- పది, చీల్చిన పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, ఆవాలు, జీలకర్ర, మెంతులు- టీస్పూన్ చొప్పున, కరివేపాకు రెమ్మ- ఒకటి, పసుపు, ఇంగువ- చిటికెడు.

తయారీ: చింతకాయలను కడిగి వేడినీళ్లలో ఉడికించాలి. చల్లారిన తర్వాత వాటిని నలిపి రసాన్ని వడకట్టి కొన్ని నీళ్లు కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి చేత్తో నలపాలి. కడాయిలో నూనె వేడిచేసి మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు ఇంగువ వేయాలి. దీంట్లో చింతకాయ చారు పోసి తాలింపు పెట్టాలి.
ఇదీ చదవండి: పెన్సిళ్లతో తలరాత మార్చుకుంటున్న మహిళలు