వివిధ రకాల రొయ్యలతో వెరైటీ ఫుడ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
మసాలా గ్రేవీ
కావలసినవి
శుభ్రం చేసిన రొయ్యలు: కప్పు, పసుపు, మిరియాలపొడి: అరచెంచా చొప్పున, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు చెంచాలు, జీలకర్ర: రెండు చెంచాలు, నూనె: అరకప్పు, ఆవాలు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయ, టొమాటో: ఒక్కోటిచొప్పున, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లిరెబ్బలు: ఆరు, పచ్చిమిర్చి: రెండు, దనియాలపొడి: ఒకటిన్నర చెంచా, పల్చని చింతపండు రసం: రెండుటేబుల్‌స్పూన్లు, గరంమసాలా: అరచెంచా.
తయారుచేసే విధానం
రొయ్యలపైన పావుచెంచా చొప్పున పసుపు, మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టాలి. అది వేడయ్యాక జీలకర్ర వేయించుకుని చల్లారాక పొడి చేసుకోవాలి. అదే కడాయిలో చెంచా నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అవీ వేగాక మిగిలిన పసుపు, దనియాలపొడి, ముప్పావువంతు జీలకర్రపొడి వేసుకోవాలి. టొమాటో ముక్కలూ వేసి ఉడికించాలి. తరవాత రొయ్యలూ, చింతపండు నీళ్లు, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. అది దగ్గరగా ఉడికిన తరవాత గరంమసాలా, మిగిలిన జీలకర్రపొడి వేసి కలిపి దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, చపాతీల్లోకీ బాగుంటుంది.
రొయ్యల పకోడీ..
కావలసినవి
రొయ్యలు: పన్నెండు, సెనగపిండి: ఒకటిన్నర టేబుల్‌స్పూను, మైదా: చెంచా, పెరుగు: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లిముద్ద: చెంచా, నిమ్మరసం: ఒకటిన్నర చెంచా, చాట్‌మసాలా, కారం, దనియాలపొడి: చెంచా చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారుచేసే విధానం
రొయ్యల్ని శుభ్రం చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అవి పూర్తిగా తడారిపోయాక చెంచా నూనె, మిగిలిన పదార్థాలన్నీ, ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ కలపాలి. స్టౌపైన బాణలి పెట్టి, వేయించేందుకు సరిపడా నూనె పోసి అది కాగాక రొయ్యల్ని రెండేసి చొప్పున అందులో వేసి వేయించి తీసుకోవాలి.
కొబ్బరిపాలతో..
కావలసినవి
రొయ్యలు: ఇరవై, ఎండుమిర్చి: పది, లవంగాలు: ఆరు, మిరియాలు, జీలకర్ర: చెంచా చొప్పున, దనియాలు: టేబుల్‌స్పూను, చింతపండు: ఉసిరికాయంత, కొబ్బరితురుము: అరకప్పు, కొబ్బరిపాలు: కప్పు, నూనె: రెండుటేబుల్‌స్పూన్లు, అల్లంతరుగు: టేబుల్‌స్పూను, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, టొమాటో ముక్కలు: అరకప్పు, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: రెండు.
తయారుచేసే విధానం
రొయ్యల్ని శుభ్రం చేసి, చల్లని నీటిలో వేసి పెట్టుకోవాలి. మిక్సీజారులో ఎండుమిర్చి, లవంగాలు, మిరియాలు, దనియాలు, జీలకర్ర, చింతపండు, కొబ్బరితురుము, కొబ్బరిపాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టాలి. అది వేడయ్యాక నూనె వేసి, అల్లం తరుగు, ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి ఎర్రగా వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా చేసిపెట్టుకున్న మసాలా, తగినంత ఉప్పు వేయాలి. ఇది ఉడికి.. చిక్కగా అవుతున్నప్పుడు రొయ్యలూ వేసి కలపాలి. దగ్గరకు అయ్యాక కరివేపాకు వేసి దింపేయాలి.
రొయ్యల పులావ్..
కావలసినవి
రొయ్యలు: రెండు కప్పులు, పసుపు: అరచెంచా, బాస్మతీబియ్యం: రెండుకప్పులు, నూనె: పావుకప్పు, దాల్చినచెక్క: చిన్న ముక్క, యాలకులు, లవంగాలు: అయిదుచొప్పున, బిర్యానీ ఆకులు: రెండు, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ, టొమాటో: ఒక్కోటి చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, టొమాటోప్యూరీ: టేబుల్‌స్పూను, కారం, గరంమసాలా: చెంచా చొప్పున, దనియాలపొడి: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, చక్కెర: చిటికెడు, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, నిమ్మరసం: రెండు చెంచాలు.
తయారీ విధానం..
శుభ్రంచేసిన రొయ్యలపైన పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో బాస్మతీ బియ్యం తీసుకుని సరిపడా నీళ్లుపోసి పొడిపొడిగా వండుకుని పక్కన ఉంచాలి. స్టౌమీద బాణలి పెట్టాలి. అది వేడయ్యాక నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీఆకులు, జీలకర్ర వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తరువాత టొమాటోప్యూరీ, గరంమసాలా, దనియాలపొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రొయ్యల్ని వేసుకోవాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు కరివేపాకు, నిమ్మరసం, అన్నం వేసుకుని బాగా వేయించాలి. అయిదునిమిషాలయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.
ఇవీ చదవండి: