క్యారెట్ పచ్చడి చేసుకోవడం ఎంతో సులభం.. పైగా ఈ పచ్చడిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 15 రోజులకుపైనే నిల్వ ఉంటుంది. కూరలు వండుకోలేని సమయంలో రూచికరమైన క్యారెట్ పచ్చడితో అన్నమంతా తినేయొచ్చు. మరింకేం.. రెసిపీ చూసేయండి.

కావల్సినవి
ధనియాలపొడి, ఆవపొడి - చెంచా చొప్పున, జీలకర్రపొడి - అరచెంచా, మెంతిపొడి - పావు చెంచా, కారం - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, క్యారెట్లు - పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగినవి), ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - రెండురెబ్బలు, చక్కెర - కొద్దిగా, నిమ్మరసం - మూడు చెంచాలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర - పావుచెంచా చొప్పున, నూనె - కప్పు.
తయారీ
ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చిని వేయించాలి. ఆ తరువాత కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయల పచ్చివాసన పోయాక దింపేయాలి. అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతోపాటు మిగిలిన అన్ని పదార్థాల్నీ వేసేయాలి. మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది.
ఇదీ చదవండి: లంబోదరుడు మెచ్చే చవితి స్పెషల్ రెసిపీస్