- పుచ్చకాయ-తులసి టీ...
కావాల్సినవి
* మరిగించిన నీరు - 10 కప్పులు
* టీ బ్యాగులు - 10
* చిన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు - ఒక కప్పు
* తులసి ఆకులు - అర కప్పు
* చక్కెర - రుచికి సరిపడా
తయారీ
ముందుగా మరిగించిన నీటిలో టీ బ్యాగుల్ని వేసి పది నిమిషాల పాటు ఉంచాలి. ఆపై వాటిని తొలగించి ఆ నీటిని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక్కో కప్పు లేదా గ్లాసులో ఆ నీటిని పోసి అందులో పుచ్చకాయ ముక్కలు, తులసి ఆకులు, సరిపడా చక్కెర వేసి ఆఖరున ఐస్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరి.. పుచ్చకాయ-తులసి ఐస్డ్ టీ సిద్ధం. శరీరంలోని వేడిని దూరం చేసి చల్లదనాన్ని పంచుతుందీ ఛాయ్.
- కీరా-పుదీనా టీ
కావాల్సినవి
* నీళ్లు - 4 కప్పులు
* గ్రీన్ టీ బ్యాగులు - 4
* పుదీనా ఆకులు - అరకప్పు
* చెక్కు తీసి చిన్నగా తరిగిన కీరా ముక్కలు - ఒక కప్పు
* తేనె - పావు కప్పు
* నిమ్మరసం - పావు కప్పు
తయారీ
నాలుగు గ్రీన్ టీ బ్యాగుల్ని నాలుగు కప్పుల నీళ్లలో వేసి అందులోనే కీరా దోస ముక్కలు, పుదీనా ఆకుల్ని వేసి పావుగంట పాటు సిమ్లో మరిగించుకోవాలి. ఆపై ఈ మిశ్రమం చల్లారాక వడకట్టుకొని దీనికి నిమ్మరసం, తేనె, ఐస్ ముక్కలు చేర్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన అతిథులకు ఈ టీని అందించచ్చు.
- నిమ్మరసం-అల్లం టీ
కావాల్సినవి
* బ్లాక్ టీ బ్యాగులు - 5
* నీళ్లు - 5 కప్పులు
* నిమ్మకాయలు - 2 (స్త్లెసుల్లా కట్ చేసుకోవాలి)
* అల్లం తురుము - రెండు టీస్పూన్లు
* తేనె - పావు కప్పు
తయారీ
ముందుగా టీ బ్యాగుల్ని నీటిలో వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చుకోవాలి. ఆలోపు గ్లాసుల్లో నిమ్మ స్త్లెసెస్, అల్లం తురుము వేసి రడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన నీటిలోని టీ బ్యాగుల్ని తొలగించి ఆ నీటిని గ్లాసుల్లో పోసుకోవాలి. ఆఖరున తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఎండ వల్ల అలసిన మెదడును పునరుత్తేజితం చేస్తుంది.
- రాస్బెర్రీ ఐస్డ్ టీ
కావాల్సినవి
* నీళ్లు - 5 కప్పులు
* టీ బ్యాగులు - 5
* రాస్బెర్రీలు - కప్పు
* తేనె లేదా చక్కెర - రుచికి సరిపడా
తయారీ
ముందుగా నీటిని మరిగించి దించి అందులో టీ బ్యాగుల్ని వేయాలి. పది నిమిషాల తర్వాత టీ బ్యాగుల్ని తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొన్ని నీళ్లు, రాస్బెర్రీలు తీసుకొని కాసేపు మరిగించుకోవాలి. చల్లారాక దీన్ని వడకట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్న టీ మిశ్రమంలో కలుపుకోవాలి. చివరగా తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టీ ద్వారా 23 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 88 క్యాలరీల శక్తి మనకు అందుతుంది.
- తులసి-స్ట్రాబెర్రీ టీ
కావాల్సినవి
* నీళ్లు - 5 కప్పులు
* గ్రీన్ టీ బ్యాగులు - 8
* తులసి ఆకులు - గుప్పెడు
* స్ట్రాబెర్రీలు - కప్పు
* తేనె లేదా చక్కెర - రుచికి సరిపడా
తయారీ
ముందుగా మరిగించి పెట్టుకున్న గ్రీన్ టీ మిశ్రమంలో స్ట్రాబెర్రీ ముక్కలు, తులసి ఆకులు వేసుకోవాలి. ఈ నీళ్లు చల్లారాక వడకట్టుకొని గ్లాసుల్లోకి తీసుకొని రుచికి సరిపడా తేనె లేదా చక్కెర, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ టీ మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
- లెమనేడ్-మింట్ టీ
కావాల్సినవి
* నీళ్లు - 4 కప్పులు
* గ్రీన్ టీ బ్యాగులు - 4
* నిమ్మరసం - 2 టీస్పూన్లు
* పుదీనా ఆకులు - అరకప్పు
* తేనె లేదా చక్కెర - రుచికి సరిపడా
తయారీ
ముందుగా మరిగించుకున్న నీటిలో గ్రీన్ టీ బ్యాగులు, నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి చల్లారనివ్వాలి. ఆపై దీన్ని వడకట్టుకొని గ్లాసుల్లోకి తీసుకొని తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే చల్లదనాన్ని, మెదడుకు నూతనోత్సాహాన్ని పంచే లెమనేడ్ మింట్ టీ సిద్ధం.