పప్పుచారు లేదా సాంబారుతోపాటు ఆలూ వేపుడు ఉంటే చాలు... ఓ పట్టు పట్టేయొచ్చు అనేస్తుంటారు ఆహార ప్రియులు. కానీ ఎప్పుడూ ఆలూ వేపుడే అంటే బోర్ కొట్టదూ. అందుకే ఈసారి వీటిని ప్రయత్నించి చూస్తే సరి.
క్యాలిఫ్లవర్‌తో...
కావలసినవి
క్యాలిఫ్లవర్ పువ్వులు: ఇరవై, టొమాటోలు: రెండు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: రెండు చెంచాలు, పసుపు: అర చెంచా, కారం: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
ముందుగా మిక్సీలో ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, బియ్యప్పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాలిఫ్లవర్ పువ్వులు వేసి కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత బయటకు తీసి మొక్కజొన్నపిండి కలిపి రెండుమూడు చొప్పున పువ్వుల్ని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు.
ఉల్లిపాయతో...
కావలసినవి
మైదా: అరకప్పు, నీళ్లు: అరకప్పు, గుడ్డు: ఒకటి, ఉప్పు: తగినంత, బేకింగ్‌పౌడర్: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
ఓ గిన్నెలో నూనె, ఉల్లిపాయ తప్ప మిగిలిన పదార్థాలు వేసుకుని అన్నింటినీ గిలకొట్టినట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను సన్నని చక్రాల్లా తరిగి... ఒక్కో ముక్కను తీసుకుని మైదా మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. ఇవి అన్నంలోకే కాదు విడిగా తినేందుకూ బాగుంటాయి.
వంకాయతో...
కావలసినవి
వంకాయ: పెద్దది ఒకటి, కారం: ఒకటిన్నర టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, బొంబాయిరవ్వ: పావుకప్పు.
తయారీ విధానం:
ఓ గిన్నెలో టేబుల్‌స్పూను కారం, పసుపు, బియ్యప్పిండి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తరవాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. ఇందులో చక్రాల్లా తరిగిన వంకాయ ముక్కల్ని వేసి వాటికి మసాలా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో బొంబాయిరవ్వ, కొద్దిగా ఉప్పు, మిగిలిన కారం వేసుకుని కలిపి పెట్టుకోవాలి. పావుగంటయ్యాక ఒక్కో వంకాయ ముక్కను తీసుకుని బొంబాయిరవ్వలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
బెండకాయతో...
కావలసినవి
బెండకాయలు: పావుకేజీ, దనియాలపొడి: చెంచా, కారం: అరచెంచా, పసుపు: పావుచెంచా, జీలకర్రపొడి: చెంచా, చాట్‌మసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, సెనగపిండి: పావుకప్పు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం:
బెండకాయల్ని కడిగి రెండు ముక్కల్లా చేసుకుని మధ్యలో గాటు పెట్టుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. వీటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి చాలా కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక బెండకాయ ముక్కల్ని కొద్దికొద్దిగా నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
చిట్కా
కొన్ని వంటకాల్లో ఫలానా పదార్థం వాడాలని ఉన్నా అది అన్నిసార్లూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలబ్బా అని కంగారుపడే బదులు... వీటిని ప్రత్యామ్నాయంగా వాడితే సరి.
*మైదా అందుబాటులో లేకపోయినా, దాన్ని వాడటం ఇష్టంలేకపోయినా బదులుగా గోధుమపిండిని ఎంచుకోవచ్చు. ఓ వంటకంలో మైదాపిండి ఒక కప్పు వాడాల్సి ఉంటే...గోధుమపిండిని అందులో సగమే తీసుకోవాలి.
* వేపుళ్లు చేస్తున్నప్పుడు బ్రెడ్‌పొడి అందుబాటులో లేకపోయినా, దానికి బదులుగా కాస్త కొత్తగా ఏదయినా వాడాలనుకున్నా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్‌ని పొడిలా చేసి వాడొచ్చు. వీటివల్ల రుచి పెరగడమే కాదు, వేపుళ్లు కూడా కరకరలాడేలా వస్తాయి.
* మంచూరియా, పాస్తా వంటి వంటకాల తయారీలో టొమాటోసాస్ వేస్తుంటాం. కానీ సాస్ ఇంట్లో లేకపోతే టొమాటోను గ్రైండ్‌చేసి అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర వేసి వాడుకోవచ్చు. అచ్చంగా సాస్ రుచిలోనే కావాలనుకుంటే టొమాటో గుజ్జును
ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం, చక్కెర వేసుకుంటే సరి.
ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ కొలువును వదిలి.. చిత్రకళలో సత్తా చాటుతోన్న యువతి