ఉప్మా రుచిగా రావాలంటే నాణ్యమైన ఉప్మారవ్వను ఎంచుకోవాలి.
తయారు చేసే విధానం:
- రవ్వను ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇలా చేస్తే కమ్మటి వాసనతోపాటు ఉప్మా ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది.
- నూనెతో కాకుండా ఆవు నెయ్యితో చేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ వస్తాయి.
- ఈ అల్పాహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా వేయకూడదు. అసలు వేయకుండా చేసిన ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.
- దీని తయారీకి వాడే కడాయి/గిన్నె అడుగు భాగం చాలా మందంగా ఉండాలి. పలుచగా ఉంటే త్వరగా అడుగంటుతుంది.
- మరిగే నీళ్లలో కొద్దికొద్దిగా రవ్వ పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
- పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇందులో జీడిపప్పు, వేరుసెనగపప్పులు వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, పనీర్, కొత్తిమీరా, బఠానీలను తాలింపులో వేస్తే రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
- ఈ టిఫిన్‌ను వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. టేస్ట్ పెరగడానికి నీళ్లలో ఉప్పుతోపాటు కాస్తంత పంచదార కూడా కలుపుతుంటారు కొందరు. సన్నగా తురిమిన అల్లం ముక్కలను వేసుకుంటే ప్రత్యేకమైన రుచి వస్తుంది.
- పల్లీలను ముందుగా నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా అంతా తయారైన తర్వాత చివరగా వేసుకుంటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
- చిన్నారులు ఉప్మాను ఇష్టపడాలంటే ఉప్మా తయారైన తర్వాత కాజూ, పల్లీలు, సేవ్, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పెడితే ఇష్టంగా తింటారు.
- వడ్డించడానికి ముందు చెంచా నిమ్మరసం కలిపితే మరింత రుచి పెరుగుతుంది. అలాగే చెంచా నెయ్యిని కూడా జోడిస్తే అదనపు రుచి మీ సొంతమవుతుంది.
ఇదీ చూడండి:నూడుల్స్ పొడిపొడిగా రావాలంటే!