మష్రూమ్ రోల్స్‌తో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. మరి ఈ పుట్టగొడుగుల రోల్స్‌ని సింపుల్‌గా ఎలా చేసుకువాలో ఓ లుక్కేయండి...
కావల్సినవి..
ఫిల్లింగ్ కోసం: ఉల్లిపాయలు - రెండు, కొత్తిమీర - కట్ట, వెల్లుల్లి ముక్కలు - ఒకటిన్నర చెంచా, పాలకూర తరుగు - కప్పు, పుట్టగొడుగు ముక్కలు - రెండు కప్పులు, ఉల్లికాడల తరుగు - అరకప్పు, మిరియాలపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.
సాస్ కోసం...
వెన్న - టేబుల్‌స్పూను, మైదా - టేబుల్‌స్పూను, పాలు - ముప్పావుకప్పు, చీజ్ తురుము - అరకప్పు.
పాన్‌కేక్ కోసం...
మైదా - రెండుకప్పులు, గుడ్లు - రెండు, నీళ్లు - రెండున్నర కప్పులు, ఉప్పు - కొద్దిగా, బ్రెడ్‌పొడి - రెండు కప్పులు.
తయారీ..
ముందుగా ఫిల్లింగ్ తయారుచేసుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల తరుగూ, కొత్తిమీర తరుగూ, వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు వేగి రంగు మారాక పుట్టగొడుగు ముక్కలు, కాసిని నీళ్లు పోసి మూత పెట్టేయాలి. కాసేపటికి అవి వేగి, నీళ్లు ఆవిరైపోతాయి.
ఇప్పుడు పాలకూర తరుగు, కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడి వేయాలి. పాలకూర కొద్దిగా వేగిందనుకున్నాక దింపేయాలి. ఇప్పుడు సాస్ తయారు చేసుకోవాలి. ఓ గిన్నెలో వెన్న తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక మైదా వేసి వేయించాలి. దాన్లో పచ్చివాసన పోయాక పాలు, చీజ్ తురుము ఒకదాని తరవాత మరొకటి వేయాలి. చీజ్ కరిగి ఈ మిశ్రమం సాస్‌లా తయారయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న పుట్టగొడుగుల కూర వేసి దింపేయాలి.
పాన్‌కేక్‌ల తయారీకోసం సిద్ధంచేసుకున్న పదార్థాల్లో బ్రెడ్ పొడి తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. పొయ్యిమీద పెనంపెట్టి.. ఈ పిండిని చిన్న దోశలా వేయాలి. ఒక వైపు మాత్రమే కాలనిచ్చి తీసేయాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఒక పాన్‌కేక్‌ని తీసుకుని దానిమధ్యలో పుట్టగొడుగుల మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి.. రోల్‌లా చుట్టి అంచులు మూసేయాలి. దీన్ని బ్రెడ్‌పొడిలో అద్ది కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇదే విధంగా మిగిలినవీ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మష్రూమ్ రోల్స్ సిద్ధం.
ఇదీ చదవండి: ఆరు పదార్థాలతో అదిరిపోయే 'కోవా సమోసా' రెసిపీ!