Karthika Masam Special Usiri Godhuma Rava Pulihora : హిందూ పురాణాల్లో కార్తిక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఈ మాసం మొత్తం.. నిత్యపూజలతో గడుపుతారు. ఆలయాలన్నీ దీపాల కాంతితో కళకళలాడుతుంటాయి. శివనామస్మరణతో మార్మోగుతుంటాయి. కొందరు భక్తులు ఉపవాసాలు చేస్తుంటే.. మరికొందరు అయ్యప్ప దీక్ష చేపడతారు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకు, వ్రతాలకూ విశేషమైన ఫలితం ఉంటుందని భక్తులు భావిస్తారు. అంతేకాకుండా.. ఈ మాసంలో చాలా మంది నాన్‌వెజ్ తినరు. ఈ నేపథ్యంలో.. స్వామి వారికి నైవేద్యంగా పెట్టడంతోపాటు భక్తులకు ఎనర్జీ కోసం.. ఉసిరి గోధుమరవ్వ పులిహోర చాలా మంచిది. ఉపవాసం ఉండేవారికి మంచి ఎనర్జీ ఇస్తుంది. మరి ఈ పులిహోరకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు చూద్దాం.
How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!
కావలసిన పదార్థాలు:
- గోధుమ రవ్వ: 1 కప్పు
- మంచి నీరు-రెండు కప్పులు
- ఉసిరికాయలు-4
- పచ్చిమిర్చి: 6-8
- వేరుశెనగలు(పల్లీలు): గుప్పెడు
- పసుపు: 1/4 టీ స్పూన్
- పచ్చిశెనగపప్పు: 1 tsp
- ఆవాలు: 1/4 tsp
- జీలకర్ర: 1/4 tsp
- మినపప్పు:1/4 tsp
- ఎండుమిర్చి: 3-4
- ఇంగువ: చిటికెడు
- కరివేపాకు: రెండు రెమ్మలు
- నూనె: సరిపడా
- ఉప్పు: రుచికి తగినంత
తయారు చేసే విధానం:
- ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి.. లోపల గింజ తీసేయాలి. తర్వాత 5 పచ్చిమిర్చి కాయలు కూడా తీసుకోవాలి. ఈ రెండిటినీ మిక్సీలో వేసి.. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద ఓ గిన్నె పెట్టి.. అందులో రెండు కప్పుల నీరు పోయాలి. నీరు బాగా మరిగే సమయంలో ఓ కప్పు గోధుమ రవ్వ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి.. ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత పల్లీలు వేసి.. దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి అందులో తాళింపునకు సిద్ధం చేసుకొన్న పదార్థాలు (పచ్చిశెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ) ఒక దానికి తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి.
- తాళింపు వేగిన తర్వాత అందులో మిగిలిన పచ్చిమిర్చి వేసి.. మరో రెండు నిమిషాలు వేయించాలి.
- ఆ తర్వాత వేయించి పెట్టుకొన్న వేరుశనగపప్పు, పసుపు, వేసి ఒక నిమిషం వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో.. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ, పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి.. ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేవరకు.
- అనంతరం.. ఆ పోపులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న గోధుమ రవ్వను కూడా వేసి అన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. అంతే.. గోధుమ రవ్వ పులిహోర రెడీ. దీన్ని ఏదైనా ఊరగాయతో లేదో పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది.