సాధారణంగా సెనగలు, కందుల్లో బెల్లం కలిపి తయారుచేసే హోళిగల్ని ఆరగిస్తే ఆ మజానే వేరంటారు కన్నడిగులు. ఇప్పుడు అంతకన్నా మేలైన.. నాలుకకు మరింత రుచిని అందించే తమలపాకుల హోళిగలు సిద్ధంగా ఉన్నాయంటారు మంగళూరు పాకశాస్త్ర నిపుణులు! మంగళూరులో ఇప్పుడీ హోళిగలు పేరొందాయి. వీటి తయారీకి శ్రీకారం చుట్టిన శ్రీకృష్ణ శాస్త్రి ఇదివరకే కోకో, వక్క పిండితో హోళిగలు తయారుచేసి పేరు సంపాదించారు.
హోళిగల్ని తినడం వల్ల ఏమాత్రం కడుపుబ్బరం రాకుండా త్వరగా జీర్ణమయ్యేలా ఇవి పేరొందుతున్నాయి. భోజన ప్రియుల కోసం తమలపాకులను వినియోగించి వీటి తయారీని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సాధారణంగా సుష్టుగా భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటే జీర్ణశక్తి బాగుంటుందని అంటుంటారు. ఇప్పుడా ప్రయోగాన్నే హోళిగల తయారీలో అమలు చేసినట్లు చెబుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఎంతో ఆదరణ పొందుతున్న ఈ తమలపాకు హోళిగలను మనమూ తయారు చేస్తే పోలా!
హోళిగలను ఎలా చేస్తారంటే.. ఇవి మన బొబ్బట్ల మాదిరిగానే ఉంటాయి. ముందుగా సెనగ పప్పును అరగంటపాటు నానబెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో సెనగపప్పు కాకుండా కందిపప్పునూ ఉపయోగిస్తారు. పప్పు నానిన తరువాత అందులో అంతే పరిమాణంలో బెల్లాన్ని కలిపి ఉడకబెట్టాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని చల్లార్చి బాగా రుబ్బుకోవాలి. ఇందులోనే తమలపాకులను వేసి రుబ్బాలి (అరకిలో చొప్పున పప్పు, బెల్లానికి 20-25 తమలపాకులు వేసుకోవాలి). మైదా పిండిలో నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ పిండితో ఉండల్ని తయారు చేసుకోవాలి. ఒక్కో ఉండను కాసింత వెడల్పుగా చేసి అందులో సెనగపప్పు/కందిపప్పు తమలపాకు బెల్లం మిశ్రమాన్ని ఉంచి మూసివేయాలి. ఇప్పుడు చపాతీ చేసినట్లుగా ఒక్కో ఉండను ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెనంపై వేసి రెండు వైపులా నూనెవేసి కాలిస్తే.. నోరూరించే తమలపాకు హోళిగలు సిద్ధం.
- సి.జగన్మోహన్, బెంగళూరు
ఇవీ చదవండి: