ఉరుకుల పరుగుల జీవితంలో.. ఉదయాన్నే ఏదో ఒకటి తిని రోజు మొదలెడితే సరిపోతుంది అనుకుంటాం. కానీ, ఉదయం తీసుకునే ఆహారమే రోజంతా మనకు శక్తినిస్తుంది అన్న సంగతి మరచిపోతాం. కడుపు మాడ్చుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ, మన తెలుగువారి వంటింట్లోనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. అందులో ఒకటి ఈ ఆంధ్రా స్పెషల్ పెసరట్ట.
పెసరట్టులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెసర్లలో కొవ్వు శాతం చాలా తక్కువ. పైగా కావలసినంత ఫైబర్ ఉంటుంది. ఇది బరువు పెరగకుండా చేస్తుంది. మీ శరీరాన్ని డీటాక్స్ చేసి.. దీర్ఘకాలిక అనారోగ్యాలను దూరం చేస్తుంది. పెసరట్టు మీ శరీరానికి శక్తినిచ్చి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మరి ఈ టేస్టీ, హెల్దీ పెసరట్టు ఎలా చేయాలంటే...
కావలసినవి ఇవే...
పెసర్లు-1 కప్పు, బ్రౌన్ రైస్-2 టేబుల్ స్పూన్లు, నీళ్లు-తగినంత, పచ్చిమిర్చి-2, అల్లం-అంగుళం ముక్క, ఉప్పు-రుచికి తగినంత, నూనె-1 టేబుల్ స్పూన్, ఆవాలు- 1టీస్పూన్, జీలకర్ర- 1టీస్పూన్, ఉల్లిపాయలు- అర కప్పు
సింపుల్‌గా తయారీ విధానం...
పెసర్లు, బ్రౌన్ రైస్‌లో తగినంత నీళ్లు పోసి.. నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆపై మిక్సీలో వేసి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని మెత్తగా, దోశ పిండిలా రుబ్బుకోవాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన ఉల్లిపాయలను పిండిలో కలిపేసుకోవాలి. అంతే పెనం మీద కొంచెం నూనె, అట్టు వేసుకుని వేడి వేడిగా అల్లం చట్నీ లేదా, పల్లీ చట్నీతో వడ్డించండి.
ఇదీ చదవండి:దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి