ఎంతో రుచిగా ఉండి.. ఆరోగ్యాన్ని పంచేది ఏదైనా ఉంది అంటే అది.. కోడి గుడ్డే అని చెప్పక తప్పదు. మరి ఆ గుడ్డును మరింత టేస్టీగామార్చే గుడ్డు పుట్టు ఇలా చేసుకోండి..
కావాల్సినవి:
పుట్టు పొడి - రెండు కప్పులు (బజార్లో దొరుకుతుంది. లేదంటే బియ్యాన్ని రెండుమూడు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు వంపేసి మెత్తని వస్త్రంపై వేసి తడి ఆరనివ్వాలి. నీరంతా పోయి, బియ్యం కాస్త తడిగా ఉన్నప్పుడు మరీ మెత్తగా కాకుండా పిండి పట్టించాలి. చివరగా ఈ పిండిని దోరగా వేయించుకుంటే చాలు), కొబ్బరితురుము - కప్పు, ఉప్పు - తగినంత.
మసాలా కోసం:
గుడ్లు - నాలుగు, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున, అల్లంవెల్లుల్లి తరుగు - అరచెంచా చొప్పున, పసుపు - పావుచెంచా, కారం - అరచెంచా, ధనియాలపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - పావుచెంచా, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం:
- ముందుగా గుడ్డు మసాలా తయారు చేసుకోవాలి. గుడ్ల సొనను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో తగినంత ఉప్పూ, మిరియాలపొడి వేసి బాగా గిలక్కొట్టాలి.
- ఓ బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేడిచేసి.. గుడ్లసొన వేయాలి. అది ఉడికాక దింపేసి పెట్టుకోవాలి.
- మరో బాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి వేగాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి. తరువాత పసుపూ, కారం, దనియాలపొడి వేసి బాగా కలపాలి. నూనె కొద్దిగా పైకి తేలాక టొమాటో ముక్కలు వేయించాలి. ఇది ముద్దలా అయ్యేందుకు కాసిని నీళ్లు పోసి బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక ముందుగా చేసుకున్న గుడ్డు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి.
- ఇప్పుడు పుట్టు తయారు చేసుకోవాలి. ఓ గిన్నెలో ఈ పిండిని తీసుకుని, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత ఈ పిండి అంతా తడిసేలా కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులో సగం కొబ్బరితురుము వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ ఉండల్లాంటివి ఉంటే ఓసారి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది.ఈ పిండి తడిగా, ఉండేలా చూసుకుంటే చాలు.
- ఇలా కలిపిన పిండిని పదినిమిషాలు నాననివ్వాలి. తరవాత పుట్టు మౌల్డ్ తీసుకుని అందులో మిగిలిన కొబ్బరితురుములో టేబుల్‌స్పూను వేయాలి. తరవాత రెండు టేబుల్‌స్పూన్ల గుడ్డు మసాలా, దానిపైన నాలుగైదు టేబుల్‌స్పూన్ల పుట్టుపిండి వేయాలి.
- ఇలా ఆ మౌల్డ్ నిండేవరకూ ఒకదానిమీద మరొకటి వేసుకుంటూ వచ్చి మూత పెట్టేయాలి. ఇప్పుడు చిన్న కుక్కర్‌లో పావు వంతు వరకూ నీళ్లు తీసుకుని మూత పెట్టేయాలి. దీన్ని పొయ్యిమీద ఉంచాలి.
- పుట్టు మౌల్డ్‌ను వెయిట్ పెట్టే చోట ఉంచి.. ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించి తీస్తే చాలు. ఎంతో రుచికరమైన గుట్టుపుట్టు రెడీ.
ఇదీ చదవండి: టేస్టీ 'స్టఫ్డ్ ఎగ్..' నూనె లేకుండా సింపుల్‌గా చేసుకోండిలా!