మల్‌పువా

కావలసినవి
గోధుమపిండి: అరకప్పు, అరటిపండు: సగం, పెరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, సోంపు: అరచెంచా, యాలకులు: రెండు, నెయ్యి: వేయించేందుకు సరిపడా, చక్కెర: అరకప్పు.
తయారీ విధానం: గోధుమపిండి, అరటిపండు ముక్కలు, పెరుగు, సోంపు, యాలకులు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ చిక్కగా లేదా పల్చగా కాకుండా పిండిలా అయ్యేవరకూ గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. మరో గిన్నెను స్టౌమీద పెట్టి చక్కెర, అరకప్పు నీళ్లు పోయాలి. చక్కెర కరిగి తీగపాకం వచ్చాక దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక స్టౌని సిమ్‌లో పెట్టి... చిన్న గరిటెతో పిండిని తీసుకుని నెయ్యిలో వేసి రెండువైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్నాక ఒక్కోదాన్ని చక్కెరపాకంలో ముంచి నిమిషమయ్యాక తీసేయాలి.
నూడుల్స్

కావలసినవి
చపాతీలు: నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, క్యాబేజీ తరుగు: అరకప్పు, క్యారెట్ తరుగు: పావుకప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికం: అరకప్పు, షెజ్‌వన్‌సాస్: చెంచా, టొమాటోసాస్: చెంచా, కారం: పావుచెంచా, సోయాసాస్: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, వినెగర్: పావుచెంచా, ఉల్లికాడల తరుగు: కొద్దిగా, కొత్తిమీర: కట్ట.
తయారీ విధానం
ముందుగా చపాతీల(Roti)ను గుండ్రంగా రోల్‌లా చుట్టుకుని వీలైనంత సన్నగా, పొడుగ్గా వచ్చేలా కోసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు వేయించి కూరగాయ ముక్కలన్నింటినీ వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక మంటను తగ్గించి చపాతీ తరుగు తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలపాలి. ఇది గ్రేవీలా అయ్యాక చపాతీ తరుగును కూడా వేసి వాటికి మసాలా పట్టేలా కలిపి దింపేసి ఉల్లికాడల తరుగు, కొత్తిమీర అలంకరిస్తే చాలు.
కట్‌లెట్

కావలసినవి
చపాతీలు: మూడు, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, క్యారెట్ తరుగు: అరకప్పు, స్వీట్‌కార్న్: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, మైదా: అరకప్పు, బ్రెడ్‌పొడి: అరకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
ముందుగా మైదాలో నీళ్లు పోస్తూ మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో చపాతీలను వేసుకుని పొడిలా చేసుకోవాలి. బంగాళాదుంపను ముద్దలా చేసుకుని అందులో నూనె, మైదా, బ్రెడ్‌పొడి తప్ప మిలిగిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చపాతీ మిశ్రమాన్ని తీసుకుని కట్‌లెట్‌లా చేసుకుని మొదట మైదా మిశ్రమంలో ముంచి తరువాత బ్రెడ్‌పొడిలో అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.
చిల్లీ చపాతీ

కావలసినవి
చపాతీలు: నాలుగు (ముక్కల్లా చేసుకోవాలి), జీలకర్ర: చెంచా, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిపాయ తరుగు: ఒకటింబావు కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, టొమాటో తరుగు: కప్పు, కారం: ఒకటిన్నర చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: పావుచెంచా, పసుపు: పావుచెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, నిమ్మరసం: చెంచా.
తయారీ విధానం: స్టౌమీద కడాయిపెట్టి నూనె వేసి జీలకర్ర వేయించి పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేయాలి. వీటన్నింటినీ బాగా వేయించి పసుపు, కారం, దనియాలపొడి, తగినంత ఉప్పు, గరంమసాలా వేసి మరోసారి కలిపి చపాతీముక్కలను ఇందులో వేసి వేయించాలి. అయిదు నిమిషాల తరువాత నిమ్మరసం వేసి కొత్తిమీర చల్లి దింపేయాలి.
లడ్డు

కావలసినవి
చపాతీలు: ఏడు, నెయ్యి: పావుకప్పు, డ్రైఫ్రూట్స్ పలుకులు: పావుకప్పు, బెల్లం తరుగు: అరకప్పు, నీళ్లు: రెండు చెంచాలు, కోవా: పావుకప్పు, యాలకులపొడి: పావుచెంచా.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి చపాతీ(Roti) ముక్కల్ని వేసి దోరగా వేయించి తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక మిక్సీలో వేసి పొడిలా చేసిపెట్టుకోవాలి. అదే బాణలిని మళ్లీ స్టౌమీద పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని వేయించుకుని, చపాతీపొడిని కూడా వేసి వేయించి దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద గిన్నె పెట్టి బెల్లం తరుగు, నీళ్లు పోయాలి. బెల్లం కరిగాక ఆ పాకంతోపాటు యాలకులపొడి, కోవా చపాతీ మిశ్రమంలో వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి.
- ఇదీ చదవండి : అవునండీ.. చేప గుజ్జుతో చేసిన కేకులివి!