మొక్కజొన్నతో బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు. ఈ వానాకాలంలో రోజుకో వెరైటీ చేసేద్దాం రండి.
మొక్కజొన్న చట్నీ
కావాల్సినవి
టమాటా ముక్కలు- కప్పు, కచ్చాపచ్చాగా రుబ్బిన స్వీట్‌కార్న్- పావుకప్పు, కరివేపాకు- రెబ్బ, అల్లం- చిన్నముక్క, సన్నగా తురిమిన పచ్చిమిర్చి- చెంచా, కారం- అరచెంచా, ఉప్పు- తగినంత, కలోంజి విత్తనాలు- పావుచెంచా, పంచదార- కొద్దిగా
తయారీ
కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని కలోంజి విత్తనాలను వేయించుకోవాలి. అవి వేగాక.. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు, కారం, పంచదార కూడా వేసి మూతపెట్టి వాటిని పూర్తిగా మగ్గనివ్వాలి. చివరిగా మిక్సీపట్టిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి రెండు నిమిషాలపాటు మగ్గనిస్తే పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని మిక్సీ పట్టి తాలింపు వేసినా బాగుంటుంది.
సమోసా
కావాల్సినవి
ఉడికించి కొద్దిగా మిక్సీ పట్టిన మొక్కజొన్న గింజలు- కప్పు, మైదా- కప్పు, పచ్చిమిర్చి- రెండు, నూనె- తగినంత, సన్నగా తరిగిన అల్లం- చెంచా, జీలకర్రపొడి- అరచెంచా, మిరియాలపొడి- చెంచా, గరంమసాలా- చెంచాన్నర, సెనగపిండి- చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత.
తయారీ
మైదాలో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి పిండి కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో చెంచా నూనె వేసుకుని అందులో మొక్కజొన్న గింజలు, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉప్పు, వేయించిన సెనగపిండి, కొత్తిమీర తురుము, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్రపొడి వేసి రెండు మూడు నిమిషాలపాటు వేయించుకోవాలి. మైదా పిండితో చిన్న చిన్న చపాతీల్లా చేసుకుని వాటిని కోన్ మాదిరిగా మడతపెట్టి అందులో వేయించిన మొక్కజొన్న గింజలని ఉంచి అంచులు మూసేయాలి. వీటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి.
మసాలా కార్న్
కావాల్సినవి
మొక్కజొన్న గింజలు- రెండు కప్పులు, బటర్- చెంచా, కారం- పావుచెంచా, జీలకర్రపొడి- పావుచెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, చాట్‌మసాలా- ముప్పావుచెంచా, ఉప్పు- తగినంత
తయారీ
మొక్కజొన్న గింజలను ఉడికించి పెట్టుకోవాలి. కడాయిలో బటర్ వేసుకుని అందులో గింజలని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు, కారం, జీలకర్రపొడి, చాట్‌మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. వేడివేడి మసాలాకార్న్‌ని వర్షంలో తింటే భలే మజాగా ఉంటుంది.
దోసెలు
కావాల్సినవి
మొక్కజొన్న గింజలు- కప్పు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లి- రెండు రెబ్బలు, పెసరపప్పు- అరకప్పు, ఉప్పు- తగినంత, బియ్యప్పిండి- రెండుచెంచాలు
తయారీ
మొక్కజొన్నగింజలు, నానబెట్టిన పెసరపప్పును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బియ్యప్పిండి, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు కలిపి దోసెల మాదిరిగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
కేక్
కావాల్సినవి
స్వీట్‌కార్న్ గింజలు- రెండున్నర కప్పులు, చిక్కటిపాలు- కప్పు, కొబ్బరిపాలు- కప్పు, మొక్కజొన్న రవ్వ- రెండుకప్పులు, పంచదార- కప్పున్నర, నూనె- ముప్పావుకప్పు, గుడ్లు- నాలుగు, కొబ్బరికోరు- కప్పు, ఉప్పు- తగినంత, బేకింగ్‌సోడా- అరచెంచా.
తయారీ
ముందుగా అవెన్‌ని 350 డిగ్రీల ఫారిన్‌హీట్ దగ్గర వేడిచేసి ఉంచుకోవాలి. బేక్ చేయాలనుకుంటున్న పాన్‌కి బటర్ రాసి సిద్ధం చేసి పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో మొక్కజొన్న గింజలు, పాలు వేసి మెత్తగా పేస్ట్‌లా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఇందులోనే కొబ్బరిపాలు, మొక్కజొన్న రవ్వ, పంచదార, నూనె, గుడ్లు, ఉప్పు వేసి అన్నీ ఒకదానితో ఒకటి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చివరిగా బేకింగ్ సోడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని..
బేకింగ్‌పాన్‌లో వేసి 50 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. చివరిగా టూత్‌పిక్‌తో గుచ్చి చూస్తే పిండి టూత్‌పిక్‌కి అంటుకోకుండా ఉండాలి. అవెన్ నుంచి తీసి... అంచుల నుంచి కేక్‌ని వేరుచేసి చల్లార్చుకోవాలి.
- మొక్కజొన్న పొత్తుల పైన ఉండే తెల్లని పొరల్లో చికెన్ ఉడికించి చేసే టామలిన్స్ అనే వంటకాన్ని అమెరికన్లు ఇష్టంగా తింటారు. ఇందుకోసం ఆ తొక్కలని విడిగా సూపర్‌మార్కెట్లో కొనుక్కుంటారు.
- మొక్కజొన్న గింజలు శరీరంలోని ఫ్రి రాడికల్స్‌ని దూరం చేసి చర్మానికి నిగారింపు తెస్తాయి.ఎప్పుడైనా నిస్సత్తువగా అనిపించినప్పుడు మొక్కజొన్న వంటకాలు తిని చూడండి. మొక్కజొన్నలోని ఫోలిక్‌యాసిడ్ నిస్సత్తువని దూరం చేస్తుంది.
ఇదీ చదవండి: చిటచిట చినుకులు పడుతుంటే.. మొక్కజొన్న తినేద్దామా...