కార్న్ ఉడికించి కాస్త కారం, నిమ్మకాయ పూసి తింటే ఆ రుచే వేరు. ఈసారి కాస్త భిన్నంగా కార్న్ కూర చేసేద్దామా.. ఇంతకీ కూర ఏంటీ అనుకుంటున్నారా. అదేనండీ కార్న్ మసాలా.. ఇంతకీ దీన్ని ఎలా చేయాలో తెలుసా!
కార్న్ మసాలా చేయడానికి కావాల్సిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు - కప్పు
నూనె - టేబుల్ స్పూను
జీలకర్ర, మినపపప్పు, శెనగపప్పు - చెంచా చొప్పున
కరివేపాకు - రెండు రెబ్బలు
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - రెండు రెబ్బలు
అల్లం తరుగు - చెంచా
కొబ్బరి తురుము - అరకప్పు
పసుపు - అరచెంచా
కారం - చెంచా
ధనియాల పొడి - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
చింతపండు రసం - 3 చెంచాలు
బెల్లం తరుగు - చెంచా
గరం మసాలా - చెంచా
నిమ్మరసం - కొద్దిగా
మసాలా కోసం..
లవంగాలు - 8
మిరియాలు - చెంచా
యాలకులు - 6
ధనియాలు - టేబుల్ స్పూను
జీలకర్ర - టేబుల్ స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
తయారీ విధానం
- ముందుగా మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసుకోవాలి.
- బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, మినపపప్పు, శెనగపప్పు వేయించాలి.
- రెండు నిమిషాలయ్యాక కరివేపాకూ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి.
- ఉల్లిపాయలు వేగాక కొబ్బరి తురుము కలపాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక పసుపు, కారం, ధనియాల పొడి, ముందుగా తయారు చేసుకున్న మసాలా, తగినంత ఉప్పూ, కాసిని నీళ్లూ, చింతపండు రసం, బెల్లం తరుగు, మొక్కజొన్న గింజలు వేయాలి. ఆ గింజలు ఉడికాయనుకున్నాక గరం మసాలా, నిమ్మరసం వేసి దింపేస్తే చాలు.
ఇదీ చదవండి: 'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'