కోడి గుడ్డు, కౌజు పిట్ట గుడ్డు... ఏదైనాగానీ పెంకు రంగు ఎలాగున్నా లోపల తెల్లగానే ఉండటంతో చూడగానే అందరికీ తినాలనిపించదు. ఉడికించిన రూపంలో తినడంకూడా చాలామందికి ఇష్టం ఉండదు. కానీ అందులో శక్తిమంతమైన ప్రొటీనూ, రిబోఫ్లేవినూ, ఎ, డి, ఇ, కె విటమిన్లూ; ఖనిజాలూ, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ, కెరోటినాయిడ్లూ... ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
కోలీన్ మెదడు పనితీరుకి తోడ్పడితే, ల్యూటెన్, జియాజాంథిన్ వంటివి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాటరాక్ట్ రాకుండా చూడటంతోబాటు కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి. అందుకే ఆరోగ్యాన్ని పెంపొందించే గుడ్డుని బాయిల్డ్ ఎగ్ రూపంలోనే ఇష్టంగా తినాలంటే సహజ రంగులద్దాల్సిందే అంటున్నారు ఈతరం షెఫ్‌లు. పైగా ఈ రంగులన్నీ కూరగాయలూ ఆకుకూరల నుంచి వచ్చినవే కాబట్టి డబుల్ ధమాకాలా ఒక్క గుడ్డుతో లాభాలనేకం.
ఎలా అద్దుతారు?
ఐరోపా, అమెరికా దేశాల్లో ఈస్టర్ పండగ సమయంలో సంతాన సాఫల్యత, పుట్టుకకి సంకేతమైన గుడ్డును రంగులతో అలంకరించి కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇప్పుడు పండగతో సంబంధం లేకుండా రోజూ తినేందుకూ గుడ్డుకి రంగులద్దుతున్నారు. అదీ ఈస్టర్ గుడ్లలోలా కేవలం పైభాగానికి కాకుండా గుడ్డు తెల్లసొనకే నేరుగా ఇంకేలా చేస్తున్నారు.
రంగులకోసం పసుపు, బీట్‌రూట్, క్యారెట్, ఎరుపు, వంకాయ రంగు క్యాబేజీ, పాలకూర, బెర్రీలూ, నల్లద్రాక్ష, ఉల్లిపొట్టు... వంటి వాటిని వాడతారు. ముందుగా నీళ్లలో ఒకటీరెండు టీస్పూన్ల వైట్ వినెగర్ వేసి మరిగించి ఆపై కోరిన రంగు కూరగాయల ముక్కలు వేసి సుమారు పదీ పదిహేను నిమిషాలు ఉడికించి చల్లార్చాలి. ఆపై అందులో ఉడికించి పెంకు తీసిన గుడ్లు వేసి కోరిన రంగు వచ్చేవరకూ ఉంచాలి. ఉదాహరణకు గులాబీరంగు గుడ్డుకోసం బీట్‌రూట్ ముక్కల్ని తీసుకుని మరిగించిన నీళ్లలో వేసి పది నిమిషాలు ఉడికించి, చల్లారిన నీటిలో గుడ్లు వేయాలి. చిక్కని బీట్‌రూట్ రసంలోనే ఎక్కువసేపు నానబెడితే ఎరుపు రంగువి వస్తాయి. వంకాయ రంగు క్యాబేజీ తురుము వేసి ఉడికించిన నీటిలో కాస్త బేకింగ్ సోడా వేస్తే లేత ఊదారంగు గుడ్లు వస్తాయి.
ముదురు వంకాయ వర్ణం కావాలంటే రెండు టీస్పూన్లు బేకింగ్‌సోడా వేయాలి. నీలం రంగుకోసం మరికాస్త వేయాల్సి ఉంటుంది. పసుపు రంగు గుడ్ల కోసం పసుపు వేసి రెండుమూడు నిమిషాలు మరిగించి గుడ్లు వేస్తే సరి. ఇలాగే నచ్చిన రంగులకోసం ఆయా రంగు కూరగాయలూ లేదా ఆకుకూరల్ని తగినంత వేసి ఉడికించాక గుడ్లు వేయాలి. అవి ఆ మిశ్రమంలో నానే సమయం, కూరగాయల రంగుల్ని బట్టి గుడ్డు రంగు ఉంటుంది. బీట్‌రూట్ రంగు గుడ్లకు త్వరగానే పడుతుంది.
కానీ నీలం, వంకాయ వర్ణాలు త్వరగా ఇంకవు కాబట్టి ఎక్కువ సమయం ఉంచాలి. ఈ గుడ్లు నిల్వ ఉండాలంటే ఒక వంతు నీళ్లకి ఒక వంతు వినెగర్, కాస్త పంచదార, ఉప్పు కూడా వేసి మరిగించాక కూరగాయ ముక్కలు వేసి ఉడికించాలి. తరవాత ఆ నీళ్లలో గుడ్లను వేసి కోరిన రంగు వచ్చేవరకూ ఫ్రిజ్‌లో పెడితే ఊరగాయల్లా రెండుమూడు నెలలవరకూ నిల్వ ఉంటాయట. సో.. నచ్చిన పద్ధతుల్లో రంగుల గుడ్లను ఉడికించి, అందంగా అలంకరించి పిల్లలతోపాటు అతిథుల్నీ అలరించండి!