అంతర్జాతీయ మార్కెట్లో కృత్రిమంగా క్షీణిస్తున్న ధరలు.. దేశంలోని మొక్కజొన్న రైతులకు శాపంలా మారాయి. ధరలు పడిపోయి.. పెట్టుబడులు పెరిగి.. నిల్వ చేసుకునేందుకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న రైతులను ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం మరింత కుంగదీస్తోంది. భారీ మొత్తంలో మక్కల దిగుమతికి ఎన్డీఏ సర్కారు అనుమతివ్వడం కర్షకులను మరింత కష్టాల్లోకి నెడుతోంది.
దిగుమతి ఎందుకు?
ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యూటీఓ ప్రతిపాదించిన 'సుంకం రేటు కోటా పథకం' కింద 50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 10వేల మెట్రిక్ టన్నుల పాలు, పాల ఉత్పత్తులను కేవలం 15 శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకోవడానికి కేంద్రం ఇటీవల అమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని రైతులకు శరాఘాతంగా మారింది. ముఖ్యంగా మొక్కజొన్న రైతుల పాలిట శాపమైంది.
సుంకం రేటు కోటా పథకం( టీఅర్క్యూసీ) అంటే?
దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం 'ప్రపంచ వాణిజ్య సంస్థ' ఉద్దేశం. సుంకాల విషయంలో పరిమితులను తొలగించడం, రాయితీలు కల్పించడం లాంటి అంశాలు దేశాల మధ్య వాణిజ్యాన్ని బలపరుస్తాయని డబ్ల్యూటీఓ భావించింది. ఈ మేరకు ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే దీని వల్ల అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ లాభపడుతున్నాయని వర్ధమాన దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలో తమకు కూడా సమాన వాణిజ్య అవకాశాలు కల్పించాలని భారత్ సహా ఆఫ్రికా దేశాలు గళమెత్తాయి. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ నాయకత్వం వహించింది. కానీ దీన్ని అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. ఎందుకంటే సుంకాల కారణంగా అమెరికాకు చెందిన రైతులే ఎక్కువ లాభపడుతున్నారు. ఈ సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఉత్పత్తులపై విధించే సుంకాలపై కొంత రాయితీ ఇవ్వాలని వాషింగ్టన్ భావించింది. ఈ క్రమంలోనే డబ్ల్యూటీఓ సుంకం రేటు కోటా పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం కోసం విస్తృతంగా తమ దేశీయ మార్కెట్లను తెరిచాయి.
సంకాలు, వాణిజ్యం ఒప్పందంలోని అధికరణ 28 ప్రకారం భారత్ సైతం అంతర్జాతీయ మార్కెట్‌కు తలుపులు తెరిచింది. దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో మొక్కజొన్నపై 50శాతం, ఇతర తృణధాన్యాలపై 40 నుంచి 60 శాతం దిగుమతి సుంకాన్ని కేంద్రం ప్రభుత్వం విధిస్తోంది.
ఈ పథకం కిందే దేశ రైతులకు నష్టం కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది భారత్. 50 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల దిగుమతికి అనుమతిచ్చింది. అది కూడా 15 శాతం కస్టమ్స్ సుంకంతోనే.
ఎకరానికి రూ.20వేల నష్టం..
దేశంలో ప్రస్తుతం మొక్కజొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. రబీలో ధరలు దారుణంగా పడిపోయాయి. బిహార్‌లోని రైతులు ఎకరానికి రూ.20 వేల నష్టాన్ని చవిచూశారు. పంటను నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోడవం వల్ల రైతులు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వచ్చింది. రసాయనాల వినియోగం పెరగడం వల్ల అనేక మందికి పెట్టుబడి కూడా రాని దయనీయ పరిస్థితి నెలకొంది.
వెంటాడుతున్న తెగులు..
దేశంలోని అనేక ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను తెగులు సమస్య వెంటాడుతోంది. ఫాల్ ఆర్మీవామ్ అనే తెగులు పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బిహార్, కర్ణాటక, తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీని నివారణకు రైతులు విపరీతంగా రసాయనాలను పంటలపై ప్రయోగించాల్సి వస్తోంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి కూడా పెరిగిపోతోంది. ఇంత చేసినా ఆ తెగులును నియంత్రించడం సాధ్యం కాని పరిస్థితి.
కరోనా దెబ్బ..
మొక్కజొన్న రైతులపై లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్నే చూపింది. మొక్కజొన్న వ్యాపారంలో 60శాతం వాటా పౌల్ట్రీ రంగానిదే. లాక్డౌన్లో దేశం మొత్తం స్తంభించిపోవడం వల్ల పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఫలితంగా మక్కల వినియోగం తగ్గి.. ధరలు విపరీతంగా పడిపోయాయి. దీంతో రైతులు ఏమీ చేయలేక తలలు పట్టుకున్నారు.
ప్రమాదంలో దేశీయ వంగడం..
ప్రపంచ వ్యాప్తంగా రెండు రకాలు మొక్కజొన్న పంటలు పండుతున్నాయి. అందులో జన్యుపరంగా సవరించిన(జీఎం) పంట ఒకటి. సవరించని( నాన్- జీఎం) పంట మరొకటి. నాన్-జీఎం పంట భారత్‌లోనే అధికంగా పండుతుంది. అయితే జీఎం పంట అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఆ పంట అమెరికా, బ్రెజిల్లో అధికంగా పండుతుంది. ఆయా దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే 50 లక్షల టన్నుల మొక్కజొన్నల్లో జీఎం పంట లేకుండా చూడడం చాలా కష్టం. ఒకవేళ జీఎం పంట భారత్‌లోకి వస్తే.. దానితోపాటు కొత్త తెగుళ్లూ దేశంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా దేశీయ వంగడం నాశనం కానుంది. ఆ తర్వాత భవిష్యత్‌లో భారతదేశం విదేశీ మక్కలపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
పెరిగిన సాగు విస్తీర్ణం..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉత్తర భారతదేశంలో అధికంగా మొక్కజొన్న పంటను వేశారు. చాలామంది కూరగాయలు, పూల రైతులు మొక్కజొన్ననే శ్రేయస్కరంగా భావించారు. ఫలితంగా పంట విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో ఈ సారి అధిక ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ధరలు మరోసారి పడిపోయే అవకాశం ఉంది.
మద్ధతు ధర కష్టమే..
కేంద్రం అమోదించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల దిగుమతితో అక్టోబర్ చివరి నాటికి మన గిడ్డంగులు నిండిపోతే.. దేశీయంగా పండిన పంటను నిల్వ చేసేందుకు చోటు దొరకని పరిస్థితి నెలకొంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వ్యాపారులకు ధాన్యాన్ని నిల్వ చేసుకునే పరిమితులను తొలగించింది ప్రభుత్వం. అలాగే రైతులే నేరుగా ఎగుమతిదారులకు విక్రయించే అవకాశం కల్పించింది. అయితే భారత్‌లో ఉత్పత్తి అయ్యే నాన్-జీఎం పంట ఖరీదైనది కావడం వల్ల దిగుమతిదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంటుంది. ఇన్ని అవరోధాల నడుమ దేశీయ రైతులకు కనీస మద్ధతు ధర ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది.
ప్రస్తుతం దేశంలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కృత్రిమంగా క్షీణించిన విదేశీ మొక్కజొన్న ధరలు దేశీయ రైతుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి. రాబోయే సంవత్సరాల్లో కూడా మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాలని భావిస్తే ఆ నిర్ణయం సమస్యను మరింత జఠిలం చేస్తుందని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(ఇంద్రశేఖర్ సింగ్, పాలసీ-ఔట్రీచ్, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్)