శరీరంలో ఏదైనా ఒక అవయవం పనితీరు క్షీణించి విఫలమైనప్పుడు దాన్ని తొలగించి, ఆ స్థానంలో మరొకరి అవయవాన్ని అమర్చి బాధితులకు స్వస్థత చేకూర్చవచ్చు. గుండె వంటి కీలకమైన అవయవాల మార్పిడిద్వారా రోగి ప్రాణాలనూ కాపాడవచ్చు. అవయవదానం చేసే దాతల వదాన్యత పలువురు బాధితులకు వరంగా పరిణమిస్తుంది. 1954లో మొట్టమొదటి అవయవ మార్పిడి చికిత్సను బోస్టన్‌లో విజయవంతంగా నిర్వహించారు. రెండు దశాబ్దాలుగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు 2019లో 1,53,867 అవయవ మార్పిడి చికిత్సలు పలు దేశాల్లో చోటు చేసుకున్నాయి. దశాబ్ద కాలంగా వివిధ వ్యాధులవల్ల ప్రజల్లో క్రియాశీలక అవయవాల వైఫల్యం అనూహ్యంగా వేగాన్ని సంతరించుకొంటోంది. ఆ మేరకు అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
'ఆర్గాన్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నెట్‌వర్క్' సమాచారం మేరకు ఒక్క అమెరికాలోనే ప్రస్తుతం 1,06,690 మంది అవయవ మార్పిడి చికిత్స కోసం నిరీక్షిస్తున్నారు. రోజూ సగటున 17మంది మృత్యువాత పడుతున్నారు. ప్రజలకు దానిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో దాగిఉన్న భయాలు, సందేహాలు, మూఢ నమ్మకాలను తొలగించి, ప్రతి ఒక్కరూ మరొకరి ఆరోగ్యానికి ఆలంబనగా నిలిచేలా చైతన్యపరచడమే ఈ దినోత్సవం ధ్యేయం.
అందరికీ అందని చికిత్స
'నేషనల్ హెల్త్ పోర్టల్' మార్గదర్శకాల మేరకు 18 ఏళ్లు దాటిన ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులెవరైనా అవయవ దానం చేయవచ్చు. మెదడు పని చేయక అచేతన (బ్రెయిన్ డెడ్) స్థితికి చేరుకొన్నవారు సైతం అవయవదానానికి అర్హులే. మూత్రపిండం, కాలేయం, గుండె, శ్వాసకోశాలు, క్లోమం, ప్రేవులు వంటి శరీర భాగాలే కాకుండా కార్నియా, ఎముక, గుండె కవాటాలు, మధ్య చెవి భాగాలు, చర్మం వంటి కణజాలాలను సైతం ఆపన్నులకు అందించవచ్చు. 'జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ' పర్యవేక్షణలో ఈ తరహా చికిత్సలు జరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల మార్పిడి పెద్దయెత్తున చోటుచేసుకొంటోంది. దాతలు తమ శరీరంలోని ఒక మూత్ర పిండాన్ని, బ్రెయిన్‌డెడ్ బాధితులు రెండింటిని దానం చేయవచ్చు. కాలేయ మార్పిడి చికిత్స రెండో స్థానంలో ఉంది. గుండె మార్పిడి శస్త్రచికిత్స బ్రెయిన్‌డెడ్ బాధితుల నుంచి మాత్రమే వీలవుతుంది. ప్రేవుల మార్పిడి అరుదుగా అమలవుతోంది. మరణానంతరం అవయవాలను దానం చేయాలంటే ఆన్‌లైన్‌లో లభించే ప్రతిజ్ఞా పత్రాన్ని పూరించాలి. వెంటనే ప్రభుత్వం వీరికి ఒక ప్రత్యేక సంఖ్య కలిగిన దాత కార్డును కేటాయిస్తుంది. ఆ దాత వివరాలు జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ వద్ద నిక్షిప్తమై ఉంటాయి. కానీ, ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న ప్రతి వెయ్యి మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే అవయవ మార్పిడి చికిత్స జరుగుతోంది.
ఇండియాలో అవయవ దానమనే భావన- సామాజిక, మతపరమైన కట్టుబాట్ల మధ్య కొట్టుమిట్టాడుతూ మొగ్గ దశలోనే ఉంది. అవగాహనలోపం, అపోహలు అవయవదానాలకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. దేశవ్యాప్తంగా ఏటా అయిదు లక్షల మంది సమయానికి అవయవాలు లభించక మృత్యువాత పడుతున్నట్లు ‘ఎయిమ్స్’ వెల్లడించింది. అమెరికా ఏప్రిల్‌ను అవయవదాన మాసంగా ప్రకటించి ఈ ప్రక్రియను పెద్దయెత్తున ప్రోత్సహిస్తోంది. మనదేశంలో కేవలం 0.01శాతం మాత్రమే అవయవ దానానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఈ విషయంలో ఇతర దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది. 2019లో భారత ప్రభుత్వం రూ.149.5 కోట్లు కేటాయించి జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా, ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయింది.
ముందంజలో తమిళనాడు
ప్రస్తుతం కొవిడ్ మహమ్మారివల్ల అవయవ దానాలు మందకొడిగా జరుగుతున్నాయి. అవయవ మార్పిడికి కేంద్ర ప్రభుత్వం 1994లోనే చట్టబద్ధత కల్పించింది. మనదేశంలో తమిళనాడు అవయవ మార్పిడి చికిత్సల్లో ముందంజలో ఉంది. గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, దిల్లీలలో సైతం ఈ కార్యక్రమం చురుగ్గానే సాగుతోంది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు మరీ వెనకబడి ఉన్నాయి. కార్పొరేట్ వైద్య రంగం చొరవతోనే అవయవ మార్పిడి చికిత్సలు చురుకందుకొంటున్నాయి. ఇండియాలో ‘మోహన్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ అవయవ దానంపై విశేషంగా కృషి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర ప్రజాచైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవయవ దానం పట్ల సానుకూల దృక్పథం కలిగేలా చూడాలి. మానవత్వం మూర్తీభవించిన ప్రతి ఒక్కరూ అవయవ దానానికి సిద్ధం కావడం ద్వారా మరొకరి లేదా కొంతమంది ప్రాణాలను కాపాడే మహద్భాగ్యం లభిస్తుంది.
రచయిత - డాక్టర్ జెడ్.ఎస్.శివప్రసాద్, వైద్య రంగ నిపుణులు