సమాజ అభివృద్ధిపై మనిషి మానసిక ఆరోగ్యం గణనీయ ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యానికి (Mental Health Day) సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్టోబరులో మానసిక ఆరోగ్య వారోత్సవాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తోపాటు, జాతీయ ఆరోగ్య సంస్థలు సైతం నిర్వహిస్తున్నాయి. ఇండియాలోనూ వ్యక్తిత్వ వికాసం, మనిషి మానసిక ప్రవర్తనలో సానుకూల మార్పులు తేవడం, మనోవిజ్ఞానశాస్త్ర రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఊపందుకున్నాయి. ఇటీవల అనుబంధ, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం జాతీయ కమిషన్ చట్టం రూపొందింది. దీనివల్ల దేశంలో వేల మంది మనస్తత్వ నిపుణులు, కౌన్సెలర్లు, మానసిక విద్యావేత్తలు, ఇతర నిపుణులకు పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు అందే అవకాశం లభించింది. ప్రవర్తనాపరమైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు (బిహేవియరల్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్)గా గుర్తింపు ఇవ్వడం ద్వారా వారి సేవలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
ఇటీవలి కాలంలో మనిషి దైనందిన జీవితంలో మానసిక సమస్యలు, ప్రవర్తనా పరమైన అసహజ మార్పులు అధికమవుతున్నాయి. బంధాలు, ఆత్మీయతల్లోనూ ప్రతికూల మార్పులు హెచ్చుతున్నాయి. వీటిని నియంత్రించడంలో బిహేవియరల్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ప్రవర్తన విశ్లేషణ, కౌన్సెలింగ్ వంటి వాటి ద్వారా మానసిక అనారోగ్య సమస్యలకు వీరు పరిష్కారం చూపుతారు. కొత్తగా పెళ్ళయిన వారిలో ఈ మధ్య కాలంలో అసహనం, అసహజ ప్రవర్తనలు చోటుచేసుకుంటున్నాయి. దాంపత్య జీవితం, జీవన శైలిపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. పెళ్ళికి ముందు, తరవాత ఇచ్చే కౌన్సెలింగ్ ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. పిల్లలకు కౌమార దశలోనే వ్యక్తిగత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలి. వారికి మంచి చెడులను, కష్ట సుఖాలను తెలియజెప్పాలి. ఆరోగ్య పరిరక్షణ, ఇతరులను గౌరవించడం వంటి వాటిపై అవగాహన కల్పించడమూ తప్పనిసరి. యుక్త వయసుకు వస్తున్న పిల్లలు శారీరకంగా, మానసికంగా తలెత్తే మార్పులపై అవగాహన కలిగి ఉండాలి. కాలం, ధన సద్వినియోగం, వ్యసనాలకు బానిసలు కావడం, విద్యార్థుల సమస్యలు, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం, కుటుంబ కలహాలు, ఒత్తిడి, నిద్రలేమి, వృద్ధుల్లో మానసిక అసమతుల్యతలు, అన్నింటికీమించి ఆత్మహత్యలు... ఇలా ఎన్నో సమస్యలు దేశంలో కోట్ల మందికి సవాలుగా మారాయి. స్కిజొఫ్రీనియా (మనోవైకల్యం), కుంగుబాటు(డిప్రెషన్) (Depression Symptoms) వంటి మానసిక సమస్యలు భారత్‌లో పెరుగుతున్నా బాధితులకు అందుతున్న వైద్య సేవలు అరకొరే. మనోవ్యాధి నిపుణులు, క్లినికల్ సైకాలజిస్టులు దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉండటం దీనికి ఒక కారణం. దీర్ఘకాలిక మానసిక సమస్యలను నివారించే ప్రత్యేక నిపుణుల సంఖ్యా స్వల్పంగానే కనిపిస్తుంది.
ప్రవర్తనాపరమైన మానసిక సమస్యలకు కౌన్సెలింగ్, సలహాలు అందించేందుకు కౌన్సెలింగ్ సైకాలజిస్టులు, కౌన్సెలర్లు, మనోవిజ్ఞాననిపుణులు పెద్దయెత్తున అవసరం. నూతన చట్టం ద్వారా ఆ కొరత తీరే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన నిపుణులు పెరిగితే పిల్లల నుంచి వృద్ధుల వరకు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎంతో మందికి మేలు జరుగుతుంది. మనిషి దురలవాట్లకు, మానసిక అసమతుల్యతలకు బలి కాకుండా సరైన పరిష్కారం లభిస్తుంది. సరైన కౌన్సెలింగ్‌తో భవిష్యత్ తరాలకు మానవతా విలువలు అలవడతాయి. మనిషి విచక్షణను కోల్పోకుండా, వికృత పోకడలకు గురికాకుండా ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలుస్తాడు. దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ మనమందరం కోరుకునే మానసిక ప్రశాంతత దక్కుతుంది. వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. చక్కని నిద్ర సొంతమవుతుంది. సరైన సమయంలో సక్రమమైన ప్రవర్తనా మార్పులకు సిద్ధపడటమంటే- అందమైన జీవితానికి చేరువైనట్టే.
- డాక్టర్ టీఎస్ రావు (కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ )
ఇదీ చూడండి: వ్యాయామం చేయాలా?.. ఇలా ప్రారంభించండి!