ఎన్డీఏకు అత్యంత విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగా పేరొందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) కూటమి నుంచి బయటికి వచ్చేసింది. కీలకమైన వ్యవసాయ బిల్లుల విషయంలో తమను సంప్రతించలేదనే కారణాన్ని అది చూపింది. తరవాత ఆ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర సైతం పడింది. వ్యవసాయ బిల్లుల పరిణామాల్లో తొలుత కేంద్ర ఆహారశుద్ధి మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసినా- పంజాబ్‌లో ఆందోళన బాట పట్టిన రైతులను ఆ నిర్ణయం అంతగా సంతృప్తి పరచలేకపోయింది. హర్‌సిమ్రత్ రాజీనామా వల్ల రైతుల ప్రయోజనాలకేమీ ఉపయోగం ఉండదంటూ పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. అకాలీదళ్ నిజంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లయితే ఎన్డీఏ కూటమి నుంచే బయటికి రావాలంటూ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్, ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు సవాలు విసిరారు. అకాలీల రాజకీయ వ్యవహారాల కమిటీ ఒక రోజంతా సంప్రతింపులు జరిపిన మీదట ఎన్డీఏ నుంచి వైదొలగుతున్నట్లు, భాజపాతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అలా- భాజపా అగ్రనేత ఏబీ వాజ్‌పేయీ, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ ఆధ్వర్యంలో 1997లో ఒక్కటైన ఇరుపార్టీల బంధం తెగిపోయింది.
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో ఆమోదం పొందిన ఎన్డీఏ... కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు సంబంధించి పంజాబ్ రైతుల్లో నెలకొన్న భావనను అర్థం చేసుకోలేకపోయిందనిపిస్తోంది. పంజాబ్‌లో మంచి పంట దిగుబడి వస్తే రాజకీయ ఫలాలూ సిద్ధిస్తాయి. ఎన్నికల ఫలితాలకూ చక్కటి పంట ఉత్పత్తులకూ అక్కడ ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆ రాష్ట్రంలో మంచి గరిష్ఠ మద్దతు ధర అందించే అధికార పార్టీకి రైతులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తారు. దేశంలోనే అద్భుతమైన మండీ వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. అక్కడ గ్రామీణ రహదారులు నేరుగా మార్కెట్‌కు అనుసంధానమై ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన పనులు 1939లో అవిభాజ్య పంజాబ్‌లోనే మొదలయ్యాయి. సర్ చోటూరామ్ అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడే ‘ఏపీఎంసీ’ చట్టం ఆమోదం పొందింది. ఫలితంగా మార్కెట్ కమిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కనీస మద్దతు ధర భావన పంజాబ్‌కు కొత్తేమీ కాదు. 1966-67లోనే తొలిసారిగా గోధుమలకు క్వింటాకు రూ.54 కనీస మద్దతు ధర నిర్ణయించగా, ఆ తరవాతి ఏడాదిలోనే అది రూ.70కి పెరిగింది.
పంజాబ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరగనున్నాయి. అకాలీదళ్ రైతుల మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోంది. కనీస మద్దతు ధరను తొలగించాలనే యోచనపై (ఎంఎస్‌పీని తొలగించాలనే యోచనేదీ లేదని కేంద్రం చెబుతోంది) రైతులు గుర్రుగా ఉన్నారు. పంజాబ్‌లో 65 శాతం జనాభా ప్రత్యక్షంగా వ్యవసాయ కార్యకలాపాలతో సంబంధాల్ని కలిగి ఉంటారు. వారి ప్రయోజనాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ మనలేరు. కేవలం రైతులను బుజ్జగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్ల విలువైన విద్యుత్ సబ్సిడీని అందిస్తోంది. ఈ అంశం రాజకీయంగా చాలా సున్నితమైనది కావడంతో ఇప్పటికిప్పుడు ఉచిత విద్యుత్తును ఉపసంహరించేందుకు ఏ రాజకీయ పార్టీ సాహసించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలూ ఆందోళనకు దిగడాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్‌పీ ఉపసంహరణ, 'ఏపీఎంసీ'ని పూర్తిగా తొలగించడం వంటి అంశాల్లో భాజపా తమ సలహాలు పట్టించుకోలేదని అకాలీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ ఆర్డినెన్స్‌లపై తనను సంప్రతించలేదని హర్‌సిమ్రత్ స్పష్టం చేశారు.
గతంలో భాజపా మెరుగైన ప్రదర్శన చేసినప్పుడల్లా... అకాలీలు అధికారానికి చేరువయ్యారు. మునిగినా, తేలినా కలిసే సాగారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌ఏడీ కేవలం 15 సీట్లు మాత్రమే సాధించి మట్టికరిచింది. సంకీర్ణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, మాదకద్రవ్యాల కారణంగా సంభవించిన మరణాలతో పదేళ్ల అకాలీ ప్రభుత్వం ఓటమి చవిచూసింది. పంజాబ్‌లో మాదకద్రవ్యాల ముఠాలకు అండగా నిలిచారన్న ఆరోపణల్నీ అకాలీ నేతలు ఎదుర్కొన్నారు. దీనిపై ఈడీ సైతం దర్యాప్తు జరిపింది. దర్యాప్తు తరవాత ఆరోపణల నుంచి విముక్తి పొందినా పేరు ప్రతిష్ఠలు మాత్రం దెబ్బతిన్నాయి. 2015 అక్టోబర్‌లో సిక్కు భక్తులపై జరిగిన కాల్పుల ఘటన అకాలీల ప్రతిష్ఠను దెబ్బతీసింది. తదనంతరం తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ క్షీణత మొదలైందని రాజకీయ పరిశీలకుల భావన. ప్రముఖ పాంథిక్ నేతలు అకాలీదళ్ నుంచి దూరం జరిగి, బాదల్ కుటుంబాన్ని నేరుగా సవాలు చేస్తూ, కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. అతివాద ‘పాంథిక్’ నేతల పట్టుపెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో అకాలీ నేతలకు ఆదరణ తగ్గడం మొదలైంది. 65 సీట్లుండే మాల్వా బెల్ట్‌లో ఆమ్‌ఆద్మీపార్టీ చేతిలో అకాలీ దారుణంగా దెబ్బతింది. పాంథిక్ నేతలను ఏకతాటిపై నిలపడంలో ప్రవాస సిక్కులదీ కీలకపాత్రే. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)పై అకాలీదళ్ పట్టు కొనసాగించడాన్ని వారు వ్యతిరేకించారు. కష్టాల్లో ఉన్నప్పుడల్లా అకాలీదళ్ గురుద్వారా రాజకీయాల్ని ఆశ్రయిస్తుందనే విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో... రైతులే కీలకంగా నిలిచే పంజాబ్ రాజకీయాల్లో ఎన్డీయేతో కలిసి సాగడం అకాలీలకు దాదాపు అసాధ్యమైన విషయంగా చెబుతున్నారు. ఎన్డీయే నుంచి బయటికి వచ్చినంత మాత్రాన అకాలీలు పూర్వవైభవం సాధిస్తారని కచ్చితంగా చెప్పలేం. అలాగని వారి అదృష్టం మారబోదని చెప్పడమూ కష్టమే!
- బ్రజ్ మోహన్ సింగ్