'దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావ ప్రకటన స్వేచ్ఛకు గొడుగుపట్టాలి... దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని, చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి'- అంటూ 36 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాజ్యాంగ స్ఫూర్తి పరిమళిస్తోంది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చెయ్యడాన్నే మహాపరాధంగా పరిగణించి కోర్టు ధిక్కరణ నేరం కింద సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌కు శిక్ష విధించిన సుప్రీంకోర్టు- స్వయం ప్రవచిత ఆదర్శానికే చెల్లు కొట్టింది. సహేతుక విమర్శకు, ఒక వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకోవడానికి మధ్య తేడా ఉందన్న 'సుప్రీం' వ్యాఖ్య నూరుపాళ్లు నిజం. 'విమర్శనాత్మక ట్వీట్లకే కదలబారిపోయేటంత బలహీనమైనదా న్యాయపాలిక ప్రతిష్ఠ?' అన్నదే ఆలోచనాపరుల్ని కలచివేస్తున్న సందేహం.
సహేతుక ఆంక్షలతో..
'విమర్శల పీక నులమడం ద్వారా కోర్టులపై విశ్వాసాన్ని కలిగించలేము' అని ఏనాడో 1952నాటి కేసులో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరించింది. న్యాయపాలన, కోర్టుల గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఒకవైపు- 'సహేతుక ఆంక్షలతోనైనా' భారత రాజ్యాంగం భరోసా ఇస్తున్న ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్య్రానికి బేషరతుగా మన్నన దక్కడం మరోవైపు- వీటి నడుమ సమతూక సాధనలో న్యాయస్థానాలు విశాల హృదయంతో స్పందించడం కచ్చితంగా వాటి ఘనతను, గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. 1978నాటి కేసులో జస్టిస్ కృష్ణయ్యర్- ఏనుగులు పోతుంటే కుక్కలు మొరిగినట్లుగా ఆ విమర్శల్ని తాము పట్టించుకోవడం లేదంటూ చీటికి మాటికి ఇలాంటి చీకాకులకు న్యాయపాలిక స్పందించబోదని తీర్పు ఇచ్చారు. ముల్గావోంకర్ సూత్రాలుగా ప్రతీతమైన ఆ మహితోక్తులే న్యాయపాలికకు దారిదీపం కావాలిప్పుడు!
న్యాయపాలన సజావుగా సాగాలనే..
మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుల జమానాలోనే 1926లో కోర్టుల ధిక్కరణ చట్టం అమలులోకి వచ్చింది. 1949లో భారత రాజ్యాంగంలోనూ దానికి చోటు పెట్టిన సందర్భంలో వాక్ స్వాతంత్య్రం గతి ఏమవుతుందన్న చర్చ రాజ్యాంగ నిర్ణయ సభలో జరిగింది. బాధితులుగా ప్రాసిక్యూటర్లుగా జడ్జీలే ఉన్నప్పుడు ధిక్కరణచట్టాలు దుర్వినియోగమై వాక్ స్వాతంత్య్ర హక్కుకు ముప్పు ఏర్పడుతుందన్న చర్చ జరిగినా- న్యాయపాలన సజావుగా సాగాలన్న సమున్నత ఆదర్శానికే మన్నన దక్కింది. కోర్టు ధిక్కరణ అధికారాలను వాటి విధివిధానాలను నిర్దేశిస్తూ 1971లో కొత్త చట్టం తెచ్చినా, కోర్టు ధిక్కార కేసుల్లో ప్రతివాదులకు 'సత్యం' రక్షాకవచమవుతుందంటూ చట్టాన్ని సవరించినా-భావ ప్రకటన స్వేచ్ఛకు గండి పడుతూనే ఉంది. కోర్టు ధిక్కారం పేరిట కొరడా ఝళిపించి సహేతుక విమర్శల నోరు నొక్కేయకూడదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రకటించిన జస్టిస్‌ఏఎస్ ఆనంద్- సార్వజనిక సంస్థల(పబ్లిక్‌ఆఫీస్) బాధ్యతలు నిర్వర్తించే వారెవరైనా ప్రజలకే జవాబుదారీ కావాలని సూచించారు.
కోర్టుల గౌరవాన్ని పెంచేదదే..
ఆ తరహా సూచనలకు మన్నన దక్కక పోబట్టే- భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు విధిస్తున్న రాజ్యాంగంలోని 19(2) అధికరణను సవరించాలని రాజ్యాంగ సమీక్షా సంఘమే సిఫార్సు చేసింది. దురుద్దేశాలకు తావు లేకుండా విమర్శించే హక్కును సహేతుకంగా వినియోగించుకోవడమే ప్రతివాది ఉద్దేశమైతే అతగాడికి కోర్డు ధిక్కరణ దోషం అంటదని 1992లోనే ఆస్ట్రేలియా కోర్టు తీర్పు ఇచ్చింది. వాక్ స్వాతంత్య్రానికి అవరోధంగా ఉందంటూ ధిక్కరణ చట్టాన్ని బ్రిటన్ 2013లో రద్దు చేసింది. 2016లో బ్రెగ్జిట్‌పై తీర్పు ఇచ్చిన ముగ్గురు జడ్జీల్ని 'ప్రజలకు శత్రువులు'గా డెయిలీ మెయిల్ విమర్శించినా- దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించకపోవడంలోనే న్యాయపాలిక పరిణతి గుబాళించింది. న్యాయపాలనకు ముప్పు ఏర్పడినప్పుడే కొరడా ఝళిపించగలిగే ఆ తరహా పరిణతి కోర్టుల గౌరవాన్ని పెంచుతుంది!
ఇదీ చదవండి: మళ్లీ అదే కథ.. చొరబాటుకు చైనా విఫలయత్నం!