కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒనగూడే ప్రయోజనాలపై వాటిని అమలు చేయాల్సిన రాష్ట్రాలకు, అధికారులకే స్పష్టత కరవైంది. కేరళ, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే వీటిని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాల అమలుపై గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. చట్టాలకు పార్లమెంటు ఆమోదం తెలిపినందువల్ల, తమను ఎవరూ ప్రశ్నించలేరనే ధీమాతో వ్యాపారులు కొత్త చట్టాల ప్రకారమే పంటలు కొంటూ- రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కెట్ రుసుం చెల్లించడం మానేశారు. దేశంలో ఇప్పటికే 7,500కు పైగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలోనే అంతంతమాత్రంగా ధరలు చెల్లించి పంటలు కొంటున్న వ్యాపారులకు కొత్త చట్టాలు మరింత బలాన్ని చేకూర్చాయి. మార్కెట్లతో సంబంధం లేకుండా బయటే ఎక్కడైనా ఎంతయినా పంటలు స్వేచ్ఛగా కొనే అవకాశం వారికి ఈ చట్టాలద్వారా లభించినట్లయింది.
మద్దతు ధర దక్కేదెలా?
దేశంలో మద్దతు ధరకు ప్రభుత్వాల కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో 189 వ్యవసాయ మార్కెట్లు ఉన్నా- వాటి బయట వ్యాపారులు కొంటున్న పంటలే 70శాతం వరకు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో గత అయిదేళ్లలో ఒక పంటకు ఎంత దిగుబడి వచ్చిందనే లెక్కలు చూపి అందులో నాలుగో వంతు (25శాతం) మాత్రమే ప్రస్తుత సీజన్‌లో మద్దతు ధరకు కొంటామనే షరతును కేంద్రం పెట్టింది. దీనివల్ల పంటలకు మద్దతు ధర రైతులకు అందడం లేదని తెలంగాణ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తోంది. రేషన్‌కార్డులపై ప్రజలకు అమ్మడం లేదనే సాకుతో మొక్కజొన్నను కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పడంతో రాష్ట్రాలే సొంత డబ్బుతో కొనాలి. ఇలా కొన్నందుకు గత మూడేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది. నెల క్రితమూ ఈ పంటకు ధరల్లేక నష్టపోతున్నామని రైతులు ధర్నాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని పరిమితంగా పంట కొనుగోలుకు ఈ సీజన్‌లో అనుమతించింది. కానీ, అప్పటికే చాలా దిగుబడులను వ్యాపారులు క్వింటాకు ఆరేడు వందల రూపాయలు తక్కువిచ్చి కొనడంతో రైతులు నష్టపోయారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై రైతుల బతుకు పోరాటం
అమెరికాలో పండే మొక్కజొన్న మూడోవంతు పంటను ఇథనాల్ తయారీకి మళ్ళించడం వల్ల రైతుల పంటకు అధిక ధర వస్తోంది. భారత్‌లో మొక్కజొన్న పంట దిగుబడి వృద్ధిరేటు 2000-19 మధ్యకాలంలో ఆరు శాతం నుంచి 3.6శాతానికి పడిపోయినా కనీస మద్దతు ధర సైతం రైతులకు దక్కడం లేదు. 2018-19లో 11.65 కోట్ల టన్నుల బియ్యం దిగుబడి వస్తే కేంద్రం 5.20 కోట్ల టన్నులు మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దేశంలో వరి సాగుచేసిన రైతుల్లో 12శాతం ప్రభుత్వాలకు మద్దతు ధరకు అమ్ముకున్నారని 'భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్' (సీఏసీపీ) తాజా నివేదికలో స్పష్టంచేసింది. వరి సాగు అధికంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో కేవలం 3.6, పశ్చిమ్ బంగలో 7.3శాతం వరి రైతులే మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్మారు. పంజాబ్ రాష్ట్ర వరి రైతుల్లో 95శాతం, హరియాణాలో 69.9శాతం ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్మారు. కొత్త చట్టాలతో ఇలా అమ్ముకునే అవకాశం పోతుందనే భయంతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టం అమలులోకి వచ్చిన తరవాత గత ఆగస్టు నుంచి 2020 డిసెంబరు 21 నాటికి 4.15 కోట్ల టన్నుల వరి ధాన్యం మద్దతు ధరకు కొంటే- అందులో 2.02 కోట్ల టన్నులు పంజాబ్‌లోనే ప్రభుత్వం కొన్నది. గత రెండేళ్ల(2018-20)లో 7.30 కోట్ల టన్నుల గోధుమలను ప్రభుత్వాలు మద్దతు ధరకు కొంటే ఇందులో 85శాతం (6.19 కోట్ల టన్నులు) పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రైతులవే. ఈ గణాంకాలు- మద్దతు ధరకు పంటల కొనుగోలులో అన్ని రాష్ట్రాలకూ సమ ప్రాధాన్యం దక్కడం లేదని చాటుతున్నాయి.
వెంటాడుతున్న భయం
గత ఏడాది భారత స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం, మత్స్య రంగాల వాటా రూ.20 లక్షల కోట్లని అంచనా. నిత్యావసర ఆహారోత్పత్తుల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి అర్ధభాగం (ఏప్రిల్-సెప్టెంబరు)లో 43శాతం పెరిగి రూ.53,626 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలవ్యవధితో పోలిస్తే ఏకంగా రూ.16,235 కోట్ల ఎగుమతులు అదనంగా పెరిగాయి. కరోనా సంక్షోభంలో ఇంతటి భారీ పెరుగుదల ద్వారా దేశానికి ఆదాయాన్ని సమకూర్చింది వ్యవసాయ రంగమే. ఇంతలా ఆదాయం ఇస్తున్నందువల్ల పలు అభివృద్ధి చెందిన దేశాల బహుళ జాతి కంపెనీలు, వ్యాపార వర్గాలు ఆసక్తి పెంచుకున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలతో కంపెనీలు ఒప్పంద వ్యవసాయం ద్వారా పంటలు, రైతులపై పట్టు సాధిస్తాయనే భయం వెంటాడుతోంది. ఒప్పంద సేద్యం పేరుతో కంపెనీలు, వ్యాపారులు పంటల సాగుకు రైతులతో ఒప్పందాలు చేసుకుంటే వారి పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనూ అమ్ముకునే స్వేచ్ఛ వారికి ఉండదు. అప్పుడిక పంటలు కొనే భారం ప్రభుత్వాలకు తగ్గుతుంది.
ఇదీ చదవండి: సాగు చట్టాల ఉపసంహరణే ఉత్తమం
ఏటా మద్దతు ధరకు కొనుగోలు వ్యవహారం రైతులకు, ప్రభుత్వాలకు మధ్య నిరసనలకు దారి తీస్తున్నందువల్ల దీనికి ముగింపు పలికే రీతిలో కొత్త చట్టాలు ఉన్నాయనే విమర్శలో కొంత నిజం లేకపోలేదు. మద్దతు ధరకు పంటలు కొనడానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధులేమీ కేటాయించకుండా పొద్దుప్పుచ్చే విధానాలు మారాలి. పాత చట్టాలు ఉన్నప్పుడు సైతం 50శాతానికి మించి మద్దతు ధరకు ప్రభుత్వాలు కొనలేదు. కొత్త చట్టాలు తెచ్చేటప్పుడు ఆ శాతాన్ని పెంచి రైతులకు భరోసా కల్పించకపోగా, మద్దతు ధరకు సరైన పూచీ ఇవ్వకుండా ఆమోదించడం సరికాదు. వ్యవసాయ మార్కెట్లను పటిష్ఠం చేయాలి. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం, ఆ గడువు సమీపిస్తున్న తరుణంలో అసలు ఆదాయంపై వారికి పూచీ ఇవ్వని చట్టాలు తేవడం సరికాదు!
కొనుగోళ్లలో 'కూటమి' ప్రభావం
దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ ఉన్నా పంటలకు మద్దతు ధరలు రాక రైతులు నష్టపోతున్నారు. లక్షా 30 వేలకు పైగా లైసెన్సులు కలిగిన వ్యాపారులున్న వ్యవసాయ మార్కెట్లలోనే వారు సిండికేట్‌గా మారి ధరలు తెగ్గోస్తూ రైతులను నష్టపరుస్తున్న ఉదాహరణలు అనేకం. ఇక మార్కెట్లున్నా వాటితో పని లేదంటూ ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది. మద్దతు ధరకు పంటలను ప్రభుత్వం కొంటుందా, కొనకపోతే మార్కెట్ల బయట కొనే వ్యాపారులు ఆ స్థాయి ధరలు చెల్లిస్తారా అన్నదానిపై కొత్త చట్టాల్లో స్పష్టత లేకపోవడం సమస్యగా మారింది.
-మంగమూరి శ్రీనివాస్