ETV Bharat / opinion

ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!

అమెరికా, చైనాలు.. ఖగోళాన్ని తమ ఆర్థిక మండలంగా ప్రకటించుకున్నాయి. దీంతో వీటి మధ్య ఆధిపత్య పోరు భూమి నుంచి అంతరిక్షానికి చేరుకుంది. అమెరికా, చైనాల స్థాయిలో కాకపోయినా భారతదేశం కూడా తనదైన శైలిలో కుజచంద్ర గ్రహ యాత్రలు చేపడుతోంది. భూమి-చంద్రుల మధ్య ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటించాలని చూస్తున్న చైనా, తన లక్ష్య సాధన కోసం ఇప్పటికే ఓ రాకెట్‌ను ప్రయోగించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో జోరుగా అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టడానికి అమెరికా సిద్ధమవుతోంది. మరి ఈ పోరులో విజయం ఎవరిది?

War between countries continues on space mineral excavation
ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!
author img

By

Published : Sep 24, 2020, 7:19 AM IST

అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోటీ భూమి నుంచి అంతరిక్షంలోని చంద్ర, కుజ గ్రహాలకు విస్తరిస్తోంది. ఈ రెండు దేశాలు ఖగోళాన్ని తమ ఆర్థిక మండలంగా ప్రకటించుకోవడం ప్రపంచ దేశాలకు కొత్త డోలాయమాన స్థితిని తెచ్చిపెడుతోంది. అమెరికా, చైనాల స్థాయిలో కాకపోయినా భారతదేశం కూడా తనదైన శైలిలో కుజచంద్ర గ్రహ యాత్రలు చేపడుతోంది. గత ఏప్రిల్‌ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును, చైనా అంతరిక్ష లక్ష్యాలను చూస్తే- భారత్‌ తన అంతరిక్ష ప్రయోజనాలను పదిలపరచుకోవడానికి వేగంగా ముందుకు కదలాలని అవగతమవుతుంది. చందమామ నుంచి తాము ఖనిజ నిక్షేపాలను తవ్వితీస్తుంటే అభ్యంతరపెట్టేవారిని అమెరికా వ్యతిరేకిస్తుందని ట్రంప్‌ ఉత్తర్వు హెచ్చరిస్తోంది. ఇంతకీ చంద్రుడి నుంచో, కుజుడి నుంచో, మరేదైనా గ్రహశకలాల నుంచో ఖనిజాల కోసం తవ్వకాలను ఎవరైనా ఎందుకు వ్యతిరేకిస్తారు? దీనికి సమాధానం కోసం 1979లో ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం ఆధ్వర్యంలో కుదిరిన చందమామ ఒప్పందంలో వెతకాలి. భారత్‌, ఫ్రాన్స్‌, పాకిస్థాన్‌ లతోపాటు మొత్తం 18 దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌ వంటి ప్రధాన దేశాలు మాత్రం ఆమోదించలేదు. భారత్‌ కూడా సంతకం చేసిందే గాని, సాధికారికంగా ఆమోదించలేదు. ట్రంప్‌ ఉత్తర్వు చూపిన బాటలో భారత్‌ సైతం లాంఛనంగా 1979 చందమామ ఒప్పందం నుంచి నిష్క్రమించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం చంద్రుడిపై సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకూడదు, అక్కడ మానవ కార్యకలాపాలు శాంతియుత ప్రయోజనాలకు దోహదం చేసేవిగా ఉండాలి. ఈ ఒప్పందాన్ని శిరసా వహిస్తే, చంద్రుడి నుంచి వెలికితీసే వనరులను సమస్త మానవాళితో పంచుకోవలసి ఉంటుంది. దానిపై సంతకం చేయని దేశాలకు అటువంటి బాధ్యత ఉండదు. అందుకే చంద్రుడు, మరి ఇతర ఖగోళ భాగాల నుంచి వాణిజ్య ప్రాతిపదికపై వనరులను వెలికితీసి వినియోగించడంపైన, ఈ కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంపైన నెలకొని ఉన్న అనిశ్చితిని తొలగించాల్సి ఉందని ట్రంప్‌ ఉత్తరర్వు పేర్కొంటోంది. 1979 ఒప్పందం ఇందుకు దోహదం చేయడం లేదనీ వాదించింది. చైనా ఈ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని తమకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అమెరికన్లు అనుమానిస్తున్నారు. అందుకే ఖగోళ వనరుల వినియోగంపై ఎటువంటి అభ్యంతరాలను లెక్కచేసేది లేదని ట్రంప్‌ ఉత్తర్వు స్పష్టం చేస్తోంది.

'బీజింగ్‌ అజెండా'పై చర్చ

చైనా తన సొంత అంతరిక్ష అజెండాతో ముందుకువెళుతోంది. చంద్రుడి పైకి వ్యోమగాములను తీసుకెళ్లే ఫ్లెక్సిబుల్‌ ఇన్‌ ఫ్లేటబుల్‌ కార్గో రీఎంట్రీ వెహికల్‌ (ఎఫ్‌.ఐ.సి.ఆర్‌.వి.)ని భారీ లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ పై ఇటీవల ప్రయోగించింది. భూమి-చంద్రుల మధ్య ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటించాలని చూస్తున్న చైనా, తన లక్ష్య సాధన కోసం ఈ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష సేవలు, పారిశ్రామికోత్పత్తి, అంతరిక్ష ఖనిజ వనరుల వినియోగం ద్వారా 10 లక్షల కోట్ల డాలర్లు ఆర్జించడానికి చైనా ఈ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటించబోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా ఆర్టెమిస్‌ ఒప్పందాన్ని ముందుకుతెచ్చింది. పౌర ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణకు, ఖగోళ వనరుల వినియోగానికి ఉమ్మడి సూత్రాలను రూపొందించాలని ఆర్టెమిస్‌ లక్షిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ 1979 చందమామ ఒప్పందం నుంచి వైదొలగి ఆర్టెమిస్‌ ఒప్పందంలో భాగస్వామి కావాలని కొందరు నిపుణులు బలంగా ప్రతిపాదిస్తున్నారు. ఈ సూచనను భారత ప్రభుత్వం లోతుగా పరిశీలించబోతోంది. చంద్రయాన్‌, మంగళ్‌ యాన్‌, గగన్‌ యాన్‌ ప్రణాళికలతో భారత్‌ అంతరిక్షంలో తన ఉనికిని బలంగా చాటుకొంటున్న సంగతిని ఇక్కడ గమనించాలి. చైనాకు దీటుగా భారత్‌ రోదసిలో దూసుకెళ్లడానికి అమెరికా సహకారం అవసరపడుతుంది.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో జోరుగా అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం అమెరికా వైమానిక-అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భారీ రాకెట్లను సిద్ధం చేస్తోంది. ప్రైవేటు రంగంలో స్పేస్‌ ఎక్స్‌, అమెజాన్‌, బోయింగ్‌, లాక్‌ హీడ్‌ సంస్థలు సొంత అంతరిక్ష రాకెట్లను, వాహనాలను రూపొందిస్తున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ ఇప్పటికే పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసింది. అమెరికన్‌ ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష కేంద్రాల నిర్మాణంతోపాటు, భూమి నుంచి వ్యోమగాములను, సాధన సంపత్తిని రవాణా చేయడానికి, ప్రభుత్వం తరఫున అంతరిక్ష గుత్తేదారులు పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. సహజంగానే అమెరికా పథకాలను చైనా ఖండిస్తోంది. అమెరికా ఆర్టెమిస్‌ ఒప్పందాన్ని ప్రకటించిన రోజునే చైనా ఎఫ్‌.ఐ.సి.ఆర్‌.వి. వాహనాన్ని ప్రయోగించడం గమనార్హం. 2050కల్లా భూమి-చంద్ర ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేయాలని చైనా సంకల్పిస్తోంది. ప్రభుత్వ సంస్థ అయిన చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌కు ఈ మండల బాధ్యతను అప్పగించింది. ఈ విధంగా అమెరికా, చైనాలు రోదసిలో పోటీపడుతూ, ఇతర దేశాలను తమ పరిధిలోకి ఆకర్షించాలని చూస్తున్నాయి.

స్వశక్తితో భారత్‌ ముందుకు...

అమెరికా, రష్యా, చైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ), భారత్‌, జపాన్‌ లతో పాటు తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా రోదసి యాత్రలు చేపట్టింది. గ్రహశకలాలపై ఖనిజ తవ్వకాలకు జపాన్‌, అమెరికా వ్యోమ నౌకలను పంపాయి. 1999 నుంచి అంతరిక్ష అన్వేషణ చేపట్టిన భారత్‌, దీర్ఘకాలంపాటు రోదసిలో వ్యోమగాముల నివాసానికి, చంద్ర వనరుల వెలికితీతకు ఏర్పాట్లు చేయనున్నది. చంద్రయాన్‌ యాత్రల తరవాత 2021లో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అంతరిక్ష నౌకను దింపడానికి నడుం కట్టింది. 2022లో గగన్‌యాన్‌ పేరిట వ్యోమగాములను భూకక్ష్యలోకి పంపబోతోంది. 2030కల్లా స్పేస్‌ షటిల్‌ లా భూమి చుట్టూ పరిభ్రమించే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. 1979 చందమామ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల్లో కేవలం భారత్‌, ఫ్రాన్స్‌ మాత్రమే గ్రహ యాత్రలు చేపట్టే సత్తాను, అంతరిక్షంలోకి మానవులను పంపే సామర్థ్యాన్ని సాధించగలిగాయి. ఫ్రాన్స్‌ చందమామ ఒప్పందం నుంచి వైదొలగి అమెరికా నాయకత్వంలోని ఆర్టెమిస్‌ ఒప్పందంలో భాగస్వామి కావడానికి సుముఖత కనబరచింది. జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడాలూ అదే బాటలో ఉన్నాయి. భారతదేశం చాలాకాలం నుంచి రష్యా, అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌లతో అంతరిక్ష సహకారం నెరపుతూనే సొంతంగా అంతరిక్ష శక్తిగా ఎదుగుతోంది. త్వరలో అమెరికా, చైనాల తరవాత మూడో ప్రధాన ఆర్థిక శక్తిగా నిలవబోతున్న భారత్‌- ఆర్టెమిస్‌ ఒప్పంద దేశాలతో చేతులు కలుపుతూనే, స్వతంత్రంగా అంతరిక్ష అన్వేషణ, ఖనిజ వనరుల వినియోగానికి ముందుకు కదలాలి.

అదే సమయంలో అమెరికా, చైనాల మధ్య రగులుతున్న అంతరిక్ష పోటీని గుర్తెరిగి అడుగులు వేయాలి. కరోనా కల్లోలానికి చైనాయే కారణమని దుయ్యబడుతున్న అమెరికా- బీజింగ్‌ నుంచి రోదసిలో ఎదురుకాగల సైనిక ముప్పును దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష సేనను ఏర్పాటు చేసింది. చైనా, రష్యాలు అంతరిక్షాన్ని ఆయుధీకరించాయంటూ, గత జూన్‌లో అంతరిక్ష రక్షణ వ్యూహాన్ని అమెరికా ప్రకటించింది. భూకక్ష్యలోని ఉపగ్రహాలను పేల్చివేసే రాకెట్‌ను చైనా ప్రయోగించడం దాని ఉద్దేశాలను బయటపెడుతోంది. భారత్‌ కూడా అటువంటి రాకెట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఆంతరిక్షానికి ఆర్థిక, సైనిక ప్రాధాన్యం ఉందని గ్రహించి తాను కూడా సంబంధిత సామర్థ్యాలను సంతరించుకొంటోంది.

- కైజర్‌ అడపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.