ETV Bharat / opinion

టీకా ఉత్పత్తిలో చిన్న దేశాల ముందడుగు

టీకాల ద్వారా అడ్డగోలుగా లాభాలు పొందాలని చూస్తున్న సంపన్న దేశాలు.. వర్ధమాన దేశాలకు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. తాము తయారు చేసిన టీకాలే విశ్వసనీయమైనవిగా ప్రచారం చేస్తున్నాయి. తమ టీకాలు తీసుకున్నవారికే గ్రీన్ పాసులు జారీ చేస్తూ.. ఇతర దేశాలకు మోకాలడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకాలు సొంతంగా తయారు చేసుకోవడమే మేలని భావించిన క్యూబా సహా పలు దేశాలు.. ఆ దిశగా ముందడుగు వేస్తున్నాయి.

కరోనా టీకా
Vaccination
author img

By

Published : Jul 8, 2021, 7:28 AM IST

కొవిడ్‌ పంజా దెబ్బకు విలవిలలాడుతున్న పేద దేశాల గోడును పట్టించుకోకుండా సంపన్న దేశాలు తమ బాగును తామే చూసుకుంటున్నాయి. యావత్‌ ఆఫ్రికా ఖండ జనాభాలో కొవిడ్‌ టీకాలు అందినవారు ఒక్క శాతంకన్నా తక్కువే అయినా సంపన్న దేశాలు తమ ఫార్మా కంపెనీల లాభాలే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇతర దేశాలకు తమ టీకాలు అందించాలంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలంటున్నాయి. తాము తయారు చేసిన అతి ఖరీదైన టీకాలు మాత్రమే సమర్థమైనవని, ఇతరుల టీకాలు బొత్తిగా వ్యర్థమని చెబుతున్నాయి. రష్యా, చైనాలు తయారు చేసిన కొవిడ్‌ టీకాలకు ఈ కారణంతోనే అమెరికా, ఐరోపా దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) టీకాలు వేసుకున్న వారికి మాత్రమే తమ దేశంలో ప్రవేశించడానికి గ్రీన్‌ పాస్‌ వీసాలు ఇస్తామని అమెరికా స్పష్టం చేస్తోంది. ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆస్ట్రాజెనెకాకు మొదట్లో వంకలు పెట్టినా తరవాత పంథా మార్చుకుని ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్నవారికి మాత్రమే గ్రీన్‌ పాస్‌లు మంజూరు చేస్తోంది. భారత ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం చెప్పిన మీదట కొవిషీల్డ్‌ (ఆస్ట్రాజెనెకా) టీకాకు తొమ్మిది ఐరోపా దేశాలు ఆమోదముద్ర వేశాయి. ఐరోపాలో ఒక్క ఎస్తోనియా దేశం మాత్రమే కొవాక్సిన్‌ టీకాలు వేసుకున్న వారికి గ్రీన్‌ పాస్‌ ఇస్తోంది. భారత్‌ సొంతంగా తయారు చేసిన కొవాక్సిన్‌కు అత్యవసర ప్రాతిపదికపై అనుమతి ఇవ్వడానికి అమెరికా నిరాకరించినా, పూర్తిస్థాయి ప్రయోగాలు ముగిశాక అనుమతి మంజూరు చేస్తామని పేర్కొంది. కొవాక్సిన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కోసం నిరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.

క్యూబా ఖ్యాతి

సంపన్న దేశాలు టీకా జాతీయవాదంతో, అమిత లాభాపేక్షతో వ్యాక్సిన్‌ అడ్డుగోడలు నిర్మిస్తున్నందువల్ల పలు వర్ధమాన దేశాలు సొంత వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. భారత్‌ మొత్తం నాలుగు సొంత టీకాలతో కొవిడ్‌పై సమరానికి సిద్ధమవుతోంది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాక్సిన్‌ ఇప్పటికే వినియోగంలోకి రాగా, రెండో టీకా జైకోవ్‌-డికి అత్యవసర అనుమతి లభిస్తే రెండు నెలలలోపే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. పుణేకి చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌ దేశంలోనే మొదటిసారిగా రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా క్లినికల్‌ ప్రయోగాలు జరుపుకొంటోంది. బయొలాజికల్‌ ఇ సంస్థ కోర్బివ్యాక్స్‌ టీకా ఆగస్టుకల్లా వినియోగంలోకి రావచ్చు. మరోవైపు అరవై ఏళ్లుగా అమెరికా ఆంక్షలతో చితికిపోయిన చిన్న దేశం క్యూబా స్వశక్తితో అయిదు టీకాలు రూపొందిస్తోంది. ప్రపంచ దేశాలకు కొవిడ్‌ టీకాలు అందించే కొవ్యాక్స్‌ కార్యక్రమంలో చేరకుండా, మిత్రదేశాలైన రష్యా, చైనా టీకాలపై ఆధారపడకుండా స్వావలంబన సాధించింది. తన టీకాల్లో ఒకదానికి సాబెరానా-2 (సార్వభౌమ) అని పేరు పెట్టి తన ఆత్మనిర్భరతను చాటుకొంది. సాబెరానాపై మూడో దశ ప్రయోగాలు ముగియకముందే మే నెల నుంచి సార్వజన టీకా కార్యక్రమం ప్రారంభించింది. దీనికన్నా ముందు క్యూబా రూపొందించిన అబ్దాలా- దేశ టీకా కార్యక్రమంలో ప్రధాన భాగంగా ఉంది. ప్రొటీన్‌ టీకా అయిన అబ్దాలా 92 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని క్యూబా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. క్యూబా.. దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదటి కొవిడ్‌ టీకాను తయారు చేసిన దేశంగా ఖ్యాతికెక్కింది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం జనాభాకు టీకాలు వేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ టీకాల కొనుగోలుకు ఇతర దేశాలూ ముందుకొస్తున్నాయి. క్యూబా విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు కొవిడ్‌ టీకాల రూపకల్పనలో చురుగ్గా పాల్గొనడం వల్లే సొంత టీకాలు రూపుదిద్దుకున్నాయి.

దక్షిణ అమెరికా ఖండంలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌ ఇప్పటికీ ఇతర దేశాల టీకాలపై ఆధారపడుతుంటే, చిన్న దేశం క్యూబా దీక్షాదక్షతలతో స్వావలంబన సాధించింది. బ్రెజిల్‌ కూడా ఇప్పుడు ఆత్మనిర్భరతపై దృష్టిపెట్టి బుటాన్‌ వ్యాక్‌ అనే స్వదేశీ టీకాను రూపొందిస్తోంది. విదేశీ ముడి పదార్థాలు లేకుండా పూర్తిగా స్వశక్తితో తయారయ్యే ఈ టీకాపై క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కోట్లాది డోసులు అందుబాటులోకి రావచ్చు. ఇరాన్‌ కూడా జాతీయవాదానికి అగ్ర ప్రాధాన్యమిచ్చే దేశం. ఇరానీ టీకా కోవ్‌ఇరాన్‌ బారాకాత్‌ ఇటీవలే అత్యవసర అనుమతి పొందింది. రెండో టీకా రజీ కోవ్‌ పార్స్‌ మీద ఆగస్టు నుంచి ప్రయోగాలు మొదలవుతాయి.

సరసమైన ధరలకే

క్యూబా, బ్రెజిల్‌, ఇరాన్‌ టీకాలు సరసమైన ధరలకు లభించడం- బడుగు దేశాల ప్రజలకు ఎంతో ఉపయుక్తం. సంపన్న దేశాలు ఎగుమతుల రూపంలోనో, విరాళాల రూపంలోనూ ఇచ్చే టీకాలు లబ్ధిదారులకు చేరడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికి వాటి ధర కూడా చాలా ఎక్కువ అవుతుంది. వర్ధమాన దేశాలన్నీ సొంత టీకాలు తయారు చేసుకోకపోయినా- అక్కడ టీకా ఉత్పత్తికి కర్మాగారాలు ఏర్పడితే తయారీ, రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లు అందించవచ్చు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా కంపెనీతో కలిసి అందిస్తున్న కొవిషీల్డ్‌ను భారత్‌లో తయారు చేయడం వల్ల ఇతర టీకాలకన్నా అది తక్కువ ధరకు లభిస్తోంది. కానీ, మొదట్లో కొవ్యాక్స్‌ ప్రాజెక్టుకు లక్షలాది కొవిషీల్డ్‌ డోసులు అందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ భారత్‌లో కరోనా విజృంభించిన తరవాత సరఫరాలను నిలిపేయవలసి వచ్చింది. ఇలాంటి అవాంతర పరిస్థితులను నివారించాలంటే ఇతర వర్ధమాన దేశాల్లోనూ టీకా ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పడం మంచిదనేది నిపుణుల సలహా. తదనుగుణంగా ఈజిప్ట్‌ ప్రభుత్వ సంస్థ వాక్సెరా త్వరలో చైనీస్‌ టీకా సైనోవ్యాక్‌ ఉత్పత్తిని ప్రారంభించనుంది. అమెరికా టీకా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ను దక్షిణాఫ్రికా ఉత్పత్తి చేస్తోంది. బెల్జియం రూపొందించిన కొవిడ్‌ టీకా ఉత్పత్తికి సెనెగల్‌లో కర్మాగారాలు నిర్మిస్తున్నారు. ఈ టీకా వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుంది. పేద దేశాల్లో ఉత్పత్తిదారులకు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను బదిలీ చేసి టీకా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాఫ్రికా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆఫ్రికా వ్యాధి నియంత్రణ కేంద్రాలతో కలిసి పని చేయనుంది. ఈ ప్రయత్నాలన్నీ పేద దేశాల్లో కొవిడ్‌ టీకాల కొరతను అధిగమించడానికి తోడ్పడతాయని ఆశిద్దాం.

- ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.