మంచికి రోజులు కావు. మంచితనానికీ విలువ లేదు. త్యాగాలను తెలుసుకోరు. మచ్చుకైనా మెచ్చుకోరు. ఇది వైరాగ్యం కాదు... వాస్తవం. అంత గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేసి, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి వైట్‌హౌస్‌లో బందీ అయ్యి, అమెరికా అగ్రస్థానాన్ని కాపాడాలని ఆయన కంకణం కట్టుకుని కష్టపడుతుంటే- కాదని ఇంటికి పంపేస్తానంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేల్లో తేల్చేస్తున్నారు.
తెలిసింది మాట్లాడితే తప్పుపడతారు. తెలియనిది అడిగితే అధ్యక్షుడికి ఇంత అజ్ఞానమా అంటారు. కరోనా దానంతటికి అదే కనుమరుగైపోతుంది... కంగారు పడకండీ అంటే విరుచుకుపడతారు. అప్పుడెప్పుడో స్పానిష్ ఫ్లూ, ప్లేగు వచ్చాయి. అవి ఇప్పుడు ఉన్నాయా... కనిపించకుండా పోలేదా? ఇదీ అంతే!
కాస్తయినా తర్కం ఉండాలి కదా. కాలమే కాసేపైనా నిలబడలేదు. అలాంటిది... కరోనా ఎంతకాలం ఇక్కడే తిష్ఠవేసుకొని కూర్చుంటుంది? ఏ మతమైనా ఏం చెబుతోంది- ఏదీ శాశ్వతం కాదనే కదా! ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఆందోళన పడినంత మాత్రాన వచ్చే ప్రమాదం ఆగుతుందా? కాస్తయినా ఓపిక పట్టాలి కదా!
కష్టకాలం కాకపోతే, ఎక్కడో పుట్టిన వైరస్ ఎగురుకుంటూ ఇంత దూరం రావడమేమిటి? కట్టడి కావడం లేదని అందరూ కోపగించుకొని అధ్యక్ష పదవికి ఎసరు పెట్టాలనుకోవడమేమిటి? అయినా ఆ కరోనా కల్లోలానికి చైనా మూలకారణమంటే చెవికెక్కించుకోరు. చేతకానితనం అంటూ చీవాట్లు పెడతారు. డ్రాగన్ చేతిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తోలుబొమ్మ అయ్యిందని, నిధులు ఆపేసి అందులో నుంచి నిష్క్రమిస్తే ఆడలేక మద్దెల ఓడు అంటారు!
కరోనాకు మందు లేదు. వ్యాక్సిన్ రాలేదు. త్వరలో అన్నీ రావచ్ఛు అప్పటివరకు అందరూ తోచిన పరిశోధనలు చేస్తుంటారు. అందుకే క్రిమినాశక రసాయనాలను రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని పరిశీలించవచ్చు కదా అని ఏదో తెలిసిందో, ఎవరో చెప్పిందో, ఎక్కడో విన్నదో చెబితే... తిట్టేస్తారా? అతి నీలలోహిత కిరణాలను చొప్పించి చూడమని సలహా ఇస్తే... పిచ్చెక్కిందా అంటారా? ఇష్టమైతే పాటించాలి. కాదంటే వదిలేయాలి. అంతేకానీ... అధ్యక్షుడనే గౌరవం లేకుండా అంతేసి మాటలు ఇష్టమొచ్చినట్లు అంటారా?
విడ్డూరం కాకపోతే- కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తే కేసులు పెద్దయెత్తున పెరిగిపోతున్నాయని భయపడతారు. పోనీ జనం బెంబేలెత్తుతున్నారు కదా టెస్టులు తగ్గిద్దామని అధికారులకు చెబితే... తిడతారు. కత్తికి రెండు వైపులా పదును అంటే ఇదే కాబోలు.
గత నాలుగేళ్లలో అమెరికా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందంటే అదోవిధంగా చూస్తారు. కరోనా వల్ల కర్మకాలి పడిపోయిన ఆదాయాలను కాస్తయినా పట్టాలెక్కించి ఓట్లు కొట్టేద్దామనుకుంటే దాన్నీ పడనీయరు. లాక్‌డౌన్లు కావాలంటారు. స్థానిక ఉద్యోగాలు అధికంగా అమెరికా యువతకే అందేలా చేస్తుంటే అడ్డుపడతారు. అదంతా నాటకమని కొట్టేస్తారు... నమ్మరు.
నల్లజాతీయుల శ్రేయం కోసం కృషి చేసినవారిలో అబ్రహాం లింకన్ తరవాత అంతటివాడినంటే వెర్రిచూపులు చూస్తారు. అంతులేని జాత్యహంకారి, అమెరికాకు అత్యంత ప్రమాదకారినని ఆరోపిస్తూ అన్న కూతురు తెలిసో తెలియకో రాసేస్తే- ఆమోదముద్ర వేసేస్తారు. గొడవలు జరిగిన ప్రతిసారీ వీసాల బాణం విసరుతున్నాడని విమర్శిస్తారు. పడిపోతున్న పాపులారిటీని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడని ఎగతాళి చేస్తారు.
అయినా ఆ చైనా కరోనా... కొంప ముంచేసింది. కొంతమందికి ఇష్టం లేకపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పేట్లు లేదు. అది ఒప్పుకొన్నా ఓర్చుకోలేకపోతున్నారు. ఇది ముందే కాడి దించేయడమేనని కొందరంటే, కాదు ప్రజల సానుభూతి కోసం వేసే కొత్త ఎత్తుగడని ఇంకొందరు ఎండగడతారు. ఏమన్నా తప్పుపడుతూ, ఎలా చేసినా ఎద్దేవా చేస్తుంటే ఊపిరాడక కాస్త సేదతీరుదామని గ్రౌండుకెళ్తే కరోనా కాలంలోనూ గోల్ఫ్ ఆడేస్తున్నాడంటూ ఆడిపోసుకుంటున్నారు.
మాస్క్ పెట్టుకోకపోతే మొండివాడంటారు. ఎక్కడ అవసరమో అక్కడ ముసుగు ఉండాలి కానీ, ఎప్పుడూ వేసుకుంటే అంత పెద్ద దేశానికి అధ్యక్షుడని ఎవరికి తెలుస్తుంది? మాస్క్ ధరించడమే దేశభక్తి అన్నారు. అందుకే దేశభక్తిలో మొదటి వ్యక్తిగా నిలబడుతూ మాస్క్ ధరించి దర్శనమిస్తే దారికొచ్చాడంటారు. కరోనా మెడలు వంచేస్తానన్న ధీరుడు ఎట్టకేలకు ముసుగు వీరుడయ్యాడని గేలిచేస్తారు.
గెలిచి చూపిస్తేకానీ- ఈ నోళ్లు మూతపడవు. ఏమో, సామాజిక దూరం నిబంధనలను గాలికొదిలి ఎన్నికల సభ పెట్టినా సగం జనం రాలేదు. నిశ్శబ్ద మెజారిటీ ఉందని దబాయించి పైకి చెబుతున్నా నమ్మకం కుదరడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికెళ్లిపోతే ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని ఇరాన్ ఎదురుచూస్తోంది. అరెస్ట్ వారెంట్ కూడా విడుదల చేసింది. అయినా ఓడిపోతే ఒప్పుకొనే ప్రసక్తే లేదు. గోల గోల చేయడం ఖాయం. ఏదీ కాదంటే శ్వేతజాతీయ భావోద్వేగ ట్రంప్ కార్డు ఉండనే ఉంది!
రచయిత - ఎమ్మెస్
ఇదీ చూడండి: అమెరికా కకావికలం- లక్షా 50 వేలు దాటిన మరణాలు