పర్యటక రంగం వల్ల ప్రపంచంలో ప్రతి పదిమందిలో ఒకరికి నేరుగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. భారత్‌లో 2019లో ఈ రంగం 4.2 కోట్లమందికి ఉపాధి కల్పించింది. ఇది దేశంలోని మొత్తం ఉద్యోగాలలో 8.1 శాతానికి సమానం. 2018లో ప్రయాణాలు, పర్యటక రంగం కలిసి భారత జీడీపీకి 9.2 శాతం వాటా అందించాయని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) లెక్కగట్టింది. ప్రపంచ జీడీపీకి కూడా 10 శాతం ఈ రంగం నుంచే లభిస్తోంది. 2019లో ప్రపంచ వాణిజ్యంలో ఏడు శాతం మేర ఈ రంగం ద్వారా జరిగింది. ఇంధనాలు, రసాయనాల తరవాత అత్యధిక ఎగుమతులు టూరిజం రంగం నుంచే నమోదవుతున్నాయి. ఇంతటి కీలక ఆర్థిక ప్రాధాన్యమున్న పర్యటకం కొవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో పడింది. 2020 సంవత్సరం మొదటి అయిదు నెలల్లోనే ఈ రంగం 32,000 కోట్ల డాలర్ల ఎగుమతుల ఆదాయాన్ని కోల్పోయిందని, ఫలితంగా దేశదేశాల్లో 12 కోట్లమందికిపైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టిన తరవాత 10 నెలలకుగాని ఈ రంగం తిరిగి కోలుకోదని డబ్ల్యూటీటీసీ అంచనా.
భయాలు, ఆంక్షలతో చేటు కాలం
కరోనా వైరస్ సోకుతుందన్న భయానికి తోడు ఆదాయాలు పడిపోవడంతో జనం ప్రయాణాలు తగ్గించడం, విమానాలు, రైళ్లు, బస్సుల రాకపోకలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం పర్యటక రంగ దుస్థితికి మూల కారణాలు. ఉదాహరణకు కరోనా మహమ్మారి విరుచుకుపడగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలను నిషేధించారు. ప్రతి నెలా ఐరోపా నుంచి 8.5 లక్షలమంది అమెరికాకు వస్తుంటారు. వారి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు నెలకు 340 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరేది. కొవిడ్ దెబ్బతో దానికి పెద్ద గండి పడింది. ప్రయాణాలు, పర్యాటక రంగం అమెరికా జీడీపీలో కేవలం 8.6 శాతం వాటా ఆక్రమిస్తున్నా, ఈ రంగం 1.68 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తోంది. వీటిలో 60 లక్షలు ప్రత్యక్ష ఉద్యోగాలే. ఇతర దేశాలు మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. మెక్సికో జీడీపీలో 15.5 శాతం, స్పెయిన్‌లో 14.3 శాతం, ఇటలీ జీడీపీలో 13 శాతం, చైనాలో 11.3 శాతం, భారత జీడీపీలో 9.2 శాతం వాటా పర్యాటకం ద్వారానే లభిస్తోంది. కరోనా మహమ్మారి ఈ ఆదాయానికి భారీగా గండి పెడుతోంది. అసలు కరోనా విరుచుకుపడటానికి ముందే ఇటలీ, స్పెయిన్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఉన్నాయి. ఇలాంటి గడ్డు స్థితిలో ప్రయాణాలు, పర్యటక ద్వారా లభించే ఆదాయాలు, ఉద్యోగావకాశాలు ఎంతగానో ఆదుకునేవి. నిన్నమొన్నటి వరకు ఇటలీ, స్పెయిన్‌లలోని చారిత్రక వారసత్వ స్థలాలు భారీగా విదేశీ పర్యటకులను ఆకర్షించేవి. కొవిడ్ ఇప్పుడు వారిని దూరంగా తరిమేస్తుండటంతో ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతోంది.
భారత్ రెండో స్థానంలో..
అమెరికా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఎస్టా) సమాచారం ప్రకారం పర్యటకం మీద ప్రపంచంలోనే అత్యధికంగా ఆధారపడిన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ప్రథమ స్థానం. పాకిస్థాన్ మూడో స్థానం ఆక్రమిస్తున్నాయి. బంగ్లాను సందర్శించే ప్రతి 100 మంది పర్యాటకుల వల్ల ఆ దేశంలో 944 ఉద్యోగాలు ఉత్పన్నమవుతున్నాయి. భారత్‌కు వచ్చే ప్రతి 100 మంది పర్యటకులు 172 ఉద్యోగాలకు కారకులవుతున్నారు. 2019లో భారత్‌ను సందర్శించిన విదేశీ పర్యటకుల సంఖ్య కోటీ 89 లక్షలు. వీరివల్ల దేశంలో కనీసం రెండున్నర కోట్ల ఉపాధి అవకాశాలు ఉత్పన్నమయ్యాయి. ఇక స్వదేశీ యాత్రికులు మరెన్నో ఉద్యోగ, వ్యాపారాలకు కారకులవుతున్నారు. ఉదాహరణకు కశ్మీర్, గోవా, కేరళ, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు విదేశీ యాత్రికుల ప్రవాహం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అత్యధికంగా స్వదేశీ తీర్థ యాత్రికులను ఆకర్షిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు రోజుల్లో నెలకు 22 లక్షల మంది తిరుమల-తిరుపతిని సందర్శించగా, లాక్‌డౌన్ ఎత్తివేసిన తరవాత మొదటి నెలలో కేవలం 2.32 లక్షలమంది వెళ్ళారు. 2017లో భారతదేశ జీడీపీకి రూ.15.24 లక్షల కోట్లు అందించిన పర్యటక రంగం 2028 కల్లా రూ.30 లక్షల కోట్లపైచిలుకు వాటా అందిస్తుందని అంచనా. కానీ, కొవిడ్ దెబ్బకు 2020లో భారతీయ పర్యటకం రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం కోల్పోతుందని కేర్ రేటింగ్స్ సంస్థ లెక్కగట్టింది. ఇది 2019 సంవత్సర ఆదాయంకన్నా 40 శాతం తక్కువ. హోటళ్లు, టూరిజం, నౌకా విహార యాత్రలు, సాహస యాత్రలు, పెళ్లిళ్లు, విందు వినోదాలు, పారిశ్రామిక-వాణిజ్య ప్రదర్శనలు, వ్యాపార సమావేశాలు, తీర్థయాత్రలు, చారిత్రక స్థలాల సందర్శనలు, మెడికల్ టూరిజం-వంటివన్నీ కుదేలైపోవడం దీనికి మూల కారణం. కరోనా వల్ల భారతీయ టూరిజం రంగంలో 3.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతవుతాయని కేపీఎంజీ సంస్థ హెచ్చరించింది. ఇది ఆ రంగంలోని మొత్తం ఉద్యోగాల్లో 70 శాతానికి సమానం.
స్వదేశీ యాత్రలకు ప్రోత్సాహం
టూరిజం పునరుజ్జీవనం నిమిత్తం ఆ రంగంలోని సంస్థలకు భారీ పన్ను రాయితీలిచ్చి ఆదుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. మొదట ఈ రంగాన్ని బతికించుకోవడానికి బ్యాంకు రుణాల చెల్లింపును వాయిదా వేసి, నిర్వహణ మూలధనాన్ని అందించాలి. విదేశాలను సందర్శించే భారతీయ పర్యటకులను స్వదేశీ విహార యాత్రలు చేపట్టేలా ప్రోత్సహించాలి. ప్రస్తుతం 2.4 కోట్ల భారతీయ పర్యాటకులు ఏటా విదేశీ యాత్రలకు వెళుతూ 2,500 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. అందులో పెద్ద భాగాన్ని స్వదేశంలోనే ఖర్చు పెట్టేలా రాయితీలు కల్పిస్తే, భారతీయ టూరిజం రంగం, అందులోని వ్యాపార, ఉద్యోగావకాశాలు మళ్లీ వృద్ధి చెందుతాయి. విదేశీ కంపెనీలను భారత్‌లో సమావేశాలు, సదస్సులు జరుపుకొనేలా ఆకర్షించడం కూడా పర్యటక రంగ పునరుజ్జీవనానికి తోడ్పడుతుంది. ఇలా కొవిడ్ సంక్షోభాన్ని సదవకాశంగా మార్చుకోవడానికి విధానాలను రూపొందించి, వేగంగా అమలు చేయాలి.
ఉపాధి నష్టమిలా...
కరోనా దెబ్బకు ఈ ఏడాది విమాన ప్రయాణాలు, నౌకా విహారాలు 60 నుంచి 80 శాతం వరకు తగ్గిపోతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ టూరిజం సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) అంచనా. పర్యటకులు తగ్గితే నష్టం పలువిధాలుగా ఉంటుంది. 2019లో 150 కోట్లమంది వ్యాపార, విహారాల నిమిత్తం దేశదేశాలను సందర్శించారు. వీరివల్ల హోటళ్లు, ట్రావెల్ ఆపరేటర్లు, గైడ్‌లు, కార్లను అద్దెకు ఇచ్చే సంస్థలు, డ్రైవర్లకు ఉపాధి లభిస్తుంది. కరోనాతో వీరంతా దెబ్బతింటున్నారు. ఉద్యోగ నష్టం ఒక్క ఐరోపాకే పరిమితం కాదు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో సహా పలు దేశాలదీ ఇదే పరిస్థితి.
- ఏఏవీ ప్రసాద్