జల వనరులు దురాక్రమణకు గురవుతుండటం పెను విపత్తులకు దారితీస్తోంది. నిరుడు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలకు దురాక్రమణలే ప్రధాన కారణమని ఇటీవల విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడైంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలెత్తుతున్న నిర్వహణ, ప్రణాళిక లోపాలకు ఈ నివేదిక అద్దంపట్టింది. వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను నిర్మాణాత్మకంగా వినియోగించుకోవడంలోని వైఫల్యాన్ని ఈ నివేదిక ఎండగట్టింది.
ప్రణాళికల్లేని నగరీకరణతోనే...
ఉద్యోగ, ఉపాధి అవకాశాల అన్వేషణలో భాగంగా నగరాలు, పట్టణాలకు వలసలు పెరుగుతుండటంతో పెద్దయెత్తున పట్టణీకరణ అనివార్యమైంది. విస్తరిస్తున్న జనాభా అవసరాలకు అనుగుణంగా భూవినియోగం, లభ్యతను దృష్టిలో ఉంచుకుని స్థిరాస్తి వ్యాపారులు చెరువు గర్భాల్లోని భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మేయడం, అక్రమార్కులకు అధికార యంత్రాంగం అవినీతి సైతం తోడై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా సులభంగా పూర్తవుతుండటం చూస్తున్నాం.
పర్యవసానంగా భారీయెత్తున చెరువులు, కుంటల్లోనే జనావాసాలు వెలుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం వల్ల భవన నిర్మాణదారులు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలకు డ్రెయినేజీ లైన్లు వేసి మురుగునీటిని మళ్లించడమో లేక వరదనీటి మార్గాలకు మురుగునీటి పైపులైన్‌లను కలపడమో చేశారు. మురుగునీరు యథేచ్ఛగా చెరువులు, కుంటల్లోకి వచ్చి చేరడంతో పిచ్చిమొక్కలు పుష్కలంగా పెరిగి చెరువుల నీటి నిల్వ సామర్థ్యానికి గండిపడింది. జీవ వైవిధ్యం నాశనమైంది. ఇందుకు నిదర్శనాలు- హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ సరస్సు, నగరం గుండా ప్రవహిస్తున్న మూసీనదే.
వివిధ నగరాల్లో ఇలా...
హైదరాబాద్ నగరంలో, శివారు ప్రాంతాల్లో ఒకప్పుడు లక్ష చెరువులుంటే ప్రస్తుతం హెచ్‌ఎండీ పరిధిలో 3,132; నగర పరిధిలో 185 మాత్రమే మిగిలాయని ప్రభుత్వం నియమించిన 'సరస్సు పరిరక్షణ కమిటీ'యే లెక్కగట్టింది. గడచిన 12ఏళ్లలో హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, సరస్సులు 3,245 హెక్టార్ల విస్తీర్ణంలో భూమిని కోల్పోయాయని సొసైటీ ఫర్ పార్టిసిపేటరీ డెవలప్‌మెంట్ సంస్థ 2017లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్- ఐఐఎస్‌సీ బెంగళూరుకు సమర్పించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
2005 గణాంకాల ప్రకారం 12,535 ఎకరాల్లో విస్తరించిన చెరువులు 2016నాటికి 22,833 హెక్టార్ల విస్తీర్ణానికి తగ్గిపోయాయి. విశాఖపట్నం జిల్లాలో ఒక్క గ్రేటర్ విశాఖ పరిధిలోనే 151 సహజసిద్ధమైన చెరువులు ఉన్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 1902 సంవత్సరం నాటి భూ రికార్డులతో పోల్చి చూస్తే ప్రస్తుతం 2000 హెక్టార్ల విస్తీర్ణం మేర చెరువుల భూములు ప్రైవేటు వ్యక్తుల దురాక్రమణకు గురైనట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, మార్కాపురం, శ్రీకాకుళం, విజయనగరం, నగరి, పులివెందులలో కనీసం 37 చెరువుల్లో 25 దురాక్రమణకు గురయ్యాయని 2020-కాగ్ నివేదిక పేర్కొంది. 'కాగ్' పరిశీలనలో వాటిలోని అయిదు కుంటలు వాస్తవంగా అదృశ్యమయ్యాయని, వాటిలో మూడు కుంటలు ప్రపంచ వారసత్వ జల వనరుల నిర్మాణాలుగా ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపు పొందాయని, వాటి దురాక్రమణకు పాల్పడింది ఎవరో ప్రైవేటు వ్యక్తులు కాదని, స్వయానా మున్సిపాలిటీలేనని 'కాగ్' తేల్చింది.
విజయవాడవ్యాప్తంగా దురాక్రమణలు కృష్ణానది ఒడ్డునే మింగేస్తున్నాయి. పేద-సంపన్న వర్గాలు అన్న తేడా లేకుండా కృష్ణమ్మ కుడి, ఎడమ గట్టు భూములను ఆక్రమించుకున్న వారికి 2015లోనే సీఆర్‌డీఏ అథారిటీ నోటీసులు జారీచేసింది. రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా మొత్తం 20వేల చెరువులుంటే, వాటిలో ఎనిమిది వేల చెరువులు ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి.
తిరుపతి పట్టణానికి దక్షిణంగా 15 కి.మీ. దూరంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన రాయల చెరువు ఉంది. దాని నిర్మాణం హరిహర బుక్కరాయల కాలంలో ప్రారంభమై శ్రీకృష్ణదేవరాయల కాలంలో పూర్తయింది. రెండు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు భూభాగంలో నేడు 15 వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతం దురాక్రమణకు గురై నేడు నిర్జీవమైంది.
ప్రాప్తకాలజ్ఞత అవసరం
ప్రధాన నగరాలు, పట్టణాల్లోని చెరువుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకించి ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వరద నీటి నియంత్రణ చర్యలు చేపట్టాలి. చెరువులు, కుంటలు నిండి, అలుగులు పారి, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తకుండా- పొంగిపొర్లే నీటి ప్రవాహాన్ని మళ్లించడానికి వరద నీటి నాలాలను మెరుగుపరచాలి, విస్తరించాలి.
సీవరేజికి, వరద నీటికి వేర్వేరు మురుగు మార్గాలు ఏర్పరచాలి. నిర్ణీత కాలపరిధిలో నాలాలు, చెరువుల్లో పూడికతీత చేపట్టాలి. ఆక్రమణదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్‌కు సంబంధించి గతంలో నగరపాలక సంస్థ నియమించిన కిర్లోస్కర్, వోయాంట్స్ కన్సల్టెన్సీ కమిటీల సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలుచేయాలి. వరదలు, విపత్తులను దృష్టిలో ఉంచుకుని నగర, పట్టణ ప్రణాళికలు ఉండాలి. చెరువులు- పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే తక్షణ కర్తవ్యం!.
- డాక్టర్ జి.వి.ఎల్.విజయ్‌కుమార్ (రచయిత- భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)
ఇదీ చదవండి:అవును.. గాంధీజీ పూరీని దర్శించారు!