హరియాణాలోని జింద్ ఆసుపత్రిలో దూరిన ఓ దొంగ చేతికందిన సంచిని ఒకదాన్ని పట్టుకుని పారిపోయాడు. అందులో ఉన్నది కొవిడ్ టీకాలు అని తరవాత తెలిసి 'అయ్యెయ్యో ఈ కల్లోల కాలంలో ఎంత కానిపని చేశానే' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే ఆ సంచిని చక్కగా తెచ్చి అప్పగించేసి చక్కా పోయాడు. 'క్షమించండి... ఇవి కరోనా మందులని తెలియక దొంగతనం చేశాను' అని ఓ ఉత్తరమూ రాసిపెట్టి వెళ్ళాడట ఆ పుణ్యాత్ముడు! సూటూ బూటూ వేసుకుని కరోనాతోనే 'వ్యాపారం' చేస్తున్న పెద్దమనుషులతో పోలిస్తే ఈ దొంగ నిజంగా గొప్పవాడా, అమాయకుడా?
మహారాష్ట్ర, గుజరాత్లో..
టీకాలని తెలిశాక పాపం పిచ్చివాడు ఏ ఓఎల్‌ఎక్స్‌లోనో అమ్మకానికి పెట్టకుండా వెనక్కి తెచ్చివ్వడం ఏమిటి? ఇంత మంచివాడు ఈ పాడులోకంలో ఎలా బతుకుతాడండీ? మొన్నటికిమొన్న మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఏమి చేశారు? రెమ్‌డెసివిర్ మందులను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి 'ఆలసించిన ఆశాభంగం... కొవిడ్‌కు ముకుతాడు వేసే మంచి మందు... సరసమైన ధరలో సొంతం చేసుకోండి' అంటూ అమ్మేశారా లేదా? దేశమంతా ఆ మందుకు కొరత ఉంటేనేమి! నల్లబజారులో రూ.40 వేలకు సులువుగా దొరుకుతోందా లేదా? ఊరంతా తగలబడిపోతుంటేనేమి? ఆ మంటల్లోనే పేలాలు వేయించుకుని తిని బ్రేవ్‌మని తేన్చే ఈ ఘరానా దొంగలను చూసైనా నేర్చుకోకపోతే ఎలా?
వీరప్పన్ కూడా తక్కువే!
సరే, ఓఎల్‌ఎక్స్‌లో అంటే ముక్కూ మొహం తెలియని మనుషులెవరో పాడుపనులు చేశారనుకోవచ్చు. కానీ, మడత నలగని బట్టల్లో చెమట పట్టని ముఖాలతో మెరిసిపోయే ప్రైవేటు ఆసుపత్రుల బాధ్యులేమి చేస్తున్నారో కరోనా కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది కదా! కొవిడ్ లక్షణాలతో వస్తే చాలు.. లక్షలకు లక్షలు గుంజేస్తున్న వీరి చేతివాటం ముందు చిల్లర దొంగలు కాదు కదా, గంధపు చెక్కల గజదొంగ వీరప్పన్ కూడా దిగదుడుపే! దొంగకు దొంగబుద్ధి, దొరకు దొరబుద్ధి ఉంటాయని సూత్రీకరించే వాళ్లు- ఈ కాసుపత్రుల నిర్వాహకులను దొంగలంటారా, దొరలంటారా? చోరుడైతేనేమి... దుష్టుడైతేనేమి... డబ్బులున్న వాడే దొర అంటారా! శెభాష్... అయితే వీళ్లందరూ నూటికి నూరుశాతం నికరమైన దొరలే!
టిమ్స్‌లో మరోలా..!
ఆసుపత్రులంటే గుర్తొచ్చింది- 'దొంగా దొంగా వచ్చేడే... అందినవన్నీ దోచుకుపోతాడే' అనే పాట హైదరాబాదు 'టిమ్స్' చుట్టుపక్కల మార్మోగిపోతోందట! అలా అని ఏ అంతరాష్ట్ర దొంగల ముఠానో అక్కడ దిగలేదు! ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న నమ్మకంతో ఆ ఆస్పత్రి సిబ్బందిలోనే కొందరు తమ చోరకళా నైపుణ్యాన్ని 70 ఎమ్‌ఎమ్‌లో ప్రదర్శిస్తున్నారట! కొవిడ్‌తో చనిపోయిన వారి దేహాలనైతే బంధువులకు అప్పగిస్తున్నారు కానీ, వాటి మీది ఆభరణాలను లాఘవంగా తస్కరించేస్తున్నారట! 'అందరూ పీపీఈ కిట్లేసుకుని ఉంటున్నారాయే... దొంగలెవరో ఎలా గుర్తించగలం' అంటూ నాలుకలు చప్పరించేస్తున్న అధికారులకు, ఆ దొంగలకు కచ్చితంగా దండం పెట్టుకోవాలి! సరే, అధికారులంటే అలాగే మాట్లాడతారు కానీ, సీసీ కెమెరాలకు దొరకకుండా- భద్రతా సిబ్బందికి చిక్కకుండా క్షణాల్లో పని ముగించేస్తున్న ఈ దొంగల ప్రావీణ్యం ఉంది చూశారూ... చెడ్డీగ్యాంగ్ సభ్యులూ చిన్నపిల్లలే వీళ్ల ముందు! కొవిడ్ ఉందేమో అన్న అనుమానంతో రోడ్డు మీద చచ్చిపోతున్న మనిషికీ మంచినీళ్లు పోయని మనుషులకు కరోనా బాధితుల ఆభరణాలు మాత్రం ముద్దొస్తున్నాయంటే ఏమనుకోవాలి? అనుకోవడానికి ఏముంది... దొంగలంటే ఎలా ఉండాలో చూసి నేర్చుకో తమ్ముడూ అని మన జింద్ చోరుడికి కాస్త బుద్ధి చెప్పడం తప్ప!!
ఇదీ చదవండి:ఆస్పత్రి నుంచి 320 కొవాగ్జిన్ డోసులు చోరీ
కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మం గారైనా ఊహించలేదు కదా... గాలిని సైతం దొంగిలించే రోజులొస్తాయని! అదేమిటి- సమీరాన్ని ఎలా సంగ్రహిస్తారని ఆశ్చర్యపోకండి... కంటికి కనిపించని అనిలం కాదులెండి! ద్రవరూప ప్రాణవాయువును చోరీ చేశారట ప్రబుద్ధులు కొందరు హరియాణాలో! పానిపట్ నుంచి సిర్సా వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ఒకటి దారిలోనే మాయమైపోయింది! అద్భుతం... ఇలా ఉంది మన వ్యవస్థ అని తిట్టుకోవట్లేదు కదా! ఈ మాట అనుకుని అనుకుని మాకే విసుగొస్తుంటే ఇంకేమి అనుకుంటాం అంటారా! అదీ నిజమే! ప్రాణవాయువు ధర పదిరెట్లకు పైగా పెరిగిపోయింది కదండీ ఇప్పుడు... దాన్ని సొమ్ము చేసుకుందామనుకున్న అతితెలివి పరులెవరో చేసి ఉంటారు ఈ పని! కాలానికి తగిన ఆలోచనలంటే ఇవి కావూ! ఎప్పుడు దేనికి గిరాకీ ఉంటుందో దాన్ని దొంగలించాలని సొంత రాష్ట్రంలోనే ప్రాక్టికల్‌గా పాఠాలు చెబుతుంటే, అతగాడు ఎవరండీ టీకాలు తిరిగిచ్చేశాడు!?
సరే- ఈ దొంగలూ దొరల ముద్దుముచ్చట్లకేమి కానీ, ఇవాళ ప్రపంచ మలేరియా దినోత్సవం కదూ! కరోనా కమ్ముకున్నాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని దోమలు దండయాత్రకొస్తున్నాయట! వస్తే రానివ్వండి.. ఈ మశకాలకు భయపడేదెవరు? కొవిడ్ బాధితుల కాష్ఠాల దగ్గర కూడా కాసుల లెక్కలు మాట్లాడుతున్న మనుషులు పీలుస్తున్న రక్తంతో పోలిస్తే ఈ మశకాలది ఉత్తి ఆకలిబాధ! ఆ మాత్రానికే పాపం మనం వాటిని కొట్టో, మందుపెట్టో చంపేస్తాం కానీ, కరోనాసురుణ్ని మించిన ఈ పైసల బకాసురులను ఏం చేయాలి? ఎవరూ ఏమీ చేయరని తెలుసు కాబట్టే వాళ్లు అంతగా రెచ్చిపోతున్నారంటారా! అవును.. అదే కదా నిజం! అయినా ఇక్కడ ఎవరు ఏమి చేస్తున్నారని? కొవిడ్ కోరల పదును గురించి తెలిసినా యంత్రాంగం ఏమైనా మొద్దునిద్రలోంచి లేచిందా? ములుకోల పట్టుకుని దాన్ని అదిలించి కదిలించాల్సిన పాలకులు ఏమైనా చేశారా? అబ్బే... మనకు అంత అదృష్టం కూడానా!
పనిదొంగల నుంచి రకరకాల ప్రాణ ఔషధాల చోరుల వరకు దేశమంతా తస్కరులే తాండవిస్తున్నప్పుడు కరోనాసురుడు కరాళనృత్యం చేయకుండా ఎలా ఉంటాడు? ఇదే మన రాత! నూరుకోట్ల నుదుళ్లపై యంత్రాంగం గీసిన వక్రగీత!!
--- సిద్ధార్థ.
ఇదీ చదవండి:ఆహారశుద్ధితోనే ఆదాయవృద్ధి- మందగించిన పురోగతి