అశ్లీల వీడియోలు చూడమంటే నిరాకరించిందన్న అక్కసుతో ఇటీవల అస్సామ్‌లోని నగావ్ జిల్లాలో ఓ ఆరేళ్ల చిన్నారిని 8-11 ఏళ్ల మధ్య వయసు ఉన్న ముగ్గురు బాలలు హతమార్చారు. పిల్లల్లో నేర ప్రవృత్తి, హింసాత్మక ధోరణి పెచ్చరిల్లుతున్నాయనడానికి ఆ ఘటనే నిదర్శనం. ఆ అఘాయిత్యంపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ ఆనంద్ మిశ్రా- 'కుటుంబం, సామాజిక పరిస్థితుల మార్గదర్శనం బాగుంటే నేడు నలుగురు పిల్లలు బాగుండేవారు. ఈ అకృత్యంతో ఒకరు ప్రాణం కోల్పోతే మిగిలిన ముగ్గురు జీవితాల్నే కోల్పోయారు. సమాజంలో నైతిక విలువలు పడిపోతే ఆ బాధ్యత మనదే అవుతుంది' అంటూ వెలిబుచ్చిన ఆవేదనాపూరిత హెచ్చరిక ఎంతో ఆలోచించదగినది.
మారుతున్న జీవనశైలి
బాలల్లో పెరుగుతున్న నేర స్వభావం, హింసాత్మక ధోరణులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటి డిజిటల్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు భావిభారత పౌరుల ఆలోచనలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. కరోనా సంక్షోభంలో వీటికి లాక్‌డౌన్ తోడవడంతో చాలామంది పిల్లల జీవనశైలి మారుతోంది. దీర్ఘకాలం పాటు పాఠశాలలు తెరవకపోవడం, ఆన్‌లైన్ తరగతులే శరణ్యం కావడంతో పిల్లలకు డిజిటల్ ఉపకరణాలే ప్రధాన బోధనా మాధ్యమాలయ్యాయి. ప్రస్తుతం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా... కొందరు విద్యార్థుల్లో డిజిటల్ పరికరాల వినియోగం ఒక వ్యసనంగా రూపాంతరం చెందింది. కొందరిలో నేర ప్రవృత్తి పెరగడానికీ ఇది కారణమవుతోంది. 9-17 ఏళ్ల వయసు వారిలో 30.2శాతం పిల్లలకు సొంత సెల్‌ఫోన్లు ఉన్నాయని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) అధ్యయనం వెల్లడించింది. ఆ వయసులోపు పిల్లల్లో 15.80శాతం రోజుకు నాలుగు గంటలు, 5.30శాతం రోజుకు నాలుగు గంటలకుపైగా సెల్‌ఫోన్లు వీక్షిస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న విద్యార్థుల్లో 45 నుంచి 48శాతం అశ్లీల వీడియోలు, సమాచారం కోసం వెతుకుతున్నారని హైదరాబాద్‌లో 'షి టీమ్' ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల వ్యసనం ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. మరోవైపు నిరక్షరాస్యత, పేదరికం పిల్లలను నేరాలకు పురిగొల్పుతున్నాయి. నేరపూరిత వాతావరణంలో పెరిగిన పిల్లల్లో కొందరు హత్యలు, అత్యాచారాలు, దాడులకు తెగబడుతుండటం కలవరపరుస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో పదహారేళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అందులో ఇద్దరు మైనారిటీ తీరనివారు. అత్యాచారానికి గురయ్యానన్న అవమానభారంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ యువతిపై పదిహేనేళ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాలో ఓ బాలికపై ఏడుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా బాలలు నేరాల ఉచ్చులో చిక్కుకుంటూ నేరస్తులుగా మారుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా 2020లో 18 ఏళ్లలోపు బాలలపై 29,768 నేరాలు నమోదయ్యాయని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. బాలలపై అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 4,819 కేసులు రికార్డులకెక్కాయి. తెలంగాణలో 1,013, ఆంధ్రప్రదేశ్‌లో 759 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇందులో చాలావరకు దొంగతనం, గాయపరచడం, ఇళ్లలో చోరీలు, దారి దోపిడులు, మహిళలపై వేధింపులు, హత్యాయత్నాలు, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్, బెదిరింపు వంటివే. నిరుడు అరెస్టయిన 35,352 బాలల్లో 29,285 మంది తల్లిదండ్రుల వద్ద పెరిగిన వారే. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఏమరుపాటుగా ఉండకూడదని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించకపోవడం కూడా బాల నేరస్తులు తయారవడానికి ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
చైనా విధానం అనుసరణీయం...
పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైపోకుండా, వారిలో నేరప్రవృత్తి పెరగకుండా చైనా ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. వాళ్లు వారంలో మూడు గంటలకు మించి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడరాదని ఆంక్షలు విధించింది. ట్యూషన్లు, ఇంటిపని పేరిట వారిపై ఒత్తిడి పెంచవద్దని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను హెచ్చరించింది. పాఠశాలల పనివేళలను తగ్గించింది. పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఎక్కువగా గడపాలని, వారికి నైతిక విలువలు, సత్ప్రవర్తన నేర్పించాలన్నదే వీటి ఉద్దేశం. భారత్‌లోనూ ఈ తరహా విధానాలు రూపొందించడం శ్రేయస్కరం. పిల్లలు అవసరం మేరకే డిజిటల్ ఉపకరణాలు వినియోగించేలా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి. సామాజిక మాధ్యమాల జోలికి వెళ్లకుండా నిలువరించాలి. ఖాళీ సమయంలో వారి దృష్టిని పుస్తక పఠనం, ఆటలవైపు మళ్లించాలి. పిల్లలు సైబర్ నేరాల బారిన పడకుండా తెలంగాణ పోలీసు శాఖ 'సైబర్ కాంగ్రెస్' పేరిట అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయాలి. పిల్లల పెంపకంలో తొలి నుంచి బాధ్యతగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే- వారిని భావిభారత పౌరులుగా, సమాజ నిర్దేశకులుగా తీర్చిదిద్దవచ్చు.
- ప్రభాకర్‌రెడ్డి
ఇదీ చూడండి: నిపుణ వనరులే ప్రగతి దీపాలు