చట్టసభల ప్రతిష్ఠ ఒక్కసారి నేలమట్టమైతే దేశ ప్రజాతంత్రమే పెను ప్రమాదంలో పడుతుందని భారత తొలి ప్రధాని పండిత నెహ్రూ త్రికరణశుద్ధిగా విశ్వసించారు. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి ముడుపులందుకొన్న ముద్గల్ వ్యవహారం బయటపడగానే ఏకోన్ముఖంగా అతగాడిని బహిష్కరించి స్వీయప్రతిష్ఠ విషయంలో రాజీపడేది లేదని తీర్మానించింది ఆనాటి పార్లమెంటు! నాటి విలువలు, సత్ ప్రమాణాలకు కాలంచెల్లిపోగా- అవినీతే రాజనీతిగా రూపాంతరం చెంది, నేరగ్రస్త రాజకీయాల ఉరవడి ఠారెత్తిస్తోంది.
రాజ్యసభలో 54 మందిపై..
భిన్న పార్శ్వాల ప్రజాజీవనంలో తలలుపండిన మేధావుల అనుభవసారాన్ని రంగరించే వేదికగా రాణకెక్కాల్సిన రాజ్యసభ సైతం- క్రిమినల్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న సభ్యులతో 'అలరారుతున్న' తీరు, ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. 229 మంది రాజ్యసభ సభ్యులు స్వయంగా సమర్పించిన ప్రమాణపత్రాల ఆధారంగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) రూపొందించిన నివేదిక- వారిలో 54మంది మీద క్రిమినల్ అభియోగాలు ఉన్నాయంటోంది. అందులోనూ 28మంది మీద హేయ నేరారోపణలున్నాయి. ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేయదన్న నానుడి పార్లమెంటు ఉభయసభలకూ వర్తించేదే!
16వ లోక్‌సభలో 43 శాతం..
కొన్ని వ్యాజ్యాల పరిష్కారానికి రెండు దశాబ్దాలు నిరీక్షించాల్సి వస్తోందని, ఆలోగా నేరాభియోగాలు ఎదుర్కొనే వ్యక్తి ప్రజా ప్రతినిధిగా నాలుగు పర్యాయాలు చక్రం తిప్పగల వీలుందని సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ లోగడ వ్యవస్థీకృత లొసుగుల్ని ఎత్తిచూపడం తెలిసిందే! కాబట్టే, 14వ లోక్‌సభలో 24 శాతం, తదుపరి సభలో 30 శాతం, పదహారో లోక్‌సభలో మూడోవంతుగా ఎదిగిన దు'శ్శాసన' సంతతి- ప్రస్తుత దిగువ సభలో 43 శాతానికి చేరింది. నానావిధ నేరగాళ్లూ శాసన నిర్మాతలై దేశాన్నేలే మహాజాడ్యం ప్రజాతంత్ర భారతావనినే నగుబాటుకు గురి చేస్తోంది!
అది ఓటర్ల హక్కు..
దివాలా తీసినవారికి ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదని రాజ్యాంగంలోని 102(1) (సి) అధికరణ స్పష్టీకరిస్తోంది. ప్రజాజీవితంలో నైతికంగా దివాలా తీసినవారు, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి బ్యాంకులను, దేశాన్నీ దివాలా తీయించినవారూ నిక్షేపంగా చట్టసభలకు ఎగబాకుతున్న తీరు నిశ్చేష్టపరుస్తోంది. నేరగ్రస్త రాజకీయాల విషపరిష్వంగం నుంచి చట్టసభల్ని విముక్తం చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రయోజన వ్యాజ్యాల రూపేణా న్యాయస్థానాల్లో సాగుతున్న పోరాటాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. తాము ఎన్నుకోబోయే అభ్యర్థి మంచిచెడ్డలు ఏమిటన్నది తెలుసుకోవడం ఓటర్ల హక్కు అంటూ, వాళ్ల నేరచరిత్ర తెలియజెప్పాల్సిందేనని దిల్లీ హైకోర్టు ఇరవై ఏళ్ల క్రితం చారిత్రక తీర్పు ఇచ్చింది. దాన్ని నీరుగార్చడానికి ఒక్క తాటి మీదకొచ్చిన పార్టీల దుస్తంత్రాన్ని సుప్రీం న్యాయపాలిక సమర్థంగా ఛేదించబట్టే ఎవరి నేరచరితలు ఏమిటన్నవి బయటకొస్తున్నాయి. గెలుపు ఒక్కటే అభ్యర్థి ఎంపికకు కొలమానం కారాదన్న సుప్రీంకోర్టు- తమ నేరచరిత్రపై అభ్యర్థులే పత్రికల్లో ప్రకటనలివ్వాలంటూ 2018 సెప్టెంబరులో వెలువరించిన ఆదేశాలూ ప్రభావశూన్యమైపోయాయి.
రాజ్యాంగపర లక్ష్మణరేఖ మీరజాలమంటూ నేర రాజకీయాల నిషేధానికి పటిష్ఠ చట్టం చేయాలన్న న్యాయపాలిక సూచనకూ మన్నన కొరవడింది. ప్రస్తుత స్థితిగతులు, పార్లమెంటు రూపురేఖలు గమనిస్తే ఆ తరహా చట్టం చేసే సూచనలు లేవన్న ఎన్నికల సంఘం- పార్టీలపై గట్టి చర్యలు చేపట్టే అధికారమూ తనకు కొరవడిందని కోర్టుకే విన్నవించింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తినే ఎందుకు అభ్యర్థిగా ఎంచుకోవాల్సివచ్చిందో పార్టీలే బహిరంగంగా వెల్లడించాలన్నది 'సుప్రీం' తాజా ఉత్తర్వుల సారాంశం. నేరగాళ్లనే గెలుపు గుర్రాలుగా తీర్చిదిద్ది, వారి తోడిదే మనుగడగా రాజకీయాలు నెరపుతున్న పార్టీలు- వచ్చే బిహార్ ఎన్నికల్లో న్యాయపాలిక ఆదేశాల్ని ఎలా శిరసావహిస్తాయన్నది ఆసక్తికరం. నేరగ్రస్త రాజకీయ భస్మాసుర హస్తం తమనే కబళించక ముందే పార్టీలు మేలుకొంటాయా?- అన్న ప్రశ్నే ప్రజాస్వామ్య హితైషుల్ని కలవరపరుస్తోంది!