భారతావని చరిత్రలోనే అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా జీఎస్‌టీ(వస్తు సేవా సుంకం) పట్టాలకెక్కి మూడున్నర సంవత్సరాలైంది. దేశార్థిక వ్యవస్థలో అవినీతిని దునుమాడి వసూళ్లలో పారదర్శకత నెలకొల్పడం జీఎస్‌టీ మౌలిక లక్ష్యమని అప్పట్లో ప్రభుత్వ వర్గాలు మోతెక్కించాయి. కొన్నాళ్లుగా వెలుగు చూస్తున్న కథనాలు, రెండు వారాల వ్యవధిలోనే అయిదు వందలకు పైగా కేసుల నమోదు, ముగ్గురు ఛార్టర్డ్ అకౌంటెంట్లు సహా 36 మంది అరెస్టయిన వైనం... అవకతవకల ఉరవడిని చాటుతున్నాయి. ఒకపక్క కొవిడ్ మహా సంక్షోభ వేళ వసూళ్ల కుంగుబాటు కలవరపరుస్తుండగా, మరోవైపు నకిలీ ఇన్‌వాయిస్‌ల దన్నుతో కోట్ల రూపాయల మేర ఎగవేతల జోరు- తిష్ఠ వేసిన అవ్యవస్థను ప్రస్ఫుటం చేస్తోంది. ఏటా 18-19 లక్షల దాకా నూతన జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లు చోటు చేసుకుంటున్నాయని, ఏడాది చివరికి ఆ కంపెనీల్లో 70శాతం వరకు అజాపజా లేకుండా పోతున్నాయన్నది ఉన్నతాధికారుల లోపాయికారీ విశ్లేషణల సారాంశం. చెల్లించని మొత్తానికి ఐటీసీ (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) రూపంలో భారీగా పిండుకుంటున్న ప్రబుద్ధుల ఉదంతాలు మూడున్నరేళ్లుగా వింటూనే ఉన్నాం.
పుణె, ఘజియాబాద్, అహ్మదాబాద్, లూథియానా, హైదరాబాద్, విశాఖ తదితర నగరాలు డొల్ల కంపెనీలకు నెలవై వేల కోట్ల రూపాయల కుంభకోణాల ఉద్ధృతిని కళ్లకుకట్టాయి. ఒక స్థాయికి మించి వార్షిక టర్నోవర్ సాగించే సంస్థలు జీఎస్‌టీ నెట్‌వర్క్ పోర్టల్‌లోనే ఇ-ఇన్‌వాయిస్ రూపొందించాలని నియంత్రించినా అక్రమాలు ఆగనే లేదని తాజా ప్రహసనాలు నిరూపిస్తున్నాయి. ఈ దుస్థితికి విరుగుడుగా- రెండురోజుల మేధామథనం దరిమిలా జీఎస్‌టీ మండలి న్యాయ సంఘం సత్వర దిద్దుబాటు చర్యల్ని ప్రతిపాదిస్తోంది. పట్టపగ్గాల్లేని రీతిలో ఖజానాకు రాబడి నష్టం, అంతకు మించి అవినీతి పోకడల ప్రజ్వలనం... ఇక ఎంతమాత్రం సహించరానివి!
ఇకమీదట జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ కోరే అర్జీదారులెవరికైనా ఆధార్ తరహాలో ఫొటోలు, వేలిముద్రల ప్రక్రియను తప్పనిసరి చేయాలన్నది న్యాయ సంఘం ప్రతిపాదన. ఆ మేరకు బ్యాంకులు, పోస్టాఫీసులు, జీఎస్‌టీ సేవాకేంద్రాల వద్ద అవసరమైన వసతులు ఏర్పరచాలన్నది యోచన. చమురు మాఫియా కోరలు తుంచడానికి, సంక్షేమ పథకాల్ని గుల్లబారుస్తున్న దుష్టశక్తుల పీచమణచడానికంటూ ఆరంభించిన ‘ఆధార్’ కసరత్తు ఆచరణలో భ్రష్టుపట్టిన తీరు తెలియనిదెవరికి? వివరాల నమోదు, సమాచార బట్వాడా, వేలిముద్రలూ ఫొటోల సేకరణ... అన్నింటా అవకతవకలు, కాసుల గలగలలు అప్పట్లో దిగ్భ్రాంతపరచాయి. అందువల్ల అదే నమూనాను శిరోధార్యంగా భావించి ముందుకెళ్తే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మరింత వివాదాస్పదమై ఎగవేతదారులకు అయాచిత వరమయ్యే ముప్పు పొంచి ఉంది.
అక్రమాల స్వరూప స్వభావాలకు అనుగుణంగా సంస్కరణల చికిత్స పదును తేలాలి. పలు సంస్థలు ఒకే చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరుతో లావాదేవీలు నిర్వహిస్తుండటం, కొంతమంది ద్విచక్ర వాహనాలపైనే వందల టన్నుల సరకు తరలించినట్లు రికార్డుల్లో చూపడం, నకిలీ రిటర్నుల సాయంతో బోగస్ సంస్థలు బ్యాంకుల్నీ బురిడీ కొట్టించి కోట్ల రూపాయల రుణాలు రాబట్టి ఉడాయిస్తుండటం... పూడ్చాల్సిన కంతలెన్నో ఉన్నట్లు స్పష్టీకరిస్తున్నాయి. పన్ను యంత్రాంగం సేకరించే ఏ సమాచారమైనా నిర్దుష్టంగా ఉండేలా చూడటం, కీలక వివరాలేవీ మోసగాళ్ల పాలబడకుండా కాచుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పి, ఇంటిదొంగల పైనా నిఘాపెట్టి, సత్వర విచారణలతో కఠిన శిక్షల కొరడా ఝళిపించినప్పుడే- పన్ను ఎగవేతల అవినీతి జాతరకు తెరపడుతుంది!