ఇటీవల కొంతకాలం నిద్రాణంగా ఉన్నట్లనిపించి, అకస్మాత్తుగా గ్రెనేడ్లు అత్యధునాతన ఆయుధాల మోతలతో మార్మోగిపోయిన దండకారణ్య ప్రాంతంలో.. అక్షరాలా మృత్యు తాండవమే ఇది! ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు పక్కా వ్యూహంతో ఉచ్చు బిగించి, భద్రతా దళాలపై జరిపిన భీకర దాడి యావత్ జాతినీ నిశ్చేష్టపరచింది.
ఇది మొదటి సారే కాదు
బలగాలు ఎటూ తప్పించుకునే దారి లేకుండా దిగ్బంధం చేసి మావోయిస్టులు చావుదెబ్బ తీయడమిదే మొదటిసారి కాదు. దాదాపు పదమూడేళ్లనాడు ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాల్ని చుట్టుముట్టి సాగించిన రాకెట్ దాడిలో 38మంది నిస్సహాయంగా హతమారిపోయారు. నాలుగేళ్ల క్రితం సుక్మా జిల్లాలోనే వామపక్ష తీవ్రవాదుల మెరుపుదాడిలో పాతిక మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలయ్యారు. స్థానికంగా ప్రతి చెట్టూ పుట్టా గుట్టుమట్లన్నీ క్షుణ్నంగా తెలిసిన మావోయిస్టులు దంతెవాడ, బిజాపూర్, గో, డంకా, బస్తర్ జిల్లాల్లో ఎన్నో పర్యాయాలు మారణకాండకు తెగబడ్డారు. అక్కడి అటవీ ప్రాంతంలోనే 76మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల్ని బస్సుతో సహా పేల్చేసిన కిరాతక దాడీ చోటుచేసుకుంది.
నిర్లక్షమే కారణం
ఇన్నిన్ని విషాద అనుభవాల తరవాతా పాఠాలు నేర్చి దిద్దుబాట పట్టకపోతే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో- 23మంది నేలకొరిగిన తాజా దురంతం చాటుతోంది. లోగడ కేంద్ర హోంమంత్రిగా వ్యూహాత్మక కమాండ్‌తోపాటు ఏకీకృత కమాండ్ అవసరాన్నీ ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్- ఎనిమిది మౌలిక సూత్రాల 'సమాధాన్'తో రాష్ట్రాలు ముందడుగేయాలని పిలుపిచ్చారు. తద్వారా, పొంచి ఉన్న శత్రువు(మావోయిస్టు)ల కదలికల్ని ముందుగానే ఊహించగల సామర్థ్యం ఒనగూడుతుందని ఆయన ఆకాంక్షించారు. నేటికీ ఆ దిశగా సరైన కదలిక కొరవడి- ఎత్తయిన ప్రదేశాల్లో మాటువేసిన గెరిల్లాలకు కూంబింగ్ దళాలను వేటాడే అవకాశం చేజిక్కడం.. వ్యూహాత్మక తప్పిదాల్ని అతి జరూరుగా సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతోంది. కనీస జాగ్రత్తల్నీ గాలికొదిలేసిన నిర్లక్ష్యమే నేడింతటి ఘోరకలికి కారణభూతమైంది.
ఆ నైపుణ్యం కొరవడింది
అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ల సందర్భంగా ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో, ఏమేమి వ్యూహాలు అనుసరించాలో- ఉభయ తెలుగు రాష్ట్రాల గ్రేహౌండ్స్ సిబ్బందికి కొట్టిన పిండి. ఆ తరహా నైపుణ్యం కొరవడిన కారణంగా, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల ఉచ్చులో చిక్కి జననష్టం వాటిల్లుతున్నా వ్యూహాల్లో మార్పు రాకపోవడమేమిటి? చాటుగా ఉండి అదాటున దాడికి తెగబడే గెరిల్లా యుద్ధతంత్రంలో రాటుతేలిన మావోయిస్టుల ఏరివేతలో ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదన్న హెచ్చరికల్ని పట్టించుకొనకపోవడమే తీవ్ర అనర్థదాయకమవుతోంది. ఛత్తీస్‌గఢ్ నరమేధానికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిన పూనారు.
అభివృద్ధే ఆయుధం
అయిదు దశాబ్దాలకు పైగా రావణకాష్ఠమై రగులుతూ నెత్తుటి నెగళ్లు ఎగదోస్తున్న కీలక సమస్య తీవ్రతను ప్రభుత్వం తొలుత ఆకళించుకోవాలి. దేశంలో వామపక్ష తీవ్రవాదం 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలకు పరిమితమైందని ఆమధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మదింపు వేసింది. మావోయిస్టుల హింసాకాండ 46 జిల్లాల్లోనే నమోదైనట్లు సుమారు ఆరునెలల క్రితం ప్రకటించింది. పది వేలమంది కోబ్రాలనే కాదు, పద్నాలుగు లక్షల భారత సైన్యాన్నీ ఎదుర్కోవడానికి సిద్ధమంటూ గతంలో సవాలు విసిరిన మావోయిస్టులు- భద్రతా బలగాలు ప్రాబల్య ప్రాంతాలను పెద్దయెత్తున జల్లెడ పడుతున్నా, తమ ఉనికిని ఎలా కాపాడుకోగలుగుతున్నారో లోతుగా విశ్లేషించాలి. గిరిజన ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాల అణగారని ఆవేదనను పరిమార్చే అభివృద్ధి ప్రణాళికల సమర్థ అమలుపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. పీడిత జనావళి బతుకుల బాగుసేత కృషి సవ్యంగా పట్టాలకు ఎక్కితే- మానవ రహిత డ్రోన్ల వినియోగంతో మావోయిస్టుల ఆట కట్టించే ప్రణాళికల అవసరం లేకుండానే, వామపక్ష తీవ్రవాదం ఉనికీ మనికీ కోల్పోయే రోజు వస్తుంది!
ఇదీ చదవండి: తమిళ పోరు: పోలింగ్‌కు సర్వం సిద్ధం