జాతి నిర్మూలన, అణచివేతలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్థాన్‌లో ప్రారంభమైన తిరుగుబాటు భారత్ జోక్యంతో ఒక కొత్త దేశం పుట్టుకకు కారణమైంది. స్వాతంత్ర్య భానూదయంతో నూతన దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్‌కు భారత్‌తో విడదీయలేని పేగుబంధం ముడివడి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాల మధ్య నేడు జరగనున్న ద్వైపాక్షిక వర్చువల్ సదస్సులో చిల్‌హటి-హల్దిబరి రైల్ లింక్‌సహా నదీజలాల పంపిణీ వంటి అనేక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి యాభయ్యేళ్లు అయినందున ఆ రోమాంచిత ఘట్టాన్ని ప్రస్తావించుకోవడం సందర్భసహితం...
ఆంగ్లేయులు భారత్ నుంచి నిష్క్రమించేటప్పుడు దేశాన్ని రాజకీయంగా రెండు ముక్కలు చేశారు కానీ, భౌగోళికంగా భారత్ మూడు ముక్కలైనట్లు లెక్క. భారత్ నుంచి విడివడిన పాకిస్థాన్‌లోని పశ్చిమ, తూర్పు భాగాలు తల ఒకచోట, తోక మరోచోట విసిరేసినట్లుగా తయారయ్యాయి. ఈ రెండు భాగాల మధ్య 1,600 కిలోమీటర్ల పర్యంతం భారతీయ భూభాగం పరుచుకుని ఉండేది. మతం పేరిట పాకిస్థాన్ పెట్టిన వేరు కాపురం మూణ్నాళ్ల ముచ్చటైంది. తూర్పు పాకిస్థాన్ బెంగాలీ భాషా ప్రాంతం; పశ్చిమ పాకిస్థాన్ పంజాబీ, సింధీ, బలూచీ, పఠాన్ వంటి జనవర్గాలకు నెలవు.
ఆర్థిక అంతరాలు
ఏకమొత్తంగా చూస్తే ఉభయ పాకిస్థాన్ భూభాగాల్లో సైనికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పంజాబీ ముస్లిముల ఆధిక్యమే కొనసాగేది. పాక్‌లో ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనిపై 1960ల నాటికే తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ ముస్లిములలో తీవ్ర అసంతృప్తి రగిలింది. అప్పటి పాక్ అధినేత ఆయూబ్ ఖాన్ పాలనలో తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ల మధ్య విస్తృత ఆర్థిక అంతరాలు ఏర్పడ్డాయి.దీనిపై తూర్పు పాకిస్థానీ విద్యార్థులు, మేధావి వర్గాల్లో నిరసన గూడుకట్టుకోసాగింది. అంతలో 1965 భారత్-పాక్ యుద్థం సంభవించి తూర్పు పాక్ సైనిక దుర్బలత్వం బయటపడింది. పాక్‌లో తమకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే వెనకబడి పోతున్నామని బెంగాలీ ముస్లిములు ఆవేదన చెందసాగారు. ఈ అసంతృప్తి తోనే షేక్ ముజిబుర్ రహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ 1966లో ఆరు సూత్రాల స్వయంప్రతిపత్తి కార్యక్రమం ప్రకటించింది. తూర్పు, పశ్చిమ పాకిస్థాన్లతో సమాఖ్య వ్యవస్థ ఏర్పడాలని డిమాండ్ చేసింది. దీనిపై 1969 జనవరికల్లా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. షేక్ ముజిబుర్ రహమాన్ తో పాటు అనేకమంది రాజకీయ, విద్యార్థి నాయకులు జైలుపాలయ్యారు. 1969 జనవరి 20న ఢాకాలో 10,000 మంది విద్యార్థులు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. 1970 ఎన్నికల్లో అవామీ లీగ్ విజయాన్ని పాక్ నాయకత్వం గుర్తించడానికి నిరాకరించడమే కాదు- ముజిబుర్‌ను అరెస్టు చేసింది కూడా. రోజురోజుకీ ఉద్ధృతమైన నిరసనోద్యమాన్ని అణచివేయడానికి అప్పటి పాక్ ప్రధాని యాహ్యాఖాన్ తూర్పు పాకిస్థాన్‌కు జనరల్ టిక్కా ఖాన్‌ను పంపారు. ఆయన 1971 మార్చి 25న పెద్దయెత్తున సైనిక చర్య చేపట్టారు.ఆ దమన కాండకు తట్టుకోలేక తూర్పు బెంగాలీ శరణార్థులు లక్షల సంఖ్యలో భారత్‌కు తరలివచ్చారు.
పాక్ దాడి- భారత్ ప్రతిదాడి
మరోవైపు బంగ్లా స్వాతంత్ర్య యోధులు ముక్తి వాహినిగా ఏర్పడి పాక్ సైన్యంపై గెరిల్లా పోరు సాగించారు. ముక్తివాహినికి భారత్ సహాయసహకారాలు అందిస్తోందంటూ పాకిస్థాన్ 1971 డిసెంబరు మూడున 12 భారతీయ వైమానిక స్థావరాలపై దాడులకు తెగబడింది. భారత్ ప్రతిచర్యకు దిగి తూర్పు పాకిస్థాన్‌పై దండెత్తింది. ఆ సందర్భంగా 'లొంగిపోండి లేదా తుడిచిపెట్టేస్తాం' అంటూ పాక్ సైనికులను ఉద్దేశించి నాటి ఫీల్డ్‌మార్షల్ మాణిక్‌షా చేసిన ప్రకటన ఎంతో ప్రసిద్ధి చెందింది. డిసెంబరు 14కల్లా పాక్ సైన్యం చేతులెత్తేసింది. 93,000 మందికిపైగా పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు.
కూటమి ఎత్తులు భగ్నం
తమ అనుంగు అనుచరురాలైన పాక్ ఇంత చిత్తుగా ఓడిపోవడం చూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ భరించలేకపోయారు. ఆయనకు ఇందిరాగాంధీ అంటే వ్యక్తిగతంగా ద్వేషం. యుద్ధ సంక్షుభిత ఢాకా నుంచి అమెరికా పౌరులను భద్రంగా తరలించే మిషతో అణ్వస్త్ర వాహక నౌక ఎంటర్‌ప్రైజ్ నాయకత్వంలో అమెరికా సప్తమ నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపారు. ఇది అంతర్జాతీయ సమీకరణల్లో పెను మార్పు తీసుకొచ్చింది. 1971 ఆగస్టులో భారత్, సోవియట్‌ల మధ్య కుదిరి ఉన్న శాంతి, స్నేహ, సహకార ఒప్పందం ఆ విషమ సమయంలో దిల్లీకి అక్కరకొచ్చింది. భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తూ సోవియట్ నిక్సన్ సర్కారుకు రహస్య సందేశం పంపింది. దానితోపాటు సోవియట్ నౌకలు, అణు జలాంతర్గాములను పంపింది. దీంతో అమెరికా బెదిరింపులు సాగవని తేలిపోయింది. ఆ క్లిష్ట స్థితిలో పాక్‌కు అండగా చైనా ముందుకొస్తే భారత్ వెనక్కు తగ్గుతుందని నిక్సన్ ఆశపడ్డారు. కానీ, చైనా ఈ వలలో పడలేదు. 1969లో చైనా, సోవియట్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఏర్పడి ఉన్నందువల్ల తాము కనుక భారత్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తే సోవియట్ వెంటనే జోక్యం చేసుకుంటుందని చైనా నాయకులు భయపడ్డారు. అమెరికా-పాక్-చైనా కూటమి ఎత్తులను భారత్-సోవియట్ మైత్రి భగ్నం చేయగలిగింది. మొత్తం మీద బంగ్లాదేశ్ అవతరణకు కారణమైన 1971 యుద్ధంలో తన ఘనవిజయాన్ని గుర్తుచేసుకుంటూ డిసెంబరు 16 నుంచి భారత్ స్వర్ణోత్సవం జరుపుకొంటోంది.