దేశార్థికానికి, ముఖ్యంగా పన్నుల ఆదాయం, రుణ సేకరణలకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి గత నెల నుంచి వచ్చే నెల వరకు కీలక సమయం. కేంద్రం తాజాగా రూ.1.6 లక్షల కోట్ల అదనపు రుణ సేకరణకు పార్లమెంటు ఆమోదం కోరగా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో లోటును తట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాలు రిజర్వుబ్యాంకు ప్రత్యేక గవాక్షం ద్వారా రుణసేకరణకు సిద్ధమయ్యాయి. జీఎస్టీ వసూళ్లు పడిపోయినందువల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కేంద్రం చెల్లించలేకపోతున్న సంగతి తెలిసిందే. ఆదాయ లోటు దైవికంగా ఏర్పడినందున, రాష్ట్రాలకు పరిహారం చెల్లించలేకపోతున్నాననే వాదాన్ని కేంద్రం వినిపించడం- కొత్త సమస్యలకు దారితీసింది. కరోనా మహమ్మారిని ప్రభుత్వం దైవిక చర్యగా వర్ణించింది. రాజ్యాంగ సమస్యలపై ఏర్పడిన భేదాభిప్రాయాల్లోకి దైవిక చర్యను లాక్కురావచ్చా అనే మీమాంస తలెత్తింది. నిధుల పంపిణీ, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర-రాష్ట్ర సంబంధాల వంటి అంశాల్లో దైవిక చర్యతో పనేమిటన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో మార్పుచేర్పులు చేయడానికి విధానాలను రూపొందించేటప్పుడు రాజకీయ ఆర్భాటానికితావు ఇవ్వకుండా ముందూవెనకలు స్థిమితంగా ఆలోచించి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. హేతుబద్ధంగా ఆలోచించి, లోతైన విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవాలే తప్ప- రాజకీయ నినాదాలతో పని జరిపించేయాలని చూడకూడదు.
విడ్డూరంగా అంచనాలు
భారత్‌లో అసలే జటిలంగా ఉన్న పన్నుల వ్యవస్థను జీఎస్టీ మరింత సంక్లిష్టం చేసింది. జీఎస్టీ సాధకబాధకాలను కేంద్ర,రాష్ట్రాలు లోతుగా విశ్లేషించలేదు. కొవిడ్ వంటి అవాంతర పరిస్థితులు వచ్చిపడితే ఆర్థికంగా జరిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించలేదు. గొప్ప ఆర్థిక సంస్కర్తలుగా పేరుతెచ్చుకోవాలనే ఆరాటంలో ప్రస్తుత రాజకీయ నాయకత్వం జీఎస్టీ లోటుపాట్లను క్షుణ్నంగా పరిశీలించకుండా హడావుడిగా చట్టం తెచ్చింది. రాష్ట్రాలు కూడా ఆర్థికేతర కారణాలతో జీఎస్టీ చట్టానికి ఆమోద ముద్ర వేశాయి. తామూ సంస్కర్తలమేనని అవి చాటుకోదలచాయి. పాత పన్నుల వ్యవస్థ నుంచి జీఎస్టీకి మారినందువల్ల 2016 మార్చి 31 నుంచి అయిదేళ్ల వరకు ఎదురయ్యే ఎలాంటి ఆదాయ నష్టాన్నైనా తాను భర్తీ చేస్తానని కేంద్రం హామీ ఇచ్చింది. తదనుగుణంగా 2017లో వస్తుసేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) చట్టాన్ని తీసుకొచ్చింది. అయిదేళ్లలో రాష్ట్రాల పన్ను ఆదాయం ఏటా 14 శాతం చొప్పున పెరుగుతుందని ఈ చట్టంలో అంచనా వేశారు. ఒకవేళ రాష్ట్రాల ఆదాయం అలా పెరగకపోతే, ఆ లోటును 2022 వరకు కేంద్రం భరించాలి. దీనికోసం కొత్త పరోక్ష పన్నులు విధించి, తద్వారా వచ్చే ఆదాయాన్ని జీఎస్టీ పరిహార నిధికి జమ చేయాలి. అసలు రాష్ట్రాల ఆదాయం ఏటా 14 శాతం చొప్పున పెరుగుతుందని ఆశించడం పెద్ద విడ్డూరం. ఏ ఆర్థిక ప్రాతిపదికపై ఇలా అంచనా వేశారో కేంద్ర నాయకత్వానికే తెలియాలి. భారతదేశం ఆర్థికంగా ఎదురులేకుండా పురోగమిస్తూనే ఉంటుందన్న అతి నమ్మకమే ఈ అంచనాకు ఆధారం. చెట్లు ఆకాశంలో నక్షత్రాలను తాకడానికి నిరంతరం ఎదుగుతూనే ఉంటాయని నమ్మడం ఎలానో, ఇదీ అంతే. అసలు జీఎస్టీ సంక్లిష్టతలు, అమలులోని లోపాల వల్ల ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌కు ముందే మందగమనంలోకి జారిపోయింది. 2020-21లో రాష్ట్రాల జీఎస్టీ ఆదాయం రూ.3 లక్షల కోట్ల మేర కోసుకుపోనుంది. ఇందులో రూ.65,000 కోట్లను సెస్సుల ద్వారా భర్తీ చేయవచ్చు. మిగతా రూ.2.35 లక్షల కోట్ల మాటేమిటన్నది ఇక్కడి ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం ఈ ఆదాయ లోటును కేంద్రమే భర్తీచేయాలి. పాత పన్నుల వ్యవస్థ నుంచి జీఎస్టీకి మారేటప్పుడు సంభవించే ఆదాయ నష్టాన్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని జీఎస్టీ పరిహార చట్టంలోని 6, 7 సెక్షన్లు హామీ ఇస్తున్నాయి. కేంద్రం పరిహారం చెల్లించకుండా దాటవేయడానికి ఈ చట్టం అనుమతించదు.
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం!
దేశార్థికానికి సంబంధించి మితిమీరిన ఆశావాదాన్ని ప్రదర్శించినందుకు కేంద్రమే మూల్యం చెల్లించుకోవాలి. తన రాజ్యాంగ విధులు, బాధ్యతల నుంచి తప్పించుకొంటున్నదనే అభిప్రాయం ప్రబలకుండా కేంద్రం జాగ్రత్తపడాలి. అలా జాగ్రత్త పడకపోతే స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు విఘాతమేర్పడుతుంది. దాన్ని నివారించాలంటే ఆరు నూరైనా రాజ్యాంగ విధులను నెరవేర్చి తీరతాననే దృఢ సంకల్పాన్ని కేంద్రం ప్రదర్శించాలి. రాజ్యాంగపరమైన, చట్టపరమైన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకొంటున్నదనే అభిప్రాయం ఏర్పడితే, అది కేంద్ర-రాష్ట్రాల మధ్య అపనమ్మకాన్ని ఏర్పరుస్తుంది. అది మన ఫెడరల్ వ్యవస్థకూ తీరని నష్టం కలిగిస్తుంది. కేంద్రరాష్ట్రాలు, స్థానిక సంస్థలు, పౌరులు ఒకే మాట, ఒకే బాటగా మసలుకొంటేనే భారత్ అన్ని విధాలుగా పురోగమించగలుగుతుంది. అందర్నీ కలుపుకొనిపోకుండా పైనుంచి నిర్ణయాలను, పరిష్కారాలను రుద్దడం ఫెడరల్ స్ఫూర్తి అనిపించుకోదు. పలు రాష్ట్రాలు అప్పులు చేయడానికి నిరాకరించి, కేంద్రమే జీఎస్టీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. కానీ, కొవిడ్ అవాంతరం వల్ల తనకూ ఆదాయం తగ్గింది కాబట్టి, పరిహారం చెల్లించే స్తోమత తనకు లేదని కేంద్రం చెబుతోంది. రాష్ట్రాలే అప్పులు చేసి బండి నెట్టుకురావాలని సూచించింది. జీఎస్టీ ఆదాయ లోటును తట్టుకోవడానికి రాష్ట్రాలు అదనంగా అప్పులు చేయడం వల్ల, కొన్ని నెలలపాటు బండి లాగించవచ్చు కానీ, అది తాత్కాలిక ఉపశమనంగానే ఉండిపోతుంది. కేంద్రం దీన్ని విస్మరించి, రాష్ట్రాలతో అప్పులు చేయిస్తే అది మున్ముందు పౌరుల నెత్తిన పన్నుల భారం పెంచుతుంది.
'దైవిక చర్య'కు తావు లేదు...
ఏ రాజ్యాంగ నిబంధన లేదా చట్టాన్నైనా నిర్నిబంధంగా అమలు చేయడం ప్రభుత్వ విధి, బాధ్యత. తమ బాధ్యతను నెరవేర్చకుండా ఏదో దైవిక చర్య అడ్డుపడిందని చెప్పడం కుదరదు. న్యాయపాలనలో దైవ జోక్యానికి, విధి రాతకు తావు లేదు. 1872 భారత కాంట్రాక్టు చట్టంలో దైవిక చర్య ప్రస్తావన ఉంది కానీ, జీఎస్టీ చట్టంలో అది లేదు. కాంట్రాక్టు చట్టం వ్యక్తుల మధ్య కుదిరే ఒప్పందాలకు వర్తిస్తే, జీఎస్టీ చట్టం యావత్ సమాజానికి వర్తిస్తుంది. దీన్ని పట్టించుకోకుండా బట్టతలకు, మోకాలికి, ముడివేయడం మన ప్రజాస్వామ్యానికి హానికరం. కాబట్టి కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని చెల్లించకతప్పదు. లేదా రాష్ట్రాలను మరేదైనా పరిష్కారానికి ఒప్పించాలి. న్యాయ సూత్రాల ప్రకారం భారత కాంట్రాక్టు చట్టంలోని సాధారణ నిబంధన కంటే- జీఎస్టీ (రాష్ట్రాలకు పరిహార) చట్టంలోని ప్రత్యేక నిబంధనదే పైచేయి అవుతుంది. కాబట్టి కాంట్రాక్టు చట్టంలోని దైవిక చర్యకు జీఎస్టీలో తావు లేదు. ఏతావతా రాజ్యాంగ నిబంధనలు, న్యాయ పాలన సూత్రాలను అనుసరించి కేంద్రం, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సిందే.
ఇదీ చదవండి- అవసరాలే ఆవిష్కరణలకు ఆలంబన: జస్టిస్ రమణ