ETV Bharat / opinion

అరబ్‌ గడ్డతో ఆత్మీయ బంధం!

కొద్ది కాలంగా గల్ఫ్‌, భారత్‌ల మధ్య స్నేహం పెరుగుతోంది. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ యువరాజు మహమ్మద్​ బిన్​ జయేద్​ అలీ నహ్యాన్​, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్​ బిన్​ సల్మాన్​లు భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. గల్ఫ్‌ దేశాలతో భారత్‌ సంబంధాల్లో పొడగడుతున్న మౌలిక మార్పునకు సంకేతాలుగా వీటిని చూడాలి. కొంతకాలంగా ఇరు ప్రాంతాల మధ్య సుహృద్భావం పెల్లుబుకుతోంది.

Gulf, India ties
అరబ్‌ గడ్డతో ఆత్మీయ బంధం!
author img

By

Published : Dec 5, 2020, 7:58 AM IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ యువరాజు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అలీ నహ్యాన్‌ మూడేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రొటోకాల్‌ నిబంధనలనూ పక్కనపెట్టి స్వయంగా తరలివెళ్ళి- న్యూదిల్లీ విమానాశ్రయానికి విచ్చేసిన జయేద్‌కు ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌కు వచ్చినప్పుడూ ప్రధాని మోదీ అంతే ఆత్మీయంగా స్పందించారు. యూఏఈ, సౌదీ యువరాజుల రాక సందర్భంగా ప్రదర్శితమైన తాత్కాలిక ఉద్వేగ స్పందనలుగా వాటిని తీర్మానించలేం. గల్ఫ్‌ దేశాలతో భారత్‌ సంబంధాల్లో పొడగడుతున్న మౌలిక మార్పునకు సంకేతాలుగా వీటిని చూడాలి. కొంతకాలంగా ఇరు ప్రాంతాల మధ్య సుహృద్భావం పెల్లుబుకుతోంది. నాయకుల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం పరిఢవిల్లుతున్నాయి.

శతాబ్దాల అనుబంధం

చారిత్రకంగా గల్ఫ్‌ దేశాలకు, భారత్‌కు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సాంస్కృతిక, వారసత్వ సంపదపరంగా ఇరు ప్రాంతాల నడుమ ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. భారత్‌లోని కోట్లాది ప్రజలు అత్యంత పవిత్రమైనవిగా భావించే మక్కా, మదీనాలు గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నాయి. మరోవంక చారిత్రక గాథలు, భాషలు, మతాలు, ఆహారం, నిర్మాణ శైలి ప్రాతిపదికన ఇరు ప్రాంతాలపైనా గాఢమైన పరస్పర ముద్ర ఉంది. గల్ఫ్‌, భారత్‌ల మధ్య ముడివడిన సాంస్కృతిక, వారసత్వపరమైన గాఢమైన సారూప్యతలను అరబ్‌ గడ్డతో ఆత్మీయ బంధం! మరెన్నింటినో పరిశోధించి వెలికితీయాల్సి ఉంది. కాలక్రమంలో గల్ఫ్‌ దేశాలతో చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. గడచిన ఆరేళ్లకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత్వంలో ఈ బంధం బలీయంగా రూపుదిద్దుకొంది. 'పశ్చిమంవైపు చూపు' (లుక్‌ వెస్ట్‌) విధానాన్ని పట్టాలకెక్కించి గల్ఫ్‌ ప్రాంతంతో మేలైన సంబంధాలు నెలకొల్పుకొనేందుకు మోదీ ఎడతెగని ప్రయత్నాలు చేశారు. ఫలితంగా గల్ఫ్‌లోని కొన్ని దేశాలతో భారత్‌ సంబంధాలు ద్వైపాక్షిక భాగస్వామ్యాలనుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పరిణతి చెందాయి. గల్ఫ్‌ దేశాలతో ఈ స్థాయిలో బలమైన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడమంటే దాని అర్థం- వాటితో కీలకమైన రంగాలు, అంశాలపై సానుకూల చర్చలకు మార్గం సుగమం చేసుకోవడమే. భారత ప్రధాని, సౌదీ యువరాజులతో శిఖరాగ్ర స్థాయిలో ఇరు దేశాల నడుమ ప్రత్యక్ష సంప్రదింపులకు, అనుసంధానానికి వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటైంది. అదే విధంగా యూఏఈతో సైతం అత్యున్నత స్థాయిలో ఏర్పాటైన మంత్రివర్గ బృందాల సారథ్యంలో వ్యూహాత్మక అనుబంధం కొత్త చివుళ్లు తొడుగుతోంది. గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య బంధం క్రమంగా బలపడుతోంది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య రాకపోకలూ మునుపటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూఏఈ; సౌదీ అరేబియా నాలుగో స్థానంలో ఉంది. ఇంధనం, రిఫైనింగ్‌, పెట్రో కెమికల్స్‌, మౌలిక సౌకర్యాలు, వ్యవసాయం, ఖనిజాలు, మైనింగ్‌ రంగాల్లో సౌదీ అరేబియా వంద బిలియన్‌ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. మరోవంక భారత్‌లోకి ఎఫ్‌డీఐలు మోసుకొస్తున్న తొలి పది దేశాల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా ఒకటి.

గల్ఫ్‌దేశాల్లో భారతీయ సమాజం పెద్దయెత్తున విస్తరించి ఉంది. అక్కడ స్థిరపడిన 85 లక్షలమందికిపైగా భారతీయులు ఇరు ప్రాంతాల అనుబంధానికి గీటురాయిగా ఉన్నారు. భారీయెత్తున భారతీయులు గల్ఫ్‌లో ఉన్నందువల్ల ఆ ప్రాంతంనుంచి మనకు పెద్దయెత్తున విదేశ మారకద్రవ్యమూ తరలివస్తోంది. 2018లో దాదాపు 5000 కోట్ల డాలర్ల విదేశ మారకద్రవ్యం గల్ఫ్‌నుంచి భారత్‌కు వచ్చినట్లు అంచనా! అదే సందర్భంలో విశిష్ట నైపుణ్యాలతో అలరారే భారతీయుల సేవలను సద్వినియోగం చేసుకుని గల్ఫ్‌ దేశాలు అపారంగా లబ్ధి పొందుతున్నాయి. కొంతకాలంగా భారతీయ సమాజం ప్రయోజనాలపట్ల, వారి సాంస్కృతిక అవసరాలపట్ల గల్ఫ్‌ భాగస్వామ్య మండలి (జీసీసీ) దృక్పథం గుణాత్మకంగా మారుతోంది. భారతీయులు ఆలయాన్ని నిర్మించుకోవాలని భావిస్తే- యూఏఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అందుకు సమ్మతించడమే గల్ఫ్‌ దేశాల దృక్పథం మారుతోందనడానికి దాఖలా. భారత్‌, గల్ఫ్‌ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు హైడ్రోకార్బన్‌ వెన్నెముకగా నిలుస్తోంది. ఇరు ప్రాంతాల నడుమ 2019-20లో చోటుచేసుకున్న హైడ్రోకార్బన్‌ వాణిజ్యం విలువ 6200 కోట్ల డాలర్లు! ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం హైడ్రోకార్బన్‌ వాణిజ్యంలో ఈ వాటా 36శాతం కావడం గమనార్హం.

భారత్‌ తలపెట్టిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (ఎస్‌పీఆర్‌) కార్యక్రమంలో మున్ముందు సౌదీ అరేబియా, యూఏఈలు భాగస్వాములుగా మారే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈలో జరిపిన చరిత్రాత్మక పర్యటన సందర్భంగా భారతీయ చమురు కంపెనీలకు 'అబు దబీ లోయర్‌ జకుమ్‌'లో ఆ దేశం పదిశాతం వడ్డీ రాయితీలను ప్రకటించింది. 2015లో పర్యటన ద్వారా యూఏఈని సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర పుటలకెక్కారు. ఆ తరవాత ఆయన 2018లోను, 2019లోనూ యూఏఈలో పర్యటించారు. మోదీ పర్యటన సందర్భంగా నిరుడు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌'ను ప్రకటించి మన ప్రధానిని యూఏఈ సర్కారు గౌరవించింది. ఇరు ప్రాంతాల సంబంధాల అభివృద్ధికి మోదీ చేసిన కృషికి గాను యూఏఈ ఆ పురస్కారం ప్రకటించింది. అంతకు మూడేళ్ల ముందు కింగ్‌ అబ్దులజీజ్‌ సష్‌ అవార్డుతో సౌదీ అరేబియా సర్కారు- నరేంద్ర మోదీని సత్కరించింది. అనంతరం బహ్రెయిన్‌ తమ దేశ మూడో అత్యున్నత పురస్కారమైన 'కింగ్‌ హమద్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద రినైజన్స్‌'తో 2019లో మోదీని గౌరవించింది. సౌదీ అరేబియా, ఖతార్‌, ఒమన్‌, ఇరాన్‌, బహ్రెయిన్‌లతో అనుబంధాలను పెంచుకోవడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ఆ దేశాల్లో పర్యటించారు. అందుకు ప్రతిగా గల్ఫ్‌ దేశాధినేతలూ భారత్‌లో విరివిగా పర్యటించారు. ఇరు ప్రాంతాల సంబంధాలను మేలిమలుపు తిప్పిన పరిణామాలివి.

ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు..

కువైట్‌లో అత్యంత గౌరవ ప్రపత్తులు అందుకున్న షేక్‌ సబ అల్‌ సబ (అమిర్‌ ఆఫ్‌ కువైట్‌) సెప్టెంబరులో మరణించినప్పుడు భారత్‌ అధికారికంగా ఒక రోజు సంతాప దినం ప్రకటించింది. ఆ చర్య కువైట్‌ ప్రజల మనసులను ఎంతగానో కదిలించింది. భారత్‌, గల్ఫ్‌ నాయకత్వాల మధ్య నెలకొన్న వ్యక్తిగత అనుబంధం దేశాల సంబంధాలను సుదృఢంగా మార్చింది. కొవిడ్‌ మహమ్మారి బారినపడి గల్ఫ్‌ సమాజం అల్లాడుతున్నప్పుడు భారత్‌ ఎంతో మానవీయంగా స్పందించింది. లాక్‌డౌన్‌ సందర్భంగా గల్ఫ్‌ దేశాలకు భారత్‌ ఔషధాలను, ఆహారాన్ని, అత్యవసర వస్తువులను నిరంతరాయంగా సరఫరా చేసింది. వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని గల్ఫ్‌ ప్రాంతానికి ఆరువేల మంది ఆరోగ్య కార్యకర్తలను తరలించింది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో సహాయ సహకారాలు అందించేందుకు అనువుగా భారత్‌ ఏప్రిల్‌ 2020లో 15మంది సభ్యులతో కూడిన తక్షణ స్పందన బృందాన్ని కువైౖట్‌కు తరలించింది. 'ప్రపంచ ఔషధ ఫ్యాక్టరీ'గా ఆవిర్భవించిన భారత్‌... గల్ఫ్‌ దేశాలకు అవసరమైన ఔషధ సాయాన్ని విరివిగా చేస్తోంది. ఈ క్రమంలోనే యూఏఈ సైతం సానుకూలంగా భారత్‌ అవసరాలపట్ల స్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా మూడు పర్యాయాలు ఎల్‌పీజీ రీఫిల్స్‌కు అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ అందుకు అవసరమైన వనరులు సమకూర్చేందుకు యూఏఈ ముందుకొచ్చింది. కొవిడ్‌ సందర్భంగా తమ దేశాల్లో ఉన్న భారతీయులందరినీ గల్ఫ్‌ దేశాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాయి. భారత్‌కు అవసరమైన ఇంధన భద్రతకు గల్ఫ్‌ ప్రాంతం భరోసా అందిస్తోంది. అదే క్రమంలో గల్ఫ్‌ దేశాల ఆహార భద్రతకు భారత్‌ బలమైన దన్నుగా నిలుస్తోంది. భారత్‌, గల్ఫ్‌ దేశాల నడుమ స్థిరపడుతున్న ఈ బంధం ఇరు ప్రాంతాల పరస్పరాభివృద్ధికి అద్భుతంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

- ధర్మేంద్ర ప్రధాన్, (కేంద్ర పెట్రోలియం, సహజవాయు, ఉక్కు శాఖల మంత్రి)

ఇదీ చూడండి: 'ప్రపంచానికి భారత్​ విశ్వసనీయ భాగస్వామి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.