ETV Bharat / opinion

ఆర్థిక సమాఖ్య భావనపై సమ్మెట

జీఎస్టీ రాకతో పన్ను రాబడులపై రాష్ట్రాల విచక్షణాధికార పరిధి కుంచించుకుపోగా- నిధులకోసం కేంద్రం ముందు మోరసాచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. వచ్చే అయిదేళ్ల కాలావధిలో సంచిత నిధినుంచి భిన్న పద్దులకింద రాష్ట్రాలకు రూ.52 లక్షల 41వేల కోట్ల పైచిలుకు నిధులు అందుతాయని ఆర్థిక సంఘం ప్రకటిస్తున్నా-  ఏకంగా లక్షా 80వేల కోట్ల రూపాయల గ్రాంటులపై కేంద్రం ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తుందట. ఈ పోకడ ఆర్థిక సమాఖ్య భావనపై సమ్మెట!

Finance Commission
ఆర్థిక సమాఖ్య భావనపై సమ్మెట
author img

By

Published : Feb 3, 2021, 7:44 AM IST

కేంద్రం-రాష్ట్రాల నడుమ సహేతుక వనరుల పంపిణీయే రాజ్యాంగ విహిత బాధ్యతగా పురుడు పోసుకొన్న ఆర్థిక సంఘానికిది డెబ్భయ్యోపడి. ప్రణాళికా సంఘం కాలగర్భంలో కలిసిపోయి, వస్తు సేవల పన్ను వ్యవస్థ (జీఎస్‌టీ) కొత్తగా పుట్టుకొచ్చి, కొవిడ్‌ మహా సంక్షోభంలో ప్రపంచార్థికమే కుదేలైన నేపథ్యంలో పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక ఇదమిత్థంగా ఏం ఉద్ధరించిందో చూడాలి! తనను తాను 'కొవిడ్‌కాల ఆర్థిక సంఘం'గా సంభావిస్తూ ఇచ్చిన నివేదిక సాంతం- మోదీ సర్కారు పరిశీలనాంశాల పేరిట గీసిన వివాదస్పద లక్ష్మణ రేఖలకు అనుగుణంగానే సాగిపోయింది. 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే తమిళనాడు తప్ప తక్కిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలూ కోల్పోయింది రూ.16,640 కోట్లు. 2021-26 సంవత్సరాల నడుమ ఆ రాబడి నష్టం రూ.94వేల కోట్లకు విస్తరించనుందంటున్నారు!

ఆర్థిక సమాఖ్యపై సమ్మెట!

పద్నాలుగో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు చేసిన 42శాతం కేటాయింపుల్ని పునఃపరిశీలించాలని కోరిన కేంద్ర ప్రభుత్వం- కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలుగా కొలువుతీరిన జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ల కోసం ఒక్క శాతాన్ని ప్రత్యేకించి, తక్కిన 41శాతాన్ని రాష్ట్రాలకు బదలాయించాలన్న సూచనను మన్నించింది. గత ఆర్థిక సంఘం 42శాతం కేటాయించినా, వాస్తవంగా వనరుల బదిలీ 35శాతం దాటలేదంటున్న రాష్ట్రాలు 50శాతం కోసం చేసిన విజ్ఞప్తి అక్షరాలా బధిర శంఖారావం అయింది. వచ్చే అయిదేళ్ల కాలావధిలో సంచిత నిధినుంచి భిన్న పద్దులకింద రాష్ట్రాలకు రూ.52 లక్షల 41వేల కోట్ల పైచిలుకు నిధులు అందుతాయని ఆర్థిక సంఘం ప్రకటిస్తున్నా- ఏకంగా లక్షా 80వేల కోట్ల రూపాయల గ్రాంటులపై కేంద్రం ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తుందట. ఈ పోకడ ఆర్థిక సమాఖ్య భావనపై సమ్మెట!

ఉమ్మడి బాధ్యతగా ఎందుకు భావించలేదో!

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఇనుమడించిన విత్త సత్తువ, స్వయం ప్రతిపత్తితో రాష్ట్రాలు తమ పథకాలు, కార్యక్రమాల్ని తామే రూపొందించుకొని ప్రగతి పథంలో పయనించేలా చూడాలన్నదే స్వీయ విధానమని 2015లో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నిధులు విధులపరంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య నిలువెత్తు అసమతౌల్యం ఉందన్న ఆర్థిక సంఘం పెద్దలు- పన్నులు సుంకాల రూపేణా వనరుల్ని పెంపొందించే అధికారాన్ని కేంద్రానికి, ఎంతో వ్యయభారం కాగల బాధ్యతల బరువును రాష్టాలకు రాజ్యాంగమే బదలాయించిందని నివేదికలోనే వెల్లడించారు. 62.7శాతం ఆర్థిక వనరులున్న కేంద్రానికి 37.6శాతం వ్యయ పద్దు ఉంటే, 37.3శాతం రాబడిగల రాష్ట్రాలపై 62.4శాతం వ్యయ భారం పడుతోందనీ ప్రకటించారు. ఈ వాస్తవం తెలిసి కూడా దేశ రక్షణ, అంతర్గత భద్రత ఖర్చుల్ని రాష్ట్రాలు సైతం నెత్తికెత్తుకొనేలా సంచిత నిధినుంచే కేటాయింపులు జరపాలని కేంద్రం కోరింది. రాజ్యాంగ నిపుణులతో సంప్రదించే ఆ ప్రతిపాదనను మన్నించామన్న ఆర్థిక సంఘం- స్థూల రాబడుల్లో కేంద్రం రాష్ట్రాల వాటాకు సాపేక్షంగా ఒకశాతం కోతపెట్టి, మొట్టమొదటిసారిగా దేశ రక్షణ పద్దుకు ప్రత్యేకించింది. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం కాగా, అయిదు లక్షల పైచిలుకు ఖాళీలతో పోలీసు యంత్రాంగం కుదేలవుతున్న దశలో, దాని ఆధునికీకరణకు నిధులివ్వడాన్ని కొన్నేళ్ల క్రితమే ఆపేసిన కేంద్రం- రాష్ట్రాల భారాన్ని ఉమ్మడి బాధ్యతగా ఎందుకు భావించలేదో మరి! రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లేని సెస్సుల్ని విపరీతంగా పెంచుకొంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వం- రాష్ట్రాల విజ్ఞప్తుల్ని బేఖాతరు చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల్ని 30నుంచి 35కు, కేంద్ర పథకాల్ని 685 నుంచి 704కు పెంచేసింది. వసేప రాకతో పన్ను రాబడులపై రాష్ట్రాల విచక్షణాధికార పరిధి కుంచించుకుపోగా- నిధులకోసం కేంద్రం ముందు మోరసాచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఆ దురవస్థను తప్పించడంలో యథాపూర్వం ఈ ఆర్థిక సంఘమూ విఫలమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.