ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్ విజృంభణ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడచిన రెండు వారాల్లో 58 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటింది. వాటిలో 37 ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 2.21 శాతమే! ఈశాన్యంలో పరిస్థితి కట్టుదాటుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో కొవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ, టీకా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని కేంద్రం సూచించింది.
ఫలితాలపై అనుమానం..
ఇప్పటివరకు ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలే చేస్తున్నారు. నిజానికి యాంటీజెన్ పరీక్షల ఫలితాలపై చాలా అనుమానాలున్నాయి. వాటిలో నెగెటివ్ వచ్చిన వారు పాజిటివ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అదే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలతోనైతే ఫలితాలు చాలావరకు కచ్చితంగా వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచితే సమస్య అసలు తీవ్రత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న మొత్తం కొవిడ్ పరీక్షల్లో మూడు శాతం మాత్రమే ఆర్‌టీపీసీఆర్ కావడం గమనార్హం. అసోమ్‌లో 12శాతం, మణిపుర్‌లో 14.69శాతం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో 17శాతం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఒక్క సిక్కిమ్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అక్కడ 73శాతం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు.
మరోవైపు ఉత్పరివర్తనాల భయం
దేశంలోని చాలా రాష్ట్రాల్లో మే నెలాఖరు నాటికి, కొన్ని చోట్ల జూన్ చివరి కల్లా కొవిడ్ రెండోదశ వ్యాప్తి చాలావరకు తగ్గింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళ, మహారాష్ట్రల్లో మహమ్మారి ఇంకా జడలు విప్పుతూనే ఉంది. ఇలా రెండోదశ పూర్తిగా అంతం కాకముందే ఆగస్టు లేదా సెప్టెంబరు నుంచి మూడోదశ ఆరంభం కావచ్చన్న హెచ్చరికలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశీయంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా, డెల్టా ప్లస్ ఉత్పరివర్తనాలు భయపెడుతున్నాయి. త్రిపురలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు ఇటీవల కలకలం సృష్టించాయి. వీటిని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. మరోవైపు ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న లాంబ్డా ఉత్పరివర్తనం మరింత ఆందోళన కలిగిస్తోంది.
పెరూ నుంచి..
లాంబ్డా ఉత్పరివర్తనం తొలిసారిగా నిరుడు పెరూలో వెలుగుచూసింది. ఆ తరవాత అది 31 దేశాలకు వ్యాపించింది. పెరూలో మే, జూన్ నెలల్లో వచ్చిన మొత్తం కొవిడ్ కేసుల్లో 82శాతం వరకు లాంబ్డా ఉత్పరివర్తనానివే! అదే సమయంలో చిలీలో ఈ రకం కేసులు 32శాతం మేర నమోదయ్యాయి. అర్జెంటీనానూ ఈ ముప్పు చుట్టుముట్టింది. అక్కడ ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన మొత్తం కేసుల్లో 37శాతం లాంబ్డా ఉత్పరివర్తనానివేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచం మొత్తమ్మీద కొవిడ్ మరణాల రేటు పెరూలోనే అధికంగా ఉంది. దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికోలకూ ఈ వైరస్ వ్యాపించింది. కొవిడ్ వైరస్‌లో డెల్టా ఉత్పరివర్తనాన్ని డబుల్ మ్యుటెంట్ అంటారు. మానవ కణాలపై దాడి చేసేందుకు అందులోని స్పైక్‌ప్రొటీన్ రెండు రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. అందుకే దాన్ని 'ప్రమాదకర' వేరియంట్‌గా శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఇక లాంబ్డా రకంలోనైతే స్పైక్ ప్రొటీన్ ఏకంగా ఏడు రకాలుగా మారి దాడి చేస్తోంది. దీనిలో ఎల్452 క్యూ రకం బాగా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందువల్లే ఒకరికి లాంబ్డా సోకితే- వాళ్లు కొవిడ్ బారినపడ్డారని తెలిసేలోపే మరింత మందికి అది అంటుకుంటోంది. దీని వ్యాప్తి వేగం అన్ని దేశాలనూ కలవరపరుస్తోంది. ఉత్పరివర్తనాలు అధికంగా ఉండటంతో లాంబ్డా రకం టీకాలకూ లొంగకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. ఇది త్వరలో ఇండియాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ తొలిదశ కంటే మలిదశ దేశీయంగా అల్లకల్లోలం సృష్టించింది. భారీ సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. మూడోదశలో లాంబ్డా రకం వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చు. పరిస్థితి అలా విషమించక మునుపే ప్రజలు మేలుకొనాలి. కొవిడ్ మార్గదర్శకాలను నిష్ఠగా పాటిస్తూ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వాలు సైతం ఆ మేరకు తగిన సన్నద్ధతతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
- కామేశ్
ఇదీ చూడండి:Covid Vaccine: 66 కోట్ల టీకా డోసులకు కేంద్రం ఆర్డర్!