మండుతున్న చమురు ధరలతో కొన్నాళ్లుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న (petroleum products in gst) సామాన్యులకు కొద్దిపాటి ఊరట లభించింది. లీటరు పెట్రోలుపై రూ.5, డీజిలుపై రూ.10 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రైతులకు బాసటగా నిలుస్తూ, ద్రవోల్బణాన్ని కట్టడి చేస్తూ, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు వెల్లడించింది. ఆ మేరకు హస్తిన బాటలో నడుస్తూ, వ్యాట్ భారం నుంచి వినియోగదారులకు కాస్త ఉపశమనం కల్పించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. 'సంక్షేమ పథకాల అమలుకు చమురు ఆదాయమే ఆయువుపట్టు. పెట్రో పన్నులకు కోతపెట్టడమంటే మన కాళ్లను మనం నరుక్కోవడమే' అని ఇంధన శాఖామాత్యులు హర్దీప్‌సింగ్ పురి ఇటీవల వ్యాఖ్యానించారు! చమురు ధరాఘాతాల్లో తప్పేమీ లేదన్నట్లు, అవి తప్పవన్నట్లు మరికొందరు నేతలూ సర్కారును వెనకేసుకొచ్చారు. కుటుంబాదాయాలు తెగ్గోసుకుపోయిన కొవిడ్ సంక్షోభ సమయంలోనూ సుంకాల పీడన కొనసాగించిన ప్రభుత్వంపై కొన్నాళ్లుగా విమర్శలు ముమ్మరిస్తున్నాయి.
పారదర్శక విధానాలతోనే..
గడచిన ఏడాదిన్నరలోనే లీటరు పెట్రోలుపై రూ.36, డీజిలుపై రూ.26.58 వంతున ఎగబాకిన ధరలు (petroleum products in gst) జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. వాటి మూలంగా వంటింటి బడ్జెట్లు 40శాతానికి పైగా పెరిగిపోతే- సాగుఖర్చులు తడిసిమోపెడై అన్నదాతలు ఆక్రందిస్తున్నారు. ఆటోడ్రైవర్లు, చిరు వ్యాపారులు, సరకు రవాణా వాహనాల యజమానులు.. ఎందరెందరో ఆర్థికంగా చితికిపోయారు. అధిక చమురు ధరలతో తయారీ, రవాణా రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ లోగడే ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రో ఉత్పత్తులపై పరోక్ష పన్నులు దిగివస్తేనే దేశార్థికానికి మేలు జరుగుతుందని గత నెలలోనూ ఆయన స్పష్టీకరించారు. పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించినట్లు- విదేశాల్లోని సుంకాలను పరిశీలించి, దేశీయంగా పెట్రో పన్నులను ప్రభుత్వం హేతుబద్ధీకరించాలి! జనసామాన్యానికి నిజంగా న్యాయం చేయాలంటే- ధరలకు కృత్రిమంగా కోరలు తొడిగే పన్ను పద్ధతులను సాకల్యంగా సమీక్షించి, పారదర్శక విధానాలకు పట్టంకట్టాలి!
జీఎస్టీ వర్తింపజేయడం..
చమురు దిగుమతులను తగ్గించడంలో పూర్వ ప్రభుత్వాల వైఫల్యమే ప్రస్తుత ధరాఘాతాలకు కారణమన్నది కేంద్రం వాదన! 2014తో పోలిస్తే ఆ తరవాత పెట్రోలుపై దాదాపు మూడున్నర రెట్లు, డీజిలుపై తొమ్మిది రెట్ల వరకు ఎగసిన ఎక్సైజ్ సుంకానిదే అసలు పాపమన్నది పచ్చినిజం! దానికి రాష్ట్రాల వ్యాట్ బాదుడు జతకలిసి- పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. పెట్రో రంగం నుంచి గడచిన ఏడేళ్లలో ప్రభుత్వాలు పిండుకున్న రూ.36.17 లక్షల కోట్ల మొత్తంలో అరవై శాతానికి పైగా కేంద్ర ఖజానాకే జమపడింది. తమ ఆదాయాలను ఇబ్బడిముబ్బడి చేసుకోవడానికి ప్రజల జేబులను గుల్లచేయడం సమర్థనీయం కాదు. జనశ్రేయమే కేంద్రబిందువుగా సరైన విధానాలను అనుసరిస్తూ, ఖర్చులను తగ్గించుకోవడంపై పాలకులు దృష్టి సారించాలి. పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాన్ని ఎనిమిదిన్నర రూపాయల వరకు తగ్గించినా కేంద్ర బడ్జెట్ ప్రభావితం కాదని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆరు నెలల క్రితం విశ్లేషించింది. ఆ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రజావళికి పెద్దయెత్తున లాభం ఒనగూడుతుందని ఎస్‌బీఐ నిపుణుల బృందం గతంలోనే సూచించింది. కానీ, దానికి సరైన సమయం ఇంకా ఆసన్నం కాలేదని కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల సెలవిచ్చారు! సామాన్యులకు సాంత్వన చేకూర్చేలా- పెట్రో ఉత్పత్తులకు జీఎస్టీని వర్తింపజేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకుసాగాలి. పోనుపోను పెనుభారమవుతున్న చమురు దిగుమతి వ్యయాన్ని అదుపు చేయడంలో భాగంగా- పునరుత్పాదక ఇంధన వనరులను సమధికంగా సమకూర్చుకోవాలి!
ఇదీ చదవండి:పుడమి రక్షణ దిశగా అమెజాన్, యాపిల్, మహీంద్రా జట్టు!