కరోనా వైరస్ చుట్టుముట్టడానికి ముందే భారత్‌లో ఆస్పత్రి వ్యర్థాల నిర్మూలన మహా అధ్వానంగా ఉండేది. కరోనా విరుచుకుపడ్డాక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దేశంలో కొవిడ్ ముందునాళ్లలో రోజుకు 609 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు వెలువడితే, కరోనా వచ్చాక దీనికి అదనంగా 101 టన్నుల కొవిడ్ వ్యర్థాలు విడుదల అవుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు జులైలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు తెలిపింది. తరవాత సెప్టెంబరులో రోజుకు 183 టన్నుల కొవిడ్ సంబంధ వ్యర్థాలు ఉత్పన్నమెనట్లు కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల్లో దేశమంతటా సుమారు 18 వేల టన్నుల కొవిడ్ బయోమెడికల్ వ్యర్థాలు వెలువడినాయి. ఇందులో అత్యధిక భాగం (3,587 టన్నులు) ఒక్క మహారాష్ట్రలోనే ఉత్పత్తి అయింది. దీని తరవాత రెండు, మూడు స్థానాలను తమిళనాడు, గుజరాత్ ఆక్రమించాయి. భారతదేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నకొద్దీ బయోమెడికల్ వ్యర్థాలు కొండల్లా పేరుకుపోతున్నాయి. అక్టోబరు 21నాటికి దేశంలో 9 కోట్ల 72 లక్షల పైచిలుకు కొవిడ్ పరీక్షలు జరగ్గా, 76 లక్షలమందికిపైగా పాజిటివ్ కేసులుగా తేలారు. ఈ పరీక్షలు, చికిత్సల ద్వారా వెలువడే వ్యర్థాల శుద్ధికి, నిర్మూలనకు కావలసినన్ని కేంద్రాలు దేశంలో కరోనా పరీక్షల కోసం లేబరేటరీల్లో వాడిన దూది, రక్త నమూనాలు, చికిత్సలో ఉపయోగించిన ఇంజెక్షన్లు, రక్త సంచులు, వైద్య పరికరాలు వైరస్ వ్యాపకాలుగా మారతాయి. ఇవాళ అందరూ వాడుతున్న మాస్కులను సరైన పద్ధతిలో నిర్మూలించకపోవడం వల్ల అవి కూడా వైరస్ వ్యాపకాలవుతున్నాయి.
శుద్ధి కేంద్రాలేవీ?
దిల్లీ నుంచి విజయవాడ వరకు కొవిడ్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అవసరాలకు తగినన్ని బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు లేకపోవడమే ఈ సమస్యకు మూలం. భారత్ లోని 138 కోట్ల జనాభాకు కేవలం 198 బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. దేశంలోని ఆస్పత్రుల్లో 225 వైద్య కేంద్రాలకు మాత్రమే సొంత శుద్ధి కేంద్రాలున్నాయి. నేడు కోట్లలో కరోనా పరీక్షలు జరుగుతూ వేల టన్నుల వ్యర్థాలు వస్తున్నా, వీటి పనిపట్టే సామర్థ్యం మనకు లేదు. ఉదాహరణకు దిల్లీలో ఉన్న రెండు శుద్ధి కేంద్రాలు రోజుకు 74 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలను మాత్రమే శుద్ధి, నిర్మూలన చేయగలవు. కానీ, మే నెలలో దిల్లీలో రోజుకు 25 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు వెలువడగా, జులైకల్లా రోజుకు 349 టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి. ముంబయిలో జూన్ నుంచి ఆగస్టు వచ్చేసరికి ఈ వ్యర్థాలు రెండింతలయ్యాయి. మొదట్లో వీటిని తగలబెట్టినా క్రమంగా శుద్ధికి, పునర్వినియోగానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. చైనాలోని వుహాన్‌లో కొవిడ్ వ్యర్థాల దహనానికి సంచార వాహనాలను ఉపయోగించారు. భారత్ కూడా స్వల్ప కాలంలో ఇలాంటి సంచార వాహనాలను నియోగించవచ్చు. రోగకారక బయోమెడికల్ వ్యర్థాల దహనం వాటిని నిరపాయకరంగా మారుస్తుంది. కానీ, దీనివల్ల ఖర్చూ, వాయు కాలుష్యమూ ఎక్కువే. అందువల్ల దహన ప్రక్రియను తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగించుకుంటూ, క్రమంగా బయోమీథేనైజేషన్, పునర్వినియోగం వంటి మార్గాలను చేపట్టాలి. కొవిడ్ వ్యాధి అదుపులోకి వచ్చిన తరవాతా ఇలాంటి పకడ్బందీ పద్ధతులను కొనసాగించాలి. ప్రస్తుతం ఆస్పత్రులతోపాటు, ఇళ్లలోనూ వ్యర్థాలను వేరు చేయాలని కాలుష్య నియంత్రణ బోర్డులు సూచిస్తున్నాయి. ఈ సూచనలపై ప్రజల్లో పెద్దయెత్తున చైతన్యం పెరగాలి. సంచిలో సంచి పెట్టి ఐసొలేషన్ వార్డుల వ్యర్థాలను సేకరించాలి. వైద్య సిబ్బంది వాడిన పీపీఈలు, గ్లవ్స్, గాగుల్స్, ఫేస్ షీల్డ్, యాప్రాన్ వంటివి ఎర్ర సంచీల్లో వేయాలని బోర్డులు నిర్దేశించాయి. మాస్కులు, తల మీద, పాదరక్షలకు ధరించే కవర్లు తదితరాలను పసుపు పచ్చ సంచిలో వేయాలి. వాటిపై కొవిడ్ వ్యర్థాలు అని రాయాలి. వాటిని మామూలు వ్యర్థాలతో కలపకూడదు. ఇళ్లలో ఐసొలేషన్‌లోనో, క్వారంటైన్‌లోనో ఉన్నవారూ తమ వ్యర్థాలను పచ్చని సంచుల్లో వేయాలని నొయిడా పాలక సంస్థ ప్రజలను కోరింది.
సురక్షిత పునర్వినియోగం అవసరం
వ్యర్థాలను విభజిస్తే- మునిసిపల్ సిబ్బంది వాటిని భద్రంగా దహన, శుద్ధి, పునర్వినియోగ కేంద్రాలకు పంపుతారు. సాధారణ, బయోమెడికల్ వ్యర్థాల విభజన, నిర్మూలన సక్రమంగా జరగకపోతే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టం. వైద్య సిబ్బంది వాడి పారేసిన ప్లాస్టిక్ పీపీఈ కిట్లను జీవ ఇంధనంగా, రోడ్లపై తారుగా మార్చవచ్చు. జాతీయ శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్)కు చెందిన నాలుగు అనుబంధ సంస్థలు ఈ పనిలోనే ఉన్నాయి. పీపీఈలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను చీల్చి- పెలెట్లుగా మార్చి ఆటొమొబైల్ విడిభాగాలుగా, ప్లాస్టిక్ కవర్లుగా, రోడ్డు నిర్మాణ సామగ్రిగా వినియోగించవచ్చు. భారతదేశం 2016 నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి లక్ష కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది. సాధారణ ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగార్హంగా మార్చే సాంకేతికత ఇప్పటికే మనకు ఉంది. కొవిడ్ సంబంధ ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగానికి భద్రమైన పద్ధతులను పాటించడమే తరువాయి. అయితే, ఇంతవరకు మానవాళి వినియోగించిన మొత్తం ప్లాస్టిక్ వస్తువుల్లో కేవలం తొమ్మిది శాతమే పునర్వినియోగమైందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 12 శాతాన్ని మండించి, మిగతా 79 శాతాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. కొవిడ్ వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. ప్రతి 1,000 కొవిడ్ పరీక్షల వల్ల 22 కిలోల ప్లాస్టిక్ (పీపీఈలతో సహా) వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. రోజుకు 6.6 లక్షల కరోనా పరీక్షలు చేసినప్పుడే 14,500 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు కోట్లలో పరీక్షలు జరుగుతున్నాయి కనుక మరెన్ని వేల టన్నులు వెలువడుతున్నాయో ఊహించుకొంటేనే భీతి పుడుతోంది. ఇప్పటికైనా ప్రజలు, వైద్యశాలలు అప్రమత్తం కావాలి.
- ఆర్య