ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడాసంబరమైన ఒలింపిక్స్ వస్తున్నాయంటే.. ఆతిథ్య దేశంలో ఏడాది ముందే సందడి మొదలైపోతుంది. ఇక ఒలింపిక్స్ ఏడాదిలోకి అడుగు పెట్టాక ఆ సందడి మరో స్థాయికి చేరుకుంటుంది. వంద రోజుల కౌంట్‌డౌన్ మొదలైన దగ్గర్నుంచి టార్చ్ ర్యాలీలు, స్టేడియాల ముస్తాబు, వాలంటీర్ల శిక్షణ, ఇంకా అనేక ప్రచార కార్యక్రమాలతో ఆతిథ్య నగరం కళకళలాడిపోతుంటుంది. ఆతిథ్య దేశంలో ఎక్కడ చూసినా ఒలింపిక్స్ ముచ్చట్లే వినిపిస్తాయి. తమ దేశం ఈ మహా క్రీడా సంబరానికి ఆతిథ్యమిస్తున్నందుకు ప్రజలు గర్వంతో ప్రపంచం వైపు చూస్తారు. కానీ ఈ పర్యాయం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్‌లో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. టార్చ్ ర్యాలీలు సహా ఒలింపిక్స్ ప్రచార కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. మాకొద్దీ ఒలింపిక్స్ అంటూ జపాన్ ప్రజల్లో 60 నుంచి 80 శాతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్‌ను రద్దు చేయాలంటూ ఆతిథ్య నగరం టోక్యోకు చెందిన ఆరు వేల మంది వైద్యులు ఉమ్మడిగా దేశ అధ్యక్షుడికి లేఖ రాశారు. దీంతో ఈ క్రీడా సంరంభం నిర్వహణపై సందేహాలు ముసురుకున్నాయి.
మహమ్మారి కారణంగా..
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్- ఆనవాయితీ ప్రకారం 2020లోనే జరగాల్సింది. కానీ నిరుడు కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ మెగా టోర్నీని వాయిదా వేయక తప్పలేదు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో, రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940, 1944లలో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. వీటిని మినహాయిస్తే 1896లో ఏథెన్స్ వేదికగా జరిగిన తొలి ఒలింపిక్స్ మొదలు- ప్రతి నాలుగేళ్లకోసారి క్రీడలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. కరోనా కారణంగా ఒలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఏడాది పాటు క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బంది ఉండదనే అందరూ భావించినా- కరోనా రెండోదశ విజృంభణతో జపాన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అక్కడ మహమ్మారి ప్రభావం గట్టిగానే ఉంది. జనాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలో టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఆత్యయిక పరిస్థితి విధించాల్సి వచ్చింది.
సురక్షితంగా నిర్వహిస్తాం
మరోవైపు ఒలింపిక్స్‌పై వెనక్కి తగ్గేది లేదని, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండా, సురక్షితంగా క్రీడలను నిర్వహిస్తామని ప్రధాని యోషిహిదే సూగా నొక్కి వక్కాణిస్తున్నారు. ఒలింపిక్స్ ఆరంభ సమయానికి క్రీడాకారులకే కాకుండా క్రీడా గ్రామం సమీపంలోని ప్రాంతాల్లో 80 శాతం ప్రజలకు టీకాలు వేస్తామని, 'బయోబబుల్'లో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహిస్తామని ఐఓసీ అంటోంది. ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారుల సంఖ్య 11 వేలు. సహాయ సిబ్బంది అయిదు వేల మంది కాగా.. మొత్తంగా ఒలింపిక్స్ నిర్వహించడానికి కనీస స్థాయిలో 60 వేల మంది భాగస్వామ్యం ఉంటుందని అంచనా. ఇంతమందిని బయోబబుల్ వాతావరణంలో ఉంచి ఏమేరకు సురక్షితంగా ఒలింపిక్స్‌ను నిర్వహిస్తారన్నది ప్రశ్న. ఒలింపిక్స్ కోసమని ఎన్నో ఏళ్లుగా ఎంతో శ్రమించి, ఇప్పటికే రూ.18 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిన జపాన్ ప్రభుత్వం.. ఇప్పుడు క్రీడలను రద్దు చేస్తే ఈ శ్రమ, ఖర్చు బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తోంది.
ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించకపోవడంతో జపాన్‌కు రావాల్సిన ఆదాయంలో భారీగా కోత పడనుంది. ఆదాయపరంగా కనిపిస్తున్న ఏకైక ఆశ- ఒలింపిక్స్ ప్రసార హక్కులే. క్రీడలను రద్దు చేసి ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి జపాన్ ప్రభుత్వం కానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కానీ సిద్ధంగా లేవు. అందుకే జపాన్‌లో ఒలింపిక్స్ ఆగవని ఐఓసీ స్పష్టం చేసింది. టోక్యో కోసం కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న క్రీడాకారులు- ఒలింపిక్స్ వాయిదా పడటంతో అయోమయంలో పడిపోయారు. ఏడాదిగా సాధన సరిగ్గా సాగలేదు. ఒలింపిక్స్ అర్హత పోటీలు రద్దయి టోక్యో రేసులో ఉన్న క్రీడాకారులు చాలామంది అవకాశం కోల్పోయారు. పోటీలకు అర్హత సాధించిన వారి సన్నాహాలూ సజావుగా సాగడంలేదు. జపాన్‌లో ఒలింపిక్స్ పట్ల ప్రజల వ్యతిరేకత, క్రీడల నిర్వహణపై చర్చోపచర్చలు వారిని మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి.
అయినా ఆశావహ దృక్పథంతో సన్నద్ధమవుతున్నారు. మరి ఇంకో రెండు నెలల తరవాత '32వ ఒలింపిక్స్ మొదలయ్యాయహో' అన్న మాట ప్రపంచానికి వినిపిస్తుందో లేదో వేచిచూడాలి.
- చంద్రశేఖర్‌రెడ్డి తిమ్మాపురం